మంత్రినే సజీవదహనం చేయబోయారు!!
జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరూ ఉండగానే.. వాళ్లందరి ఎదురుగానే బీహార్లో ఓ కేబినెట్ మంత్రిని సజీవంగా దహనం చేయడానికి ప్రజలు ప్రయత్నించారు. ఈ సంఘటన బీహార్ రాజధాని పాట్నాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ససారం ప్రాంతంలో జరిగింది. అక్కడి ప్రఖ్యాత తారాచాందీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓ సాంస్కృతిక కార్యక్రమం మొదలైంది. బీహార్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వినయ్ బీహారీ కూడా అందులో పాల్గొన్నారు. ఆయన కూడా స్వతహాగా జానపద గాయకుడు కావడంతో ఆయనే ఈ కార్యక్రమం ప్రారంభించి కొన్ని భక్తి పాటలు పాడారు. మరో ఇద్దరు ప్రముఖ జానపద గాయకులు కూడా అక్కడ పాడాల్సి ఉంది.
అయితే అక్కడ సౌండ్ ఏర్పాట్లు, సిటింగ్ ఏర్పాట్లు ఏమాత్రం సరిగా లేకపోవడంతో అక్కడున్న వాళ్లకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వాళ్లలో కొందరు వేదికమీదకు కుర్చీలు విసరడం మొదలుపెట్టారు. ఎస్పీ చందన్ కుమార్ కుష్వాహా మీద కూడా ఓ కుర్చీ పడటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ప్రజలు.. రాళ్లు విసిరి, వాహనాలకు నిప్పు పెట్టారు. మంత్రి గారు, అధికారులు వేదిక కింద దాక్కున్నారు.
తాను రెండు గంటల పాటు అక్కడ దాక్కుని ఉండకపోతే.. అక్కడే సజీవంగా దహనం అయిపోయి ఉండేవాడినని మంత్రి వినయ్ బీహారీ తెలిపారు. ఆయన తలమీద, గెడ్డం మీద కూడా బ్యాండేజీలు ఉన్నాయి. సంఘటన జరిగిన చాలా గంటల తర్వాత కూడా ఆయన చాలా బెదిరిపోయినట్లే కనిపించారు. కొంతమంది వ్యక్తులు పెట్రోలు క్యాన్లు పట్టుకుని తనకోసం చూస్తున్నారని చెప్పారు. అక్కడే ఉండి చచ్చిపోయే కంటే పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడం మంచిదని తనకు అనిపించినట్లు తెలిపారు.