ఎన్నికల కోడ్ ఉల్లంఘన
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నా.. భారీ ర్యాలీ నిర్వహించి టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. టీడీపీలో చేరిన ఆయన మంగళవారం ఉదయం భీమవరం టౌన్ రైల్వేస్టేషన్ నుంచి పట్టణంలోని పలు ప్రధాన వీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రస్తుతం ఎక్కడా కూడా ర్యాలీలకు అనుమతి లేదు.
చిన్న ర్యాలీ నిర్వహించుకోవాలన్నా.. మైక్ పెట్టుకోవాలన్నా.. జెండాలతో ప్రదర్శన నిర్వహించాలన్నా ఎన్నికల అధికారులు, పోలీసుల అనుమతి తప్పనిసరి. అందుకు విరుద్ధంగా ఈ ర్యాలీ సాగింది. వందలాది మోటార్ సైకిళ్లు, సుమారు 25 వరకు కార్లు, పెద్ద ఎత్తున ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు అంజిబాబు నివాసానికి చేరుకుని, అక్కడ వేసిన టెంట్‌ను తొలగించారు.
దీనిపై భీమవరం వన్‌టౌన్ సీఐ జి.కెనడీని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా తాము పులపర్తి రామాంజనేయులు ర్యాలీకి ఎటువంటి అనుమతులు మంజూరు చేయలేదని, అయితే ర్యాలీ జరుగుతుందన్న సమాచారం తెలుసుకుని తాము వెళ్లేసరికి ఆయన ఇంటికి వె ళ్లిపోయారని సమాధానమిచ్చారు. ర్యాలీ విషయమై అక్కడ ఆరా తీయగా అటువంటిది జరగలేదని, కేవలం అంజిబాబుకు స్వాగతం చెప్పేం దుకు మాత్రం వెళ్లామన్నారని చెప్పారు.
ఎమ్మెల్యే ర్యాలీ విషయమై ఎన్నికల రిటర్నింగ్ అధికారి సవరమ్మను వివరణ కోరగా ఎన్నికల సమయంలో ర్యాలీ నిర్వహించడం తప్పని, దీనిపై ఎన్నికల అధికారులు విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలావుండగా ఎమ్మెల్యే రామాంజనేయులుకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు తప్ప టీడీపీ ముఖ్య నేతలు ఎవ్వరూ రాకపోవడం గమనార్హం.