28న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
తిరుచ్చి:
కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈనెల 28వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరుపనున్నారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటాచలం తిరుచ్చిలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 28న జాతీయ స్థాయిలో సమ్మె జరుపనున్నామని, ఇందులో పబ్లిక్ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, విదేశీ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు పది లక్షల మందికి పైగా పాల్గొననున్నట్లు తెలిపారు.
తొమ్మిది కార్మిక సంఘాలు ఈ పోరాటంలో స్వచ్ఛందగా పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఆర్థిక విధానాల పేరిట బ్యాంకులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ బడ్జెట్లోనూ బ్యాంకులకు అవసరమైన మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేయలేదని, దీంతో బ్యాంకులు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. సుమారు రూ.110 లక్షల కోట్ల చలామణి కలిగిన బ్యాంకింగ్ రంగాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ఈ ఆందోళన జరుపనున్నట్లు తెలిపారు. 500, వెయ్యి రూపాయల నోట్ల రద్దు తర్వాత ప్రజల్లో భారీ స్థాయిలో నగదు కొరత ఏర్పడిందని పేర్కొన్నారు.