టీఆర్ఎస్ను గెలిపిస్తే రైతు రుణాలు మాఫీ
అనంతగిరి, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ను గెలిపిస్తే రూ. లక్ష వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఆ పార్టీ పరిగి అసెంబ్లీ అభ్యర్థి హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ పట్టణంలో ఆదివారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వికారాబాద్ గర్జన’కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ గైర్హాజరయ్యారు. దీంతో చేసేది లేక సభను ప్రారంభించిన హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్తగా ఏర్పడే జిల్లాల్లో వికారాబాద్ పేరు ఫస్ట్ ఉంటుందన్నారు. కాంగ్రెస్ మాజీ మంత్రులు పొన్నాల, సబితారెడ్డి, గీతారెడ్డి తదితరులు సీబీఐ కేసుల్లో ఇరుక్కుపోయారని, అలాంటి పార్టీకి ఓటేస్తారా అని ప్రజల్ని ఆయన ప్రశ్నించారు.
టీడీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించవద్దని సూచించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఉద్యమ పార్టీ టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఎంపీడీఓ ఉద్యోగాన్ని త్యాగం చేసి ప్రజాసేవకు సిద్ధమైన సంజీవరావును వికారాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్‌లో మంజీరా నీటి కోసం రూ.5 కోట్లు ఇవ్వని కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరుకు మాత్రం రూ. 2 వేల కోట్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎం అయితేనే తెలంగాణలో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
వికారాబాద్‌లో శాటిలైట్ పనులు ప్రారంభమై ఐదేళ్లు గడుస్తున్నా అవి పూర్తి కాకపోవడం దారుణమన్నారు. ఎమ్యెల్యే అభ్యర్థి సంజీవరావు మాట్లాడుతూ.. తమకు ఓటు వేయకుంటే పింఛన్, రేషన్ కట్ చేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. వారి బెదిరింపులకు ప్రజలు భయపడవద్దని, వారికి టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, నాయకులు శుభప్రద్ పటేల్, స్వప్న, ఎన్నికల ఇన్చార్జి రోహిత్‌రెడ్డి, రాష్ట్ర కార్యద ర్శులు కృష్ణయ్య, విజయ్‌కుమార్, బంట్వారం పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, యాదగిరి యాదవ్, రాంచంద్రారెడ్డి, కొండల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటయ్య, బల్వంత్‌రెడ్డి, సమద్, వేణుగోపాల్‌రెడ్డి, రాంచందర్‌రావు, హన్మంత్‌రెడ్డి తదితరులున్నారు.