పండక్కి ఊరెళుతున్నారా.. ఇది చదవండి!
సంక్రాంతి పండగ సెలవుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉదయం వేళ రద్దీని, పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, తదితర వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టాలని కోరారు. రాత్రివేళ అనుమానంగా కాలనీలో సంచరించేవారి గురించి పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
శివారు కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతికినట్లు కనిపిస్తే అప్రమత్తం కావాలని కోరారు. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి మోసపోవద్దన్నారు. ఇరుగు పొరుగు వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం మంచిదని సూచించారు. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని వచ్చేలా చూసుకోవాలన్నారు. పక్కింటి వారిద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవటం మంచిదన్నారు.
ఇంట్లో కుటుంబసభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్దుల వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని, ఏమరుపాటుగా ఉండవద్దని పోలీసులు హెచ్చరించారు. ఊరు వెళ్ళేటప్పుడు ఖరీదైన వస్తువులను ఇంట్లో పెట్టకపోవటమే మంచిదన్నారు. వాటిని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలన్నారు.
కాలనీల వారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి ప్రజలకు పోలీసులు సూచించారు. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడం మంచిదన్నారు. పోలీస్‌శాఖ వారికి దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలని కోరారు. ప్రత్యేకంగా చుట్టు పక్కల వారి ల్యాండ్‌ఫోన్, సెల్‌ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు సమీప పోలీస్స్టేషన్లను సంప్రదించాలని తెలిపారు. సంక్రాంతి పండగ సెలవుల్లో ఇళ్లకు తాళం వేసి వేరే ఊళ్లకు, సొంతూళ్లకు వెళ్లేవారి కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఈమేరకు సూచనలతో ఒక ప్రకటన విడుదల చేశారు.