కెమెరాలో ఎమ్మెల్యే అడ్డంగా దొరికిపోయాడు
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అమలు చేస్తున్న మద్యనిషేధం పథకానికి మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూట్లు పొడిచారు. నర్కటియగంజ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ వర్మ మద్యంతాగుతూ కెమెరాలో అడ్డంగా దొరికిపోయారు. ఎమ్మెల్యే మద్యంతాగుతూ అతిథులకు డ్రింక్ ఆఫర్ చేస్తున్న వీడియో దృశ్యాలు బయటకు వచ్చాయి.
భారత్లో తయారైన బ్రాండ్లతో పాటు విదేశీ మద్యం కూడా తన దగ్గర ఉన్నట్టు వినయ్ వర్మ అతిథులతో చెబుతున్నప్పటి దృశ్యాలు రికార్డు కావడం కలకలం రేపింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. వినయ్ వర్మకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బిహార్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం.. మద్యం విక్రయించినా, తాగినా, ఇతరులకు ఆఫర్ చేసినా నేరం. దోషీగా తేలితే 10 ఏళ్ల నుంచి జీవితకాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల నుంచి 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది.