ఒక్కటై కదిలారు
ముత్తుకూరు, న్యూస్‌లైన్: ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా మండలంలోని పలు గ్రామాల రైతులు చేయి..చేయీ కలిపి వల్లూరు కాలువలో పాచి, చెత్త తొలగింపునకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ కాలువకు లైనింగ్ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు మట్టి, ఇసుకను వదిలేసి వెళ్లడంతో పాచి పెరిగి నీటి పారుదలకు తీవ్ర అవరోధంగా మారింది. కాంట్రాక్టర్ల ద్వారా వీటిని తొలగించడంలో ఇరిగేషన్ ఇంజనీర్లు నిర్లక్ష్యం వహించారు.
ఫైనల్ బిల్లులను కూడా చెల్లించడంతో కాలువ నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టర్లు వదిలి వె ళ్లగా, ఇరిగేషన్ ఇంజనీర్లూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. 40 రోజుల్లో కోతలకు రావాల్సిన వరి పంట నీరు లేక ఎండిపోతున్న తరుణంలో దువ్వూరువారిపాళెం, డమ్మాయపాళెం, పోతునాయుడుదిబ్బ, రామాపురం, వల్లూరు, పోలంరాజుగుంట, తదితర గ్రామాలకు చెందిన 300 మంది రైతులు, వ్యవసాయ కూలీలు పనులకు శ్రీకారం చుట్టారు. కలివెలపాళెం నుంచి రంగాచార్యులకండ్రిగ వరకు వల్లూరు కాలువలో పాచి, పిచ్చి మొక్కలను తొలగించారు. మూడు రోజులు నీళ్లు ఆపేసి లోతు తగ్గిన తర్వాత పాచి తొలగించేందుకు ఉపక్రమించారు.
ఇరిగేషన్ ఇంజనీర్ల నిర్లక్ష్యం
జలయజ్ఞం పనులను చేపట్టిన కాంట్రాక్టర్ల ద్వారా వల్లూరు కాలువ పూడికను తీయించాలి. ఈ విషయంలో ఇరిగేషన్ డీఈఈ కాంట్రాక్టర్ల కొమ్ము కాశారు. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టారు.
దువ్వూరు విజయభాస్కర్‌రెడ్డి, రైతు, దువ్వూరువారిపాళెం
మరో 40 రోజులు నీరు కావాలి
వల్లూరు కాలువ కింద వేసిన వరి పంటకు మరో 40 రోజుల పాటు సాగునీరు కావాలి. పూడిక తీయకుంటే వేలాది ఎకరాల్లో పైరు ఎండిపోతుంది. రైతులు బాగా నష్టపోతారు. గతంలో ఎప్పుడూ ఈ దుస్థితి రాలేదు.
పోచారెడ్డి చెంగారెడ్డి, రైతు, రామాపురం