వైభవంగా గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి!
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కూతురి వివాహం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పెళ్లి కోసం ఏకంగా రూ. 500 కోట్ల ఖర్చు చేయనున్నారనే వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎలా ఖర్చుచేస్తారనే విషయంపైనా కథనాలు వస్తున్నాయి.
గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మాణీ వివాహం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పాణ్యం విక్రమ్ దేవరెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడు రాజీవ్ రెడ్డితో ఈ నెల 16న బెంగళూరులో జరగనున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ పెళ్లికి ఆహ్వానిస్తూ గతంలో పంచిన శుభలేఖలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ పెళ్లి శుభలేఖ బాక్స్‌లో ఎల్ఈడీ స్క్రీన్ ఉండటం, బాక్స్ తెరువగానే.. అందులో గాలి జనార్దన్ రెడ్డి కుటుంబంపై చిత్రీకరించిన పెళ్లిపాట ఉండటం.. అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ వెరైటీ పెళ్లికార్డు ఒక్కోదానికి రూ. ఎనిమిదివేల వరకు ఖర్చు అయినట్టు కథనాలు వచ్చాయి.
ఇప్పుడు దేశమంతా నగదు బదిలీ వ్యవహారంలో మునిగిపోయిన సమయంలో ఏకంగా రూ. 500 కోట్లతో గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లి వేడుకను నిర్వహించనున్నట్టు కథనాలు వస్తున్నాయి. శ్రీ కృష్ణదేవరాయలకు చెందిన విజయనగర ప్యాలెస్‌ను పెండ్లిమండపంగా వేస్తారని, తిరుమల తిరుపతి దేవస్థానం పూజరులను ఈ పెళ్లి వేడుక నిర్వహించేందుకు పిలిచారని తెలుస్తోంది. అంతేకాకుండా గాలి జనార్దన్‌రెడ్డి చిన్ననాటి ఇంటిని పునర్నిర్మించి అందులోనే వరుడికి వధువు అప్పగింతల కార్యక్రమం చేపడతారని సమాచారం. అంతేకాకుండా బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్, ప్రభుదేవ, టాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో ప్రదర్శన ఇస్తారని కథనాలు వస్తున్నాయి.