జవాబుదారీ రెవె‘న్యూ’
యాచారం: ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు స్థానిక తహసీల్దార్ వసంతకుమారి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రెవెన్యూ కార్యదర్శులు వారంలో మూడురోజుల పాటు గ్రామాల్లోనే ఉండేం దుకు, జనాల సమస్యలను పరిష్కరించేందుకు ప్ర ణాళికను రూపొందించారు. చిన్న చిన్న పనుల కోసం వారాలతరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పని లేకుండా ప్రజల వద్దకే రెవెన్యూ పాలన తీసుకెళ్లేందుకు ఆమె వినూత్నంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించారు.
గత ఏడాది ప్రభుత్వం రెవెన్యూ క్లస్టర్లలో గ్రామ రెవెన్యూ కార్యాలయాలు ఏర్పాటు చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది. గ్రామ రెవెన్యూ కార్యాలయాలు ఎప్పుడూ చూసినా మూతపడే ఉండేవి. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రజలు మళ్లీ తహసీల్దార్ కార్యాలయాన్నే ఆశ్రయించేవారు. అయినా సమస్యలు పరిష్కారానికి నోచుకునేవి కావు. దీంతో తహసీల్దార్ వసంతకుమారి గ్రామ రెవెన్యూ పాలనకు శ్రీకారం చుట్టారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాల రెవెన్యూ కార్యదర్శులతో ఆమె సమావేశమయ్యారు.
శుక్రవారం నుంచి రెవెన్యూ పాలన గ్రామం నుంచే సాగించాలని కార్యదర్శులకు సూచించారు. వారంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు గ్రామంలోనే కార్యదర్శులు ఉండేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. వారు గ్రామాల్లోఉండడమే కాకుండా.. రెవెన్యూ రికార్డులు స్థానికంగానే చూసుకోవాలని ఆమె ఆదేశించారు.
ప్రజల్లో హర్షం
కార్యదర్శులు గ్రామాల్లో ఉండే రోజుల్లో ఉదయం నుంచి 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు గ్రామాల్లో ఉండాలి. కార్యదర్శి పేరు, ఫోను నంబరు క్లస్టర్ కార్యాలయం వద్ద అతికించాలి. అత్యవసర సమయాల్లో గ్రామాలకు రాని పక్షంలో తహసీల్దార్ లేదా సర్పంచ్‌కు సమాచారం అందించాలని వసంతకుమారి ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ పాలన ఇక గ్రామాల నుంచి సాగడానికి తహసీల్దార్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్నాళ్లూ పహాణీ, పాసు పుస్తకాలు, పట్టాల మార్పిడి తదితర చిన్న చిన్న పనుల కోసం నెలల కొద్దీ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగేవాళ్లమని, ప్రస్తుతం స్థానికంగానే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ కృషి చేయడం ఎంతో సంతోషించదగిన విషయమని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. గ్రామాల్లోనే కార్యదర్శులు ఉండేలా.. సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి నిత్యం కార్యాలయానికి రాకుండా చూడడమే లక్ష్యమని తహసీల్దార్ వసంతకుమారి స్పష్టంచేశారు.