నంద్యాల, న్యూస్‌లైన్: ప్రతిభకు వికలత్వం అడ్డురాదని ఓ విద్యార్థిని నిరూపిస్తోంది. మాటలు రాకపోయినా క్రీడాపోటీల్లో రాణిస్తోంది. ఫెన్సింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో రన్నరప్‌గా నిలిచి తనకు సాటి ఎవరూ లేరని చాటింది. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై పలువురికి ఆదర్శంగా నిలిచింది. నంద్యాల పట్టణానికి చెందిన రమణారెడ్డి, నాగలింగేశ్వరిల కుమార్తె వినీత పుట్టు మూగ. వైఎస్సార్ జిల్లా కడప పట్టణంలోని బధిర కళాశాలలో రెండో సంవత్సరం సీఈసీ చదువుతోంది. నంద్యాల పట్టణంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చింది.
ఈ పోటీల్లో రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన 250 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరిలో ఏకైక బధిర విద్యార్థి వినీత కావడం గమనార్హం. కర్నూలు, వరంగల్, చిత్తూరు జిల్లాలకు చెందిన క్రీడాకారులపై ఈమె విజయం సాధించింది. మంగళవారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో మెదక్ జిల్లాకు చెందిన విద్యార్థినితో తలపడి ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఈ విద్యార్థిని గత ఏడాది వైఎస్సార్ జిల్లాలో బధిరులకు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ప్రతిభకనబరిచి బంగారు పతకం కైవసం చేసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల సలహాలతో తాను క్రీడల్లో రాణిస్తున్నట్లు వినీత తెలిపారు.
జాతీయ స్థాయిలో రాణించాలన్నదే తన ఆశయమని ఆమె పేర్కొన్నారు. తమ కుమర్తె క్రీడల్లోనే కాకుండా చదువులో ముందంజలో ఉందని తల్లిందండ్రులు తెలిపారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు వచ్చాయని వారు వివరించారు. వచ్చే ఏడాది వినీతకు కేరళలో ప్రత్యేక శిక్షణ ఇప్పించి పారా ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనే విధంగా కృషి చేస్తామని రామకృష్ణా విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, కోచ్ మహేశ్వరరావు తదితరులు చెప్పారు.
శభాష్.. వినీత!
Published Wed, Nov 27 2013 1:58 AM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM
Advertisement