ఆ ప్రేమ జంట కథ సుఖాంతం
► ప్రేమ జంట, అడవి బిడ్డలను అక్కున చేర్చుకున్న గ్రామీణ ప్రజలు
జయపురం(ఒడిశా): తప్పులు చేయడం మానవ సహజం. చేసిన తప్పువల్ల కలిగే అనర్థాలకు స్పందించి తప్పులను సరిదిద్దుకున్ననాడే మానవత్వం పరిమళిస్తుంది. తమ కులం కాని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గ్రామస్తులు ఆ ప్రేమ జంటను గ్రామం నుంచి వెలి వేసి సహాయ నిరాకరణ ప్రకటించడంతో ఆదంపతులు పడిన బాధలు, ముఖ్యంగా నిండు చూలాలు భరించరాని పురిటినొప్పులతో ఏ ఒక్కరూ సహాయం చేయక పోవడంతో దిక్కుతోచని స్థితిలో సమీప అడవిలోనే కవల బిడ్డలను కన్న సంఘటన సభ్య సమాజాన్ని కలవర పరిచిన విషయం విదితమే.
దాదాపు మూడు గంటల కాలం పుట్టిన బిడ్డలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలింతను ఆశా కార్యకర్త వచ్చి చూసి బిడ్డల బొడ్లు కోసి 108 అంబులెన్స్‌ను రప్పించి మత్తిలి హాస్పిటల్‌కు తరలించిన తరువాత ఈ వార్త అన్ని ప్రధాన వార్తా పత్రికలలోను (సాక్షిలో కూడా) విసృత ప్రచారం పొందింది. దీంతో గ్రామపెద్దలు వారి తప్పును తెలుసుకున్నారు. కులాలు వేరైనా వారూ తమలాంటి వారేనన్న విషయాని గ్రహించి ఆ దంపతులను, వారికి పుట్టిన బిడ్డలను అక్కున చేర్చుకున్నారు.
గ్రామ పెద్దల్లో వచ్చిన మార్పు
మత్తిలి సమితి దొలపొడియ గ్రామ పంచాయవితీ కెంధుగుడ గ్రామం త్రిలోచన్ మత్తిలి గ్రామం గౌరి కమార్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం విదితమే, వారి కులాంతర వివాహాన్ని అంగీకరించని ఆగ్రామ పెద్దలు వారిని గ్రామం నుంచి వెలివేయడమే కాకుండా వారికి ఎవరూ ఎప్పుడూ ఎటువంటి సహాయం చేయకూడదని ఆంక్షలు విధించారు. సహాయం చేసిన వారికి కూడా గ్రామం నుంచి వెలి తప్పదని హెచ్చరించారు. అందువల్ల ప్రేమికులు ఊరికి దూరంగా గుడిసె వేసుకొని జీవిస్తుండేవారు. గౌరి గర్భవతి అయి పది నెలలు నిండగా ఆమె పురిటిìనొప్పులతో అల్లాడి సహాయానికి అర్ధించటం ఆఖరికి నిస్సహాయ స్థితిలో అడవిలో కవల బిడ్డలను కనడం తెలిసిందే.
ఈ దయనీయ గాథ ప్రజలందరి హృదయాలలో సానుభూతిని నింపగా గ్రామపెద్దలు కూడా కుల మతాలను పక్కకు నెట్టి వారిని గ్రామంలోకి అనుమతించడమే కాకుండా వారిపై విధించిన ఆంక్షలను తొలగించారు.ప్రేమిక దంపతులు గౌరీ, త్రిలోచన్‌లను వారి కవల పిల్లలను గ్రామంలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామ పెద్దలు కరుణించడంతో త్రిలోచన్ తల్లిదండ్రులు కూడా ఆనందంతో కొడుకుకోడలిని దరిచేర్చుకుని చిన్నారి శిశువులను అక్కున చేర్చుకుని ప్రేమాభిమానాలను చూపించారు.మత్తిలి సమితి అధికారులు ప్రేమ దంపతులకు బీపీఎల్ కార్డుతో పాటు గ్రామీణ అవాస్ యోజనలో ఒక ఇల్లు మంజూరు చేశారు. ఏది ఏమైనా వెలివేతకు గురైన ప్రేమికుల కథ సుఖాంతమైంది. ఇది కులమతాలను పట్టించుకునే వారికి ఒక గుణపాఠం కాగదని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.