చెట్టంత కొడుకు పోయినా...
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో గాయపడి, నిస్సహాయంగా విలవిల్లాడతున్నా ఓ ఇరవై ఏళ్ల యువకుడిని ఎవరూ పట్టించుకోలేదు. ఇంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. చెట్టంత కొడుకును కోల్పోయింది ఢిల్లీలో నివసించే ఓ కుటుంబం. అంతటి విషాదంలో కూడా అతని తల్లి పెద్ద మనసు చేసుకుంది. దు:ఖాన్ని దిగమింగి తన కుమారుడి నేత్రాలతో పాటు, ఇతర అవయవాలను దానం చేసింది. కొందరి నిర్లక్ష్యానికి తన కొడుకు బలైనా, ఈ సమాజం ఎలా పోతే నాకేంటి అని ఆ కుటుంబం అనుకోలేదు. పరోపకారం కోసం తపన పడింది. ఇపుడిదే అందరి అభిమానాన్ని చూరగొంది. వివరాల్లోకి వెళితే..
తల్లికి మందుల తెచ్చేందుకు వెళ్లిన కొడుకు వినయ్ జిందాల్ (20) ఇంటికి విగతజీవిగా తిరిగొచ్చాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేగంగా దూసుకొచ్చిన కారు అతడి స్కూటీని ఢీకొట్టింది. సుమారు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్ళింది. దీంతో వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని చూస్తూ వెళ్లిపోయారు కానీ ఆ దారిన పోయే ఒక్క వాహనదారుడు కూడా అతడిని పట్టించుకోలేదు. వినయ్‌ని ఢీకొట్టిన కారు మరో ద్విచక్ర వాహనాన్ని గుద్దుకొంటూ..చీకట్లో కలిసిపోయింది. ఇదంతా సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయింది.
పోలీసులు వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించటంలో చాలా ఆలస్యం జరిగిపోయింది. తీవ్ర రక్తస్రావంతో అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు. సమయానికి చికిత్స అంది ఉంటే వినయ్ బతికి ఉండేవాడని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. అయితే రెండు రోజులు గడిస్తే ఆ ఇంట్లో వినయ్ సోదరి పెళ్లి బాజాలు మోగేవి. బంధువులు, సన్నిహితులతో కోలాహలంగా ఉండేది. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కుటుంబ సభ్యులు, ఆప్తుల రోదనలతో విషాదం అలుముకుంది. ఈ సంఘటన జరిగి నాలుగు రోజులవుతున్నా ఇంతవరకూ ఆ వాహనాన్ని గుర్తించలేదు. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.
కాగా స్కాలర్ షిప్‌తో బీబీఏ చదువుతున్న వినయ్ మెరిట్ స్టూడెంట్. తండ్రి కొన్ని నెలల క్రితమే కన్నుమూశాడు. దీంతో ట్యూషన్స్ చెబుతూ కుటుంబానికి ఆసరాగా నిలబడ్డాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి మందులు తేవడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు తరలిపోయాడు. దీంతో అతని సోదరి పెళ్లిని వాయిదా వేశారు. వినయ్ జిందాల్ కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఢిల్లీలోని గురునానక్ వైద్యశాలకు అతని కళ్ళను దానం చేశారు.