Virology Laboratory
-
బర్డ్ ఫ్లూ కలకలం.. వందల సంఖ్యలో కోళ్లు మృతి
సాక్షి, ముంబై: మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం ప్రజలను, అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. బర్డ్ ఫ్లూ కారణంగా షాహాపూర్‌లోని వెహ్లోలి గ్రామంలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు చనిపోయిన కోళ్లకు సంబంధించిన నమూనాలను పూణేలోని ల్యాబ్‌కు పంపించారు. ఇదిలా ఉండగా.. H5N1 ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా కారణంగానే అక్కడ కోళ్లు చనిపోయినట్టు థానే జడ్పీ సీఈవో డా. బహుసాహెబ్ దంగ్డే తెలిపారు. ఈ క్రమంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కట్టడి కోసం అధికారులు రంగంలోకి దిగారు. సదరు పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్లతో సహా.. ఆ కోళ్ల ఫారమ్‌కు కిలోమీటర్ పరిధిలో ఉన్న పౌల్ట్రీ ఫామ్‌లోని దాదాపు 25,000 కోళ్లను చంపేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అయితే, బర్డ్ ఫ్లూ వెలుగులోకి రావడంతో థానే సరిహద్దు జిల్లాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ పౌల్ట్రీ ఫామ్‌ల్లోని కోళ్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ ఫామ్‌ల నిర్వాహకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా దాదాపుగా ప్రతీ ఏటా దేశంలో ఏదో ఒక చోట బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. కాగా, బర్డ్ ఫ్లూ కారణంగా గతేడాది జూలైలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఓ బాలుడు(12) చనిపోయాడు. -
కరోనా వైరస్ జన్యు శ్రేణిపై దృష్టి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కరోనా వైరస్ జన్యు శ్రేణిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైరాలజీ ల్యాబొరేటరీల నుంచి నమూనాల సేకరణ ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డబ్ల్యూజీఎస్(హోల్ జినోమిక్ సీక్వెన్సింగ్–మొత్తం జన్యుశ్రేణి)ని తెలుసుకునేందుకు ఈ నమూనాలను పంపిస్తారు. మనకు మొత్తం 13 జిల్లాల్లో 14 వైరాలజీ ల్యాబొరేటరీలున్నాయి. వీటిలో ఒక్కో ల్యాబొరేటరీ నుంచి ప్రతి మూడు రోజులకోసారి 10 శాంపిళ్లు పంపించాల్సి ఉంటుంది. నెలలో మొత్తం 100 నమూనాలను విధిగా సేకరించి పంపాలి. ఉదాహరణకు సెప్టెంబర్ ఒకటో తేదీన ఒక ల్యాబొరేటరీ నుంచి 10 శాంపిళ్లు పంపిస్తే.. తిరిగి సెప్టెంబర్ మూడో తేదీన 10 శాంపిళ్లు పంపించాలి. అంటే ప్రతి నెలా మన రాష్ట్రంలో 14 ల్యాబొరేటరీల నుంచి 1,400 శాంపిళ్లు జినోమిక్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీ(సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ)కి పంపుతారు. అక్కడ జన్యు శ్రేణి పోకడలు, వాటి తీవ్రత వంటివి గుర్తిస్తారు. ఈ మేరకు అన్ని ల్యాబొరేటరీలకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జినోమిక్ సర్వేను చేపట్టిన విషయం తెలిసిందే. -
23 దేశాలు.. 59 వైరాలజీ ల్యాబ్‌లు.. ఎంత భద్రం?
సాక్షి ,సెంట్రల్ డెస్క్: ఏడాదిన్నరగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే లీకైందన్న సందేహాలు ఉన్నాయి. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే వైరస్‌లపై ప్రయోగాలు చేసే ల్యాబ్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమేనన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. ఒక్క వూహాన్ ల్యాబ్ నుంచి బయటికొచ్చిన ఒక్క వైరస్ ఇంత ప్రమాదకరంగా మారితే.. ప్రపంచవ్యాప్తంగా అలాంటి ల్యాబ్‌లు ఎన్ని ఉన్నాయి? వాటిలో భద్రతాప్రమాణాల పరిస్థితి ఏమిటన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. దీనిపై ‘న్యూక్లియర్ త్రెట్ ఇనిషియేటివ్ (ఎన్టీఐ)’ విస్తృతంగా స్టడీచేసి నివేదిక విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందామా? ప్రపంచంలో పెద్దది.. వూహాన్ ల్యాబ్ బీఎస్ఎల్–4 ల్యాబ్‌ల పరిమాణం కూడా ఎంతో కీలకం. చిన్నస్థాయిలో ల్యాబ్‌లలో పరిశోధనలు తక్కువైనా, ప్రమాదకర సూక్ష్మజీవులు బయటికొచ్చే ప్రమాదమూ తక్కువగానే ఉంటుంది. పెద్ద ల్యాబ్‌లలో ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులపై, విస్తృత ప్రయోగాలు జరుగుతుంటాయి. లీకయ్యే ప్రమాదం కాస్త ఎక్కువే. ► చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్ ప్రపంచంలోనే అతి పెద్దది. దాని విస్తీర్ణం 3 వేల చదరపు మీటర్ల (32 వేల చదరపు అడుగుల)కుపైనే ఉంటుంది. ► 11 ల్యాబ్‌లు వెయ్యి చదరపు మీటర్లపైన.. మరో 11 ల్యాబ్‌లు 200–1000 చదరపు మీటర్ల మధ్య.. 22 ల్యాబ్‌లు 200 చదరపు మీటర్ల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. మరికొన్ని ల్యాబ్‌ల వివరాలు అందుబాటులో లేవు. ప్రమాదంతో.. ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ల్యాబ్‌లలో వైరస్లు, సూక్ష్మజీవులపై పరిశోధనలు చేస్తుంటారు. అందులో మందులు, వ్యాక్సిన్లు లేని అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై ప్రయో గాలు చేసే ల్యాబ్‌లకు ‘బయో సేఫ్టీ లెవల్ 4 (బీఎస్ఎల్–4)’ భద్రతా ప్రమాణాలు తప్పనిసరి. దీనికి అత్యంత కఠినమైