ఏడాదికి 5లక్షల ఆదాయం.. ఈ యువ రైతు గురించి తెలుసా?
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో తనకున్న 6.5 ఎకరాల్లో ఏడాది పొడవునా బహుళ పంటలను సాగు చేస్తూ రూ. 5 లక్షల వరకు నికరాదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు గిరిజన యువ మహిళా రైతు పొంగి వినీత(20). అల్లూరి సీతారామరాజు జిల్లా బలియగూడ మండలం డుంబ్రిగూడ గ్రామంలో ఆమె ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఇతర రైతులకు స్ఫూరినిస్తున్నారు. ఆమెకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ‘డాక్టర్ ఎం.వి.రెడ్డి ఉత్తమ రైతు పురస్కారా’న్ని ఇటీవల ప్రదానం చేసింది. అరకు మండలం కిలోగుడలో సంజీవని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 15వ దేశీ విత్తనోత్సవంలో కూడా ఉత్తమ రైతుగా ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. ఇటీవల ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం ఆమె వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి సాగు పద్ధతులను తెలుసుకున్నారు.
కొండ ప్రాంతంలోని ఎర్ర నేలలో సార్వా, దాళ్వా, వేసవి సీజన్లలో వరుసగా భర్త బాలకృష్ణతో కలసి వినీత ఏడాది పొడవునా పంటలు సాగు చేస్తూ నిరంతరం ఆదాయం పొందుతుండటం విశేషం. కొండ వాగుల్లో నీటిని సేకరించి పంటలకు మళ్లించడం ద్వారా ఖరీఫ్‌తో పాటు రబీ, వేసవి పంటలను కూడా సాగు చేస్తున్నారు. వర్షాధారంగా వరి, గుళి రాగి పద్ధతిలో రాగులు, కూరగాయలు, పండ్లు, పూలు, చింతపండుతో పాటు కొద్ది సంఖ్యలో నాటుకోళ్లు, గొర్రెలు,మేకలను సైతం పెంచుతూ అనుదినం మంచి ఆదాయం పొందుతున్నారు. వినీత అన్ని పంటలకు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలనే అవలంభిస్తున్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ సహాయంతో వివిధ కషాయలను తయారు చేసి తమ పంటలకు వాడటంతో పాటు గ్రామంలోని ఇతర రైతులకు అందిస్తున్నారు.
పంట మార్పిడి ఖచ్చితంగా అనుసరిస్తున్నారు. ఏడాది పొడవునా మూడు సీజన్లలోనూ అంతర పంటలు, బహుళ అంతస్తుల పంటలు సాగు చేస్తున్నారు. సజీవ ఆచ్ఛాదనతో పాటు గడ్డిని ఆచ్ఛాదనగా వాడుతూ నేల తేమను సమర్థవంతంగా సంరక్షించుకుంటున్నారు. చింతపల్లి, అనకాపల్లి ఆర్ఎఆర్ఎస్ల శాస్త్రవేత్తల సూచనల మేరకు జీవ నియంత్రణ పద్ధతులను అనుసరిస్తున్నారు. వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసిన కంపోస్టును పంటలకు వాడుతున్నారు. అంతర పంటల సాగును అనుసరిస్తారు. మొక్కజొన్న+ముల్లంగి, టొమాటో+ ముల్లంగి, పసుపు+అల్లం, బీన్స్+వంకాయ, కొత్తిమీర+టమోటాలను మిశ్రమ పంటలుగా సాగు చేస్తున్నారు. టమోటా, కొత్తిమీర, ముల్లంగిని దశలవారీగా విత్తటం ద్వారా సంవత్సరం పొడవునా పంట దిగుబడి తీస్తున్నారు.
ఏడాది పొడవునా ఆదాయ భద్రత
ఒకటికి పది పంటల సాగుతో వ్యవసాయ భూమి నుంచి సురక్షితమైన ఆదాయాన్ని పొందడంలో వినీత విజయం సాధించారు. దేశీ వరి, కూరగాయలతో పాటు పాడి, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. మొత్తంగా 6.5 ఎకరాల ద్వారా సుమారు రూ. ఐదు లక్షలను ఏడాదికి సగటు నికరాదాయం పొందుతున్నారు. దేశీ వరిని వరుసలుగా విత్తటం, గుళి పద్ధతిలో రాగి నారు మొక్కలను నాటేసి సాగు చేయటం, అంతర పంటలు, మొక్కజొన్న ఇతర పంటలను ప్రకృతి వ్యవసాయంలో సాగు చేయటం వినీత ప్రత్యేకత. పాత విత్తనాలనే వాడుతున్నాం. విత్తనాలను మునుపటి పంట నుండి సేకరించి తదుపరి సీజన్‌కు వినియోగిస్తాం. ఎక్కువగా దేశీ రకాలనే వాడుతున్నాం. సహజ పద్ధతిలో పండించిన నాణ్యమైన ఆహారోత్పత్తులను థిమ్సా ఎఫ్.పి.ఓ. ద్వారా మార్కెట్లో విక్రయిస్తున్నందున మంచి ఆదాయం వస్తోంద’ని వినీత తెలిపారు.
గత ఏడాది ఖరీఫ్‌లో 4.3 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. 2 ఎకరాల్లో వరి (దిగుబడి 32 క్విం./రూ. 26 వేల నికరాదాయం), అరెకరం మొక్కజొన్న (9 క్విం./రూ.12,500), ఎకరంలో రాగులు (7.5 క్విం./ రూ.11,500), అరెకరంలో టొమాటో (4.8 క్విం./రూ.4,200), 30 సెంట్లలో సామలను వినీత సాగు చేశారు. రబీలో 3 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. అరెకరంలో వరి (9 క్విం./రూ. 8,550 నికరాదాయం), అరెకరంలో మొక్కజొన్న (6 క్విం./రూ.8,000), ఎకరంలో టొమాటో (12.6 క్విం./ రూ.12,100), అరెకరంలో ముల్లంగి (1.25 క్విం/రూ.2వేలు), 30 సెంట్లలో పచ్చిమిరప, కూరగాయలను సాగు చేశారు.
అదేవిధంగా ఎండాకాలంలో ఎకరంన్నరలో పంటలు సాగు చేశారు. 30 సెంట్లలో కొత్తిమీర, 20 సెంట్లలో ముల్లంగి, అరెకరంలో కూరగాయలు, అరెకరంలో టొమాటోలు సాగు చేశారు. ఎకరంన్నరలో బొప్పాయి, అరటి, అల్లం, పసుపు వంటి వార్షిక పంటలను సాగు చేస్తున్నారు. దీర్ఘకాలిక పంటలు కాఫీ, మిరియాలు 40 సెంట్లలో సాగు చేస్తున్నారు. 30 పనస, 6 చింత చెట్లున్నాయి. అన్ని పంటలు, కోళ్లు, గొర్రెలు, మేకల ద్వారా ఏటా సగటున రూ. 5 లక్షల నికరాదాయం పొందుతున్నట్లు వినీత తెలిపారు.