మంత్రి, ఎంపీని తరిమికొట్టిన కోన ప్రజలు
- పోర్టుకు భూసేకరణపై ఆగ్రహం
మచిలీపట్నం: భూములపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలపై కృష్ణా జిల్లా బందరు మండలం కోన గ్రామ ప్రజలు తిరగబడ్డారు. బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమలకు భూసేకరణ అంశం గురించి మాట్లాడతాం.. అంటూ వెళ్లిన ప్రజాప్రతినిధులపై వారు విరుచుకుపడ్డారు. తీవ్రరూపం దాల్చిన నిరసన, కట్టలు తెచుకున్న ఆగ్రహంతో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులను తరిమికొట్టారు. భూసేకరణ అంశంపై రైతులతో మాట్లాడేందుకు మంత్రి, ఎంపీ, పలువురు టీడీపీ నాయకులు శనివారం రాత్రి ఏడు గంటలకు అక్కడకు వెళ్లారు. కోన పంచాయతీ కార్యాలయం వద్ద మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడేందుకు ప్రయత్నించగా గ్రామ ప్రజలు ‘మా భూములు ఇచ్చేది లేదు’ అంటూ నినాదాలు చేశారు. దీంతో మంత్రి, ఎంపీల చుట్టూ ఉన్న పోలీసులు ప్రజలను తోసివేశారు.
ఈ నేపథ్యంలో ఆగ్రహించిన గ్రామ ప్రజలు పంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన షామియానాను పీకేశారు. సభకు ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పోలీసులు గ్రామ ప్రజలను సభ వద్ద నుంచి బయటకు తోసివేస్తూ లాఠీలు ఝలిపించారు. పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. మంత్రి, ఎంపీలను పోలీసులు పక్కకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. మరింత ఆగ్రహం చెందిన గ్రామస్తులు కొల్లు రవీంద్ర,కొనకళ్ల నారాయణరావులతో పాటు పోలీసులను వెంటపడి తరిమారు.
అతి కష్టంమీద తీసుకెళ్లిన పోలీసులు
గందరగోళ పరిస్థితుల మధ్య మంత్రి, ఎంపీలను అతి కష్టంమీద పోలీసులు కార్ల వద్దకు తీసుకు వచ్చారు. దీంతో గ్రామస్తులు కాన్వాయ్‌కు అడ్డుపడి వాహనాలను అడ్డుకున్నారు. మంత్రి, ఎంపీలు వాహనాలు ఎక్కిన తరువాత కూడా వాహనాలను వెంబడించి మెయిన్ రోడ్డు వరకూ తరిమారు. అతి కష్టంమీద మంత్రి, ఎంపీలను గ్రామం నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీసులు సమీపంలోని పల్లెతుమ్మలపాలెం గ్రామంలోకి తీసుకు వెళ్లారు. గ్రామస్తులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో మంత్రి కొల్లు రవీంద్ర పీఏ హరినాథబాబు తలకు స్వల్ప గాయమైంది.
రోడ్డుపై పడుకుని నిరసన...
మంత్రులు ఊరిదాటి వెళ్లిపోయినా గ్రామస్తుల ఆగ్రహావేశాలు చల్లారలేదు. తమపై పోలీసుల చర్యను నిరసిస్తూ కోన గ్రామస్తులు కోన-పల్లెతుమ్మలపాలెం మెయిన్ రోడ్డుపై రాత్రి 8గంటల వరకూ అడ్డంగా పడుకున్నారుమచిలీపట్నం డీఎస్పీ శ్రావణ్‌కుమార్ నేరుగా ఆందోళన చేస్తున్న కోన ప్రజలకు సర్ది చెప్పారు. ప్రజలు ఆందోళన విరమించారు. మంత్రి, ఎంపీ పోలీసుల సహకారంతో పల్లెతుమ్మలపాలెం నుంచి మచిలీపట్నం వెళ్లారు.