జిల్లాపై జ్వరాల పంజా
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
జ్వరపీడితులతో నిండిన వార్డులు
గంట గంటకు పెరుగుతున్న రోగుల సంఖ్య
మంకమ్మతోట : జ్వరాలతో జిల్లా వణుకుతోంది. బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎక్కడ చూసినా యువకులు, పిల్లలు, వృద్ధులు అని తేడాలేకుండా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. రోజురోజుకు ఓపీతోపాటు ఇన్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 600లకు పైగా ఇన్ పేషెంట్లుగా ఉండగా ఓపీ 800లకు దాటుతోంది. ఇవేకాకుండా ఎమర్జెన్సీ సేవలు రోజుకు ఓపీ 100, ఇన్‌పేషెంట్లు మరో 50వరకు చేరుతున్నారు. వీరంతా విషజ్వరాలతో బాధపడుతున్న వారే. ఆస్పత్రిలోని మేల్, ఫిమేల్ వార్డుతోపాటు పిల్లల వార్డు కూడా రోగులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. వార్డుల్లోని బెడ్లు నిండిపోవడంతో వరండాల్లో వందకు పైగా అదనగా తాత్కాలిక బెడ్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. ఇవి కూడా చాలక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెడ్లు లేకపోవడంతో ఖాళీ అయ్యే వరకు పడిగాపులు కాస్తున్నారు.
గంగాధర మండలం ఉప్పరిమల్యాలకు చెందిన జవ రాజిరెడ్డి(55) 12రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరం కారణంగా శ్వాసతీసుకోవడం కష్టంగా మారి నిలుబడటానికి ఒంట్లో శక్తి లేదు. స్థానికంగా వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో పరీక్షలు చేయించారు. విషజ్వరం కారణంగా ప్లేట్లేట్ తగ్గిపోయాయని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అక్కడి వైద్యుల సూచించారు. అక్కడి నుంచి 108లో ఆస్పత్రికి వచ్చాడు. రిపోర్టు పరిశీలించిన డాక్టర్ బెడ్‌పై ఉండాలని రాశాడు. అక్కడ నుండి పై అంతస్తులోని మేల్ వార్డుకువచ్చాడు. అక్కడ బెడ్లు ఖాళీ లేవని సిబ్బంది తెలుపడంతో రెండుగంటలు వరండాలో వేచిఉన్నాడు.
ప్లేట్లేట్స్ తగ్గిపోయాయి
– పతంగి శివకృష్ణ
నేను పది రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్నా. వ్యాధి నిర్ధారణలో డెంగీ అని చెప్పారు. బెడ్లు ఖాళీ లేవని వరండాల్లో వేశారు. మూడు రోజులు అవుతున్నా వరండా నుంచి వార్డులోకి మార్చడం లేదు. దోమలతో ఇబ్బంది పడుతున్న.
ఆస్పత్రి దుర్భరంగా ఉంది
– సాగర్ల మహేందర్, బెగులూరు
ప్రభుత్వ ఆస్పత్రి వాతావరణం దుర్భరంగా ఉంది. మ ఊరంతా జ్వరాలే. అందరూ ఆస్పత్రుల్లో చేరారు. డబ్బులున్న వారు ప్రైవేటు ఆస్పత్రులో వైద్యం చేయించుకుంటున్నరు. మా బంధువులను ఇక్కడ చేర్పించిన ఐదు రోజులు అవుతున్నా పరిస్థితిలో మార్పులేదు. ప్లేట్లేట్ 17వేలు మాత్రమే ఉన్నాయని డాక్టర్లు చెప్పారు.