హత్య కేసు నిందితులకు రిమాండ్
గజపతినగరం: తుమ్మికాపల్లిలో గ్రామంలో ఈ నెల 8న జరిగిన హత్య కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ కె.కె.వి.విజయ్నాథ్ తెలిపారు. ప్రియుడితో వివాహేతర సంబంధమే భర్త హత్యకు దారి తీసిందని చెప్పారు. బుధవారం గజపతినగరం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సింహాద్రి సత్యనారాయణ, సన్యాసమ్మ భార్యాభర్తలు. సన్యాసమ్మకు అప్పలరాజుతో మూడేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది.
ఆదివారం రాత్రి భర్త సత్యనారాయణ మద్యం సేవించి నిద్రిస్తున్న సమయంలో సన్యాసమ్మ తన ప్రియుడు అప్పలరాజును ఇంటికి రమ్మని కబురు చేసింది. అప్పలరాజు సన్యాసమ్మ ఇంటికి చేరాక సత్యనారాయణకు మెలకువ వచ్చింది. దీంతో భార్యాభర్తలిద్దరూ వాగ్వాదానికి దిగారు. అనంతరం సత్యనారాయణ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. బయటకు వెళ్తే తనను చంపివేస్తాడంటూ సన్యాసమ్మ తన భర్త హత్యకు దారి తీసే విధంగా అప్పలరాజును ప్రేరేపించింది. ఇద్దరూ కలిసి పక్కనే ఉన్న సుత్తితో సత్యనారాయణ తల, మర్మాంగంపై దాడి చేశారు. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని సోదరి కర్రి లక్ష్మి ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపినట్లు సీఐ తెలిపారు. నిందితులిద్దరినీ మంగళవారం బోడసింగిపేట వద్ద అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ పి.వరప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.