Village elders
-
‘మీకు పెళ్లయిపోయింది..పోండి’
అనంతపురం: ప్రేమ పేరుతో ఓ బాలికలను యువకుడు వంచించగా, గ్రామ పెద్దలు పంచాయితీ చేశారు. ఆ బాలిక మెడలో పసుపుతాడు కట్టించారు. ఈ పెళ్లి తంతుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు దృష్టిసారించారు. వివరాల్లోకి వెళితే... ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో 8వ తరగతి చదువుతున్న బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమపేరుతో వంచించాడు. తరచూ బాలిక ఇంటివద్దకు వెళ్తుండటంతో బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ నెల 18న పంచాయితీ చేశారు. బాలిక ఇంటి ముందు యువకుడి చేత తూతూ మంత్రంగా పసుపుతాడు కట్టించారు. ‘‘మీకు పెళ్లయిపోయింది..పోండి’ అంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పందించిన అధికారులు : బాలిక మెడలో పసుపుతాడు కడుతున్న యువకుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి స్పందించారు. ఉరవకొండ రూరల్ సూపర్వైజర్ తిరుపాల్భాయిని ఆమిద్యాలకు పంపగా...ఆమె బాలికను విచారించారు. బాలికను చైల్డ్ హోంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ బాల్యవివాహలు చట్టరీత్యా నేరమని, 8వతరగతి చదివే బాలిక పెళ్లి చెల్లుబాటు కాదన్నారు. బాలికలను కేజీబీవీ పాఠశాలలో ఉంచి మేజర్ అయ్యే వరకూ చదివిస్తామన్నారు. మరోవైపు పోలీసులూ ఈ ఘటనపై స్పందించారు. బాలిక మెడలో పసుపుతాడు కట్టిన యువకుడితో పాటు అందుకు ప్రోత్సహించిన గ్రామపెద్దలను పోలీసు స్టేషన్‌కు పిలిపించినట్లు తెలుస్తోంది. -
ఆ ప్రేమ జంట కథ సుఖాంతం
► ప్రేమ జంట, అడవి బిడ్డలను అక్కున చేర్చుకున్న గ్రామీణ ప్రజలు జయపురం(ఒడిశా): తప్పులు చేయడం మానవ సహజం. చేసిన తప్పువల్ల కలిగే అనర్థాలకు స్పందించి తప్పులను సరిదిద్దుకున్ననాడే మానవత్వం పరిమళిస్తుంది. తమ కులం కాని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గ్రామస్తులు ఆ ప్రేమ జంటను గ్రామం నుంచి వెలి వేసి సహాయ నిరాకరణ ప్రకటించడంతో ఆదంపతులు పడిన బాధలు, ముఖ్యంగా నిండు చూలాలు భరించరాని పురిటినొప్పులతో ఏ ఒక్కరూ సహాయం చేయక పోవడంతో దిక్కుతోచని స్థితిలో సమీప అడవిలోనే కవల బిడ్డలను కన్న సంఘటన సభ్య సమాజాన్ని కలవర పరిచిన విషయం విదితమే. దాదాపు మూడు గంటల కాలం పుట్టిన బిడ్డలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలింతను ఆశా కార్యకర్త వచ్చి చూసి బిడ్డల బొడ్లు కోసి 108 అంబులెన్స్‌ను రప్పించి మత్తిలి హాస్పిటల్‌కు తరలించిన తరువాత ఈ వార్త అన్ని ప్రధాన వార్తా పత్రికలలోను (సాక్షిలో కూడా) విసృత ప్రచారం పొందింది. దీంతో గ్రామపెద్దలు వారి తప్పును తెలుసుకున్నారు. కులాలు వేరైనా వారూ తమలాంటి వారేనన్న విషయాని గ్రహించి ఆ దంపతులను, వారికి పుట్టిన బిడ్డలను అక్కున చేర్చుకున్నారు. గ్రామ పెద్దల్లో వచ్చిన మార్పు మత్తిలి సమితి దొలపొడియ గ్రామ పంచాయవితీ కెంధుగుడ గ్రామం త్రిలోచన్ మత్తిలి గ్రామం గౌరి కమార్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం విదితమే, వారి కులాంతర వివాహాన్ని అంగీకరించని ఆగ్రామ పెద్దలు వారిని