‘విమ్స్’ పాలన అస్తవ్యస్తం
ఇన్చార్జ డెరైక్టర్లతో అభివృద్ధి కుంటు
సాక్షి, బళ్లారి : విమ్స్ డెరైక్టర్లను పదే పదే మారుస్తుండటం.. ఆ ఆస్పత్రి అభివృద్ధికి శాపంగా మారింది. విమ్స్ ఆస్పత్రిని అభివృద్ధి పథంలో నడిపించే వ్యక్తి డెరైక్టర్. ఆ పోస్టులో ఉన్న వారికి భద్రత లేకపోవడంతో ఆయన తన కుర్చీ కాపాడుకునేందుకే సమయం వెచ్చిస్తుండటంతో విమ్స్ ఆస్పత్రిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. దీంతో విమ్స్‌లో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది.
మంగళవారం ఉన్నఫళంగా డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణరెడ్డిని తొలగించి, ఆయన స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ శంకర్‌ను విమ్స్ నూతన డెరైక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకటైన విమ్స్ ఆస్పత్రిపై మంత్రులు పుట్‌బాల్ తరహాలో తమకు ఇష్టమొచ్చినట్లు నడుచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బళ్లారి, రాయచూరు, కొప్పళ, చిత్రదుర్గం జిల్లాలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వేలాది మంది రోగులు ప్రతి నిత్యం బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రికి తరలి వచ్చి చికిత్సలు చేయించుకుంటున్నారు.
1200 పడకల సామర్థ్యం కలిగి అతి పెద్ద విమ్స్ ఆస్పత్రిలో వందలాది మంది డాక్టర్లు, నర్సులు, సిబ్బంది పని చేస్తున్నారు. వీరు ఎలా పని చేస్తున్నారు? ఆస్పత్రిలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? రోగులకు సక్రమంగా వైద్య సేవలు, చికిత్సలు అందిస్తున్నారా? లేదా? విమ్స్ గోడలపై పెచ్చులు ఊడితే ఎవరితో పని చేయించుకోవాలి? పందుల స్వైర విహారం, విమ్స్‌లో పారిశుద్ధ్య సమస్య తదితరాలపై నిత్యం దృష్టి పెట్టాల్సిన విమ్స్ డెరైక్టర్ తన కుర్చీని కాపాడుకునేందుకే సమయం వెచ్చిస్తుండటంతో విమ్స్‌లో పాలన అస్తవ్యస్తంగా మారుతుండటంతో రోగులు నరకం అనుభవిస్తున్నారు. ప్రతి నాలుగు సంవత్సరాలకొకసారి విమ్స్ డెరైక్టర్‌ను మార్చాలని నిబంధనలు ఉన్నప్పటికి నాలుగు సంవత్సరాల్లో ఆరు మంది డెరైక్టర్లను మార్చిన ఘనత పాలకులకే చెందుతుంది.
సంబంధిత మంత్రి, జిల్లా మంత్రులు విమ్స్ అభివృద్ధి, రోగులకు సరైన వైద్య సేవలు అందించడంపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా విమ్స్‌లో డెరైక్టర్‌ను మార్చడంపై దృష్టి పెడుతున్నారనే విమర్శలు వెల్లువెతున్నాయి. ఈ నాలుగు సంవత్సరాల్లో వరుసగా దేవానంద్, వసంత్సేఠ్, గంగాధరగౌడ, లక్ష్మీనారాయణరెడ్డి, శంకర్లు నియమితులయ్యారు. నాలుగు సంవత్సరాల్లో ఆరు మంది డెరైక్టర్లను మార్చడంతో విమ్స్ పరిపాలన విభాగం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
విమ్స్ డెరైక్టర్లుగా నియమితులైన వారు ఎన్ని రోజులు తాము కుర్చీలో ఉంటామో వారికే తెలియడం లేదు. ఇటీవల విమ్స్ ఆస్పత్రిని రాష్ట్ర వైద్య విద్యా శాఖ కమిషనర్ శివశ్రీశైలం సందర్శించినప్పుడు విమ్స్ ఆస్పత్రిలోని వసతులు చూసి సంబంధిత వైద్యులు, ల్యాండ్ ఆర్మీ అధికారి అజీజ్‌పై తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. సక్రమంగా పని చేయకపోతే ఉద్యోగాల నుంచి తప్పుకోండి అంటూ ఘాటుగా కూడా హెచ్చరించారు. వీటికంతటికి ప్రధాన కారణం విమ్స్ డెరైక్టర్‌ను పదే పదే మారుస్తుండటంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోంది.
మరో వైపు విమ్స్ డెరైక్టర్ల పోస్టులు పాలకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. నాలుగు సంవత్సరాలలో ఆరు మంది డెరైక్టర ్లను ఎందుకు మార్చారో విమ్స్‌లో పని చేస్తున్న వైద్యులకే అంతు పట్టడం లేదు. ప్రస్తుతం నియమితులైన శంకర్ కూడా ఇన్‌ఛార్జి డెరైక్టర్ కావడం గమనార్హం. ఆయన కూడా పాలకులు ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో బిక్కు బిక్కుమంటూ పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.