గవర్నర్, సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
30న గవర్నర్, సీఎం ‘గుట్ట’కు రానున్నారని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి వెల్లడి
ఎస్పీతో కలిసి అధికారులతో సమీక్ష
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, చిన్నజీయర్ స్వామిజీలు ఈ నెల 30న రానున్నారని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ తెలిపారు. గవర్నర్, సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించేందుకు గాను సోమవారం కలెక్టర్, ఎస్పీలు గుట్టకు వచ్చారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ 30న ఉదయం 9గంటలకు యాదాద్రిలో చేపట్టే వైటీడీఏ అభివృద్ధి పనులను గవర్నర్, సీఎం ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
దీంట్లో భాగంగా సీఎం కేసీఆర్ కోసం కొండ కింద హెలిప్యాడ్ కోసం సైదాపురం, మల్లాపురం, సురేంద్రపురి గ్రామాలకు దగ్గరగా ఉన్న కొద్దిపాటి స్థలాలను పరిశీలించారు. అలాగే కొండపైన గల 14 ఎకరాల్లో దేవస్థానం నిర్మాణం జరుగుతుందన్నారు. కొండ కింద నుంచి కొండ పైకి లెసైన్సులు లేని వారు ఆటోలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సెక్స్ వర్కర్ల ఉపాధిపై వారిని కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఎవరూ జీవనోపాధి కోల్పోకుండా ఉండేందుకు నిర్వాసితులతో వేర్వేరుగా మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గుట్ట అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. గుట్టకు నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, విష్ణు పుష్కరిణికి నీటిని విడుదల చేయాలని ఆలయ ఈఓ గీతారెడ్డి కోరగా వెంటనే కలెక్టర్ స్పందించి 10 లక్షల గ్యాలరీల కృష్ణా వాటర్‌ను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎస్పీ దుగ్గల్ మాట్లాడుతూ గుట్టకు భక్తుల రద్దీ పెరుగుతున్నందున తగిన భద్రత అవసరమన్నారు. రానున్న రోజుల్లో కొండపైన పోలీస్టేషన్, కొండకింద మరో పోలీస్టేషన్, ఒక మహిళా పీఎస్, ట్రాఫిక్ పోలీస్టేషన్, సీసీ కెమెరా గది, కమ్యూనికేషన్ రూం, రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వీటన్నటిని పరిశీలించేందుకు ఒక డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు విష్ణు పుష్కరిణి, సంగీత భవనం, తదితర పరిసరాలను పరిశీలించారు.
ఇటీవల టెస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన ఎయిర్ కూలర్ సిస్టంను పరిశీలించి ఈఓ గీతారెడ్డిని అభినందించారు. అలాగే ప్రతిరోజు 40వేల మంది భక్తుల కోసం ప్రత్యేక వసతులైన మంచినీటి ఏర్పాటు , భోజన వసతి, లైటింగ్ సిస్టంను పరిశీలించి చాలా బాగుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బి.నరసింహామూర్తి, ఆర్డీఓ మధుసూదన్, డీఎస్పీ మోహన్‌రెడ్డి, ఈఓ గీతారెడ్డి, తహసీల్దారు రామమూర్తి, ఏఈఓ దోర్భల భాస్కర శర్మ, ఆర్అండ్ బీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, దేవస్తానం అధికారులు దయాకర్‌రావు, డీఈఈ రామారావు తదితరులు పాల్గొన్నారు.
స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్, ఎస్పీ
అంతకుముందు కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్‌లు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అర్చకులు పూలమాలతో స్వాగతం పలికి పూజల అనంతరం వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ నరసింహామూరి కలెక్టర్‌కు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులతోపాటు ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీ నరసింహాచార్యులు, నరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు ఉన్నారు.