దుమారం రేపిన ఫొటో
న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోపై దుమారం రేగింది. పశ్చిమ బెంగాల్లో హిందువుల పట్ల తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా హర్యానా బీజేపీ నాయకురాలు విజేత మాలిక్ తన ఫేజ్‌బుక్ పేజీలో ఫొటో వివాదానికి కారణమైంది. భోజ్‌పురి సినిమా ‘ఔరత్ ఖిలోనా నహీ’లోని ఒక ఫోటోను ఫేస్బుక్లో షేర్ చేశారు.
అందరూ చూస్తుండగా నడిరోడ్డులో ఒక రాజకీయ నాయకుడు మహిళ చీర లాగుతున్న ఫొటో పోస్ట్ చేసి.. బెంగాల్లో హిందువుల పరిస్థితి దారుణంగా ఉందని కామెంట్ పెట్టారు. హిందువులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఫొటోలో చూపినట్టుగా హిందువులను బహిరంగంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను ఎందుకు వెనక్కు ఇచ్చేయడం లేదని ప్రశ్నించారు. హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల మమతా బెనర్జీ సర్కారు ఉదాసీన వైఖరి చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను చిన్నచూపు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు.
అభ్యంతకర ఫొటో పోస్ట్ చేసిన విజేత మాలిక్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె పెట్టిన ఫొటో మహిళలను కించేపరిచేలా ఉందని పేర్కొన్నారు. హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్న మాలిక్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ స్పందించలేదు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి నటించిన సినిమాలోని ఫొటోనే మాలిక్ పోస్ట్ చేయడం కొసమెరుపు.