గ్రామం నుంచి వెలివేయడమే కాకుండా వారికి ఎవరూ ఎప్పుడూ ఎటువంటి సహాయం చేయకూడదని ఆంక్షలు విధించారు. సహాయం చేసిన వారికి కూడా గ్రామం నుంచి వెలి తప్పదని హెచ్చరించారు. అందువల్ల ప్రేమికులు ఊరికి దూరంగా గుడిసె వేసుకొని జీవిస్తుండేవారు. గౌరి గర్భవతి అయి పది నెలలు నిండగా ఆమె పురిటిìనొప్పులతో అల్లాడి సహాయానికి అర్ధించటం ఆఖరికి నిస్సహాయ స్థితిలో అడవిలో కవల బిడ్డలను కనడం తెలిసిందే. ఈ దయనీయ గాథ ప్రజలందరి హృదయాలలో సానుభూతిని నింపగా గ్రామపెద్దలు కూడా కుల మతాలను పక్కకు నెట్టి వారిని గ్రామంలోకి అనుమతించడమే కాకుండా వారిపై విధించిన ఆంక్షలను తొలగించారు.ప్రేమిక దంపతులు గౌరీ, త్రిలోచన్లను వారి కవల పిల్లలను గ్రామంలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామ పెద్దలు కరుణించడంతో త్రిలోచన్ తల్లిదండ్రులు కూడా ఆనందంతో కొడుకుకోడలిని దరిచేర్చుకుని చిన్నారి శిశువులను అక్కున చేర్చుకుని ప్రేమాభిమానాలను చూపించారు.మత్తిలి సమితి అధికారులు ప్రేమ దంపతులకు బీపీఎల్ కార్డుతో పాటు గ్రామీణ అవాస్ యోజనలో ఒక ఇల్లు మంజూరు చేశారు. ఏది ఏమైనా వెలివేతకు గురైన ప్రేమికుల కథ సుఖాంతమైంది. ఇది కులమతాలను పట్టించుకునే వారికి ఒక గుణపాఠం కాగదని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఆమె వేదన.. అరణ్య రోదన.! -
విరాళం ఇవ్వలేదని సాంఘిక బహిష్కరణ
మెట్పల్లి రూరల్: కరీంనగర్ జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్‌లో రామాలయం నిర్మాణం కోసం విరాళం ఇవ్వలేదని గ్రామ పెద్దలు మూడు కులాలను బహిష్కరించారు. ఈ బహిష్కరణ మంగళవారం నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించారు. జగ్గాసాగర్‌లో రామాలయాన్ని నిర్మించేందుకు గత వేసవిలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ), రామాలయ నిర్మాణ కమిటీలు నిర్ణయించాయి. గ్రామంలో సుమారు 5 వేల జనాభా ఉండగా, ప్రతి కుటుంబం రూ.500 చొప్పున చెల్లించాలని తీర్మానించాయి. ఒక కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు అదే ఇంట్లో నివసించే పెళ్ళైన వ్యక్తిని మరో కుటుంబంగా పరిగణిస్తూ ఇలా అందరూ విరాళం ఇవ్వాలని హుకుం జారీ చేశాయి. గ్రామంలో మాల కుటుంబాలు 80, గూండ్ల కుటుంబాలు 100, విశ్వబ్రాహ్మణ కుటుంబాలు 40 ఉన్నాయి. వీరు కుటుంబానికి రూ.500 చొప్పున ఇవ్వలేమని, కులానికి రూ.20 వేల చొప్పున ఇస్తామని వేడుకున్నారు. దీనికి గ్రామ పెద్దలు అంగీకరించకపోగా.. ఈ మూడు కులాలను సాంఘికంగా బహిష్కరించారు. వారికి నిత్యావసర సరుకులు అమ్మవద్దని, హోటళ్లలో చాయ్ పోయవద్దని, మంగలి వారు క్షవరం, గడ్డం గీయవద్దని ఆంక్షలు విధించారు. దీంతో బహిష్కరణకు గురైన కులస్తులు మీడియూకు సమాచారం అందించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో రాత్రి గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలను గ్రామపంచాయతీకి పిలిపించి చర్చించారు. ఈ విషయమై మెట్పల్లి ఎస్సై రాజేష్‌ను ‘సాక్షి’ సంప్రదించగా... తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, విషయం తెలిసి గ్రామానికి వెళ్లి చర్చించామని తెలిపారు.