52 వారాలు.. ఈవెంట్లు..
‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ ప్రారంభం
వెబ్సైట్, యాప్ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్: ఐటీ, పరిశ్రమల శాఖల భాగస్వామ్యంతో ఏడాది పొడువునా ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని పర్యాటకశాఖ నిశ్చయించింది. కళలు, సంస్కృతి, క్రీడలు కలిపి ‘52 వారాలు.. 52 ఈవెంట్లు’ జరిపేందుకు పర్యాటక శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆగస్టు 15న ‘ది ఫ్రీఢమ్ రైడ్’, ‘వింటేజ్ కార్ ర్యాలీ’, ‘ఖాదీ ఫ్యాషన్ షో’ నిర్వహించనున్నారు. హ్యాపెనింగ్ హైదరాబాద్‌కు సంబంధించిన వెబ్సైట్, మొబైల్ యాప్, క్యాలెండర్‌ను గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఐటీ మంత్రి కె.తారకరామారావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పనేగాక సంస్కృతి, కళలు, క్రీడలు కలగలుపుతూ హ్యాపెనింగ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. దీని ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు.