భర్త కోసం భార్య ఆందోళన
ఘటకేసర్: భర్త కోసం భార్య ఆందోళనకు దిగింది. భర్త కార్యాలయం ఎదుట ఆమె పిల్లలతో కలిసి బైఠాయించింది. వివరాలు.. మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం లక్ష్మీనగర్‌కు చెందిన మలిపెద్ది వీణధరి(28)ని గుంటూరు జిల్లా చెరకుపల్లి మండలం నడింపల్లికి చెందిన రవికిరణ్ 2008లో వివాహం చేసుకున్నాడు. కట్నకానుకలతో వీణధరి తల్లిదండ్రులు ఘనంగా పెళ్లి చేశారు. దంపతులు నగరంలోని కూకట్పల్లి నిజాంపేట్‌లోని కాపురం ఉంటున్నారు. వీరికి పిల్లలు శరణ్య, ఉదయకృష్ణ ఉన్నారు.
రవికిరణ్ ఘట్కేసర్ మండలం పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలని అతడు భార్యను వేధించడంతో వీణధరి తల్లిదండ్రులు కొంతడబ్బు ఇచ్చారు. నాలుగు నెలలుగా రవికిరణ్ ఇంటికి రాకపోవడంతో వీణధరి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. తన భర్త గురించి అత్తామామలతో పాటు ఆడపడుచులను అడిగినా ఫలితం లేకుండా పోయిందని వీణధరి తెలిపింది.
దీంతో ఆమె సోమవారం భర్త రవికిరణ్ పనిచేసే పోచారం ఇన్ఫోసిస్ కార్యాలయం ఎదుట పిల్లలతో కలిసి బైఠాయించి ఆందోళనకు దిగింది.కంపెనీ యాజమాన్యం సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వీణధరితో మాట్లాడారు. కుటుంబ సమస్యలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వీణధరిని సముదాయించడంతో ఆమె శాంతించి పిల్లలను తీసుకొని వెళ్లిపోయింది.