మా సర్వీసులను క్రమబద్ధీకరించండి
► కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నేతల డిమాండ్
విజయనగర్ కాలనీ: కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని యూనివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులు ముట్టడించారు. తెలంగాణ ఆల్ లెక్చరర్స్ కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్ (టి–ఏయూసీటీఏ) అధ్యక్షుడు రామేశ్వర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అన్యాయాన్ని ప్రతిఘటించే ఎన్నో ఉద్యమాలకు వేదికలుగా నిలిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్స్ యూనివర్సిటీలకు ఇవ్వక పోవడం వల్ల యూనివర్సిటీలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. దీంతో యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, కాంట్రాక్ట్ అధ్యాపక వ్యవస్థ ఆవిర్భవించిందన్నారు. రెగ్యులర్ పోస్టుల్లో కూడా నియామకాలు చేపట్టకపోవడంతో కాంట్రాక్ట్ అధ్యాపకుల నియామకం మొదలైందన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు చాలీచాలని జీతాలు ఇస్తూ వెట్టిచాకిరి చేయిస్తూ యూజీసీ నిబంధనలను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ కార్యాలయంలో తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ కుమార్, కాంట్రాక్టర్ లెక్చరర్లు పాల్గొన్నారు.