vinay bihari
-
బిహార్‌లో ఏం జరుగుతోంది? సీఎం నితీశ్‌పై విరుచుకుపడ్డ బీజేపీ ఎమ్మెల్యే
పట్నా: బిహార్ బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బిహరీ సీఎం నితీశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిలిం సీటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వంటి ప్రాజెక్టులు రాజ్‌గిరికే ఎందుకు తరలివెళ్తున్నాయని ప్రశ్నించారు. రాజ్గిరి సీఎం నితీశ్ కుమార్ సొంత జిల్లా నలందలో ఉండటం గమనార్హం. దీంతో వినయ్ బిహారీ సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. తాను కళలు, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్ర రాజధాని పట్నాలో నిర్మించాలనుకున్నట్లు వినయ్ చెప్పారు. కానీ ఆ ప్రాజెక్టును రాజ్‌గిరికి తరలించారని ఆరోపించారు. అలాగే ఫిలిం సిటీని కూడా వాల్మీకి నగర్లో నిర్మించాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ దాన్ని కూడా రాజ్‌గిరికి మార్చారాని ఆరోపించారు. భోజ్‌పురి ఫిలిం మేకర్ అయిన వినయ్ బిహారీ.. తనకంటే ఎక్కువ నితీశ్ కుమార్‌కు ఏమీ తెలియదన్నారు. అక్కడైతే ఫిల్మ్ మేకింగ్‌కి అనువైన వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండవని పేర్కొన్నారు. అసలు ఈ రెండు ప్రాజెక్టులను రాజ్‌గిరికి ఎందుకు మార్చారో సీఎం, సంబంధిత మంత్రి, బీజేపీ డిప్యూటీ సీఎంలే చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఫిలిం సిటీ, క్రికెట్ స్టేడియం పనులు నత్తనడకన సాగుతున్నాయని సీఎంపై వినయ్ బిహారీ విమర్శలు గుప్పించారు. 2014లో మొదలైన ఈ ప్రాజెక్టులు సగం కూడా పూర్తి కాలేదన్నారు. బిహార్‌లో అధికార జేడీయూ, బీజేపీ మిత్రపక్షాలు. అలాంటిది సీఎంపై బీజేపీ ఎమ్మెల్యే ఈ స్థాయిలో విరుచుకుపడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. చదవండి: బీజేపీ నేతలపై ఈడీ చర్యలు ఉంటాయా?.. చర్చనీయాంశంగా ఎన్సీపీ బ్యానర్! -
బీజేపీ ఎమ్మెల్యే వెరైటీ నిరసన
పట్నా: ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రతిపక్ష నాయకలు రకరకాలుగా నిరసన తెలుపుతుంటారు. ధర్నాలు, నిరహారదీక్షలతో ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంటారు. మరి కొంతమంది నేతలు విచిత్ర వేషధారణలతో వినూత్నంగా నిరసనలు చేస్తుంటారు. బిహార్ బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బిహారి కూడా ఇదే కోవకు చెందిన నాయకుడు. తన నియోజకవర్గం లారియా యోగపట్టిలో జాతీయ రహదారి నిర్మాణంలో ప్రభుత్వ అలసత్వానికి వ్యతిరేకంగా ఆయన వినూత్న నిరసన తెలిపారు. బనియన్, నిక్కరు మాత్రమే ధరించి అసెంబ్లీకి వచ్చారు. భద్రతా సిబ్బంది ఆయనను అసెంబ్లీ గేటు వద్దే అడ్డుకున్నారు. జాతిపిత మహాత్మ గాంధీ స్ఫూర్తితో నిరసన తెల్పుతున్నట్టు ఆయన వెల్లడించారు. ‘మానుయపాల్ నుంచి రత్వాల్ వరకు జాతీయ రహదారి నిర్మిస్తామని సీఎం నితీశ్ కుమార్ హామీయిచ్చారు. ఇప్పటివరకు దీని గురించి పట్టించుకోలేదు. ఎన్నోసార్లు ఆయనకు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారు. సీఎం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. నేను గాంధీయవాదిని. నా కుర్తాను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, పైజామాను నితీశ్ కుమార్ కు త్యాగం చేస్తున్నాను. నా ఆలోచనలను మీ ముందు ఉంచుతున్నాను. నాతో ఎవరు కలిసివచ్చినా స్వాగతిస్తాన’ని తన ఫేస్ బుక్ పేజీలో వినయ్ బిహారి పేర్కొన్నారు. -
మంత్రినే సజీవదహనం చేయబోయారు!!
జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరూ ఉండగానే.. వాళ్లందరి ఎదురుగానే బీహార్‌లో ఓ కేబినెట్ మంత్రిని సజీవంగా దహనం చేయడానికి ప్రజలు ప్రయత్నించారు. ఈ సంఘటన బీహార్ రాజధాని పాట్నాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ససారం ప్రాంతంలో జరిగింది. అక్కడి ప్రఖ్యాత తారాచాందీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓ సాంస్కృతిక కార్యక్రమం మొదలైంది. బీహార్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వినయ్ బీహారీ కూడా అందులో పాల్గొన్నారు. ఆయన కూడా స్వతహాగా జానపద గాయకుడు కావడంతో ఆయనే ఈ కార్యక్రమం ప్రారంభించి కొన్ని భక్తి పాటలు పాడారు. మరో ఇద్దరు ప్రముఖ జానపద గాయకులు కూడా అక్కడ పాడాల్సి ఉంది. అయితే అక్కడ సౌండ్ ఏర్పాట్లు, సిటింగ్ ఏర్పాట్లు ఏమాత్రం సరిగా లేకపోవడంతో అక్కడున్న వాళ్లకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వాళ్లలో కొందరు వేదికమీదకు కుర్చీలు విసరడం మొదలుపెట్టారు. ఎస్పీ చందన్ కుమార్ కుష్వాహా మీద కూడా ఓ కుర్చీ పడటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ప్రజలు.. రాళ్లు విసిరి, వాహనాలకు నిప్పు పెట్టారు. మంత్రి గారు, అధికారులు వేదిక కింద దాక్కున్నారు. తాను రెండు గంటల పాటు అక్కడ దాక్కుని ఉండకపోతే.. అక్కడే సజీవంగా దహనం అయిపోయి ఉండేవాడినని మంత్రి వినయ్ బీహారీ తెలిపారు. ఆయన తలమీద, గెడ్డం మీద కూడా బ్యాండేజీలు ఉన్నాయి. సంఘటన జరిగిన చాలా గంటల తర్వాత కూడా ఆయన చాలా బెదిరిపోయినట్లే కనిపించారు. కొంతమంది వ్యక్తులు పెట్రోలు క్యాన్లు పట్టుకుని తనకోసం చూస్తున్నారని చెప్పారు. అక్కడే ఉండి చచ్చిపోయే కంటే పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడం మంచిదని తనకు అనిపించినట్లు తెలిపారు. -
బీహార్ మంత్రితో శ్రుతిహాసన్!
బీహార్ మంత్రితో శ్రుతిహాసన్ అనగానే వెంటనే ఏవేవో ఊహించుకోకండి. పూజై చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం పూజై. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి హరి దర్శకుడు. పూజై చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో బీహార్ యువజన సంక్షేమ శాఖ మంత్రి వినయ్ బీహారి కలెక్టర్‌గా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆయన నటించడం అన్నది కాకతాళీయంగా జరిగిందట. పూజై చిత్రం కథ కొంత భాగం బీహార్‌లో జరుగుతుందట. దీంతో విశాల్ పోరాట దృశ్యాలను అక్కడ చిత్రీకరించారు. అయితే ఆ లొకేషన్స్ అనుమతి కోసం మంత్రి వినయ్ బీహారీ చిత్ర దర్శక నిర్మాతలు కలిశారు. అప్పుడు మీ చిత్రంలో నటించే అవకాశం కల్పించామని మంత్రి దర్శకుడు హరిని కోరారు. తాను పలు బోజ్‌పురి చిత్రాల్లో నటించినట్లు, ఒక చిత్రానికి దర్శకత్వం కూడా నెరపినట్లు మంత్రి తెలపడంతో పూజై చిత్రంలో కలెక్టర్ పాత్రలో నటించే అవకాశం ఇచ్చినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి.