‘కమలం’లో ‘కమిటీ’ల సందడి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కమల దళంలో సందడి మొదలైంది. పార్టీ సంస్థాగత ఎన్నికలకు అగ్రనాయకత్వం పచ్చజెండా ఊపడంతో ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈనెల 13నుంచి గ్రామస్థాయి కమిటీల ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టాలని పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఈ క్రమంలో గ్రామ కమిటీల ఎన్నికలపై నాయకులు దృష్టి కేంద్రీకరించారు. మండల కమిటీలు, జిల్లా కమిటీల ఏర్పాటులో గ్రామ కమిటీల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దీంతో అధ్యక్ష రేసులో ఉన్న లీడర్లు గ్రామ కమిటీల ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
నవంబర్ నెలాఖర్లో జిల్లా కమిటీ ఎన్నిక
భారతీయ జనతా పార్టీకి జిల్లాలో ప్రత్యేకస్థానముంది. ఈ పార్టీ నుంచి జిల్లాలో ఒక ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ ఉన్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థల్లోనూ పలువురు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జిల్లాలో గ్రామీణ, పట్టణ కమిటీలుగా పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి. పట్టణ ప్రాంత అధ్యక్ష, కార్యదర్శులుగా మీసాల చంద్రయ్య, కాంతారావులు బాధ్యతలు నిర్వహిస్తుంగా, గ్రామీణ ప్రాంత అధ్యక్షులుగా అంజన్‌కుమార్, బొక్క నర్సింహారెడ్డి కొనసాగుతున్నారు. తాజాగా సంస్థాగత ఎన్నికల పర్వం మొదలైన నేపథ్యంలో కొత్త కమిటీల ఏర్పాటుతో ప్రస్తుత కమిటీలు రద్దుకానున్నాయి.
గ్రామీణంలోనే పోటీ..
జిల్లాలో పార్టీ రెండు కమిటీలుండగా.. ఇందులో పట్టణ కమిటీలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గ్రామీణ కమిటీలో మాత్రం భారీ మార్పులు జరిగే అవకాశముంది. గత రెండు దఫాలుగా అంజన్‌కుమార్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన రాష్ట్ర కార్యవర్గంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న బొక్క నర్సింహారెడ్డి అధ్యక్ష రేసులో ఉన్నారు.
అంజన్‌కుమార్ అధ్యక్షుడిగా ఉన్న కార్యవర్గంలో నర్సింహారెడ్డి పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పెద్దల అండదండలు, జిల్లా పార్టీ ఆర్థిక వ్యవహారాల్లోనూ కీలకంగా పాల్గొంటుండడంతో ఆయనకు ఈసారి అవకాశం రానుందని సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా సరూర్‌నగర్ మండలానికి చెందిన శంకర్‌రెడ్డి, పరిగి నియోజకవర్గానికి చెందిన మరో నేత కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈసారి జిల్లా కమిటీ ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.