పేరుకే మినీ... పనులు సో మెనీ!
కరెంటు పోయింది. కొవ్వొత్తి వెలిగించాలి. టార్చ్‌లైట్ కోసం వెతుకుతాం. ఇది ఒకప్పుడు.
కరెంటు పోయింది. నో కొవ్వొత్తి.. నో టార్చ్‌లైట్.. సెల్‌ఫోన్ ‘వెలిగిస్తాం’. ఇది ఇప్పుడు. ఈ టైమ్‌లో.. ‘టార్చ్లైట్లండీ... టార్చ్‌లైట్లూ...’ అంటూ ఎవరైనా మన వీధిలో గానీ, ఆన్లైన్లో గారీ అరిస్తే కొంటామా? అసలు వింటామా? ఊహు! కానీ మాది అలాంటిలాంటి టార్చ్‌లైట్ కాదు అంటోంది ఓ ఫారిన్ కంపెనీ.
విషయం ఏంటంటే.. టార్చ్లైట్నీ, ఫ్లాష్లైట్నీ కలిపి హాంకాంగ్‌లోని ‘విక్డ్ లేజర్స్’ కంపెనీ ఓ ఫ్లాష్టార్చ్ని తయారు చేసింది. దానికి ‘ఫ్లాష్టార్చ్ మినీ’ అని పేరు పెట్టింది. మన ఇళ్లలో వాడే సాధారణ ఎల్.ఇ.డి. బల్బులు వెదజల్లే కాంతి సామర్థ్యం 470 లూమెన్లు అయితే, ఈ ఫ్లాష్ లైట్ 2,300 లూమెన్ల కాంతి శక్తితో కళ్లను జిగేల్మనిపిస్తుంది. టార్చ్ పొడవు ఎనిమిదిన్నర అంగుళాలు. బరువు పావు కిలో. చక్కగా బ్యాక్ పాకెట్లోనూ పట్టేస్తుంది. ‘బాబోయ్ ఇన్ని లూమెన్లను వెనుక జేబులో పెట్టుకుని తిరుగుతుంటే ఏమైనా ఉందా! పొరపాటున స్విచాన్ అయిపోతే బతుకు స్విచాఫ్ ఐపోదూ!’ అని కంగారు పడక్కర్లేదు. దానిష్టం వచ్చినప్పుడు వెలగకుండా, మన ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే వెలిగేందుకు ‘లాక్’ ఉంటుంది. అదేం పెద్ద విషయం కాదు కానీ, దీని వెలుగులో ఫుట్‌బాల్ ఆడేయొచ్చు. దీని వేడితో గుడ్డును ఉడకబెట్టుకుని, ఎగ్ కర్రీ కూడా చేసుకోవచ్చు! కాగితాలు సరేసరి. కొన్ని క్షణాలు లైట్‌ని ఫోకస్ చేసి ఉంచితే భగ్గుమంటాయి. మరి.. ఇంత లైట్ ఉంటే లెన్సులు, రిఫ్లెక్టర్ కరిగి, మాడి, మసైపోవా? పోవు. అన్నీ హీట్ రెసిస్టెంట్. వేడిని తట్టుకునేలా వాటిని తయారుచేశారట. అంతేకాదు, ఎంత కావాలో అంత కాంతి మాత్రమే వచ్చేలా టార్చ్లోపల మూడు స్థాయిలలో సెట్టింగులు ఉంటాయి. బ్యాటరీతో ఏకబిగిన గంటపాటు పనిచేస్తుంది. బ్యాటరీని బయటికి తీయక్కర్లేకుండానే రీచార్చ్ చేసుకోవచ్చు. ధర 200 డాలర్లు. అంటే.. 13 వేల 600 రూపాయలు. ‘ఓర్నాయనో అంత ధరా అనిపించవచ్చు కానీ.. ఆ మాత్రం ‘ఫ్లాష్’కి ఈ మాత్రం క్యాష్ తప్పదు’ అంటోంది విక్డ్ లేజర్స్ కంపెనీ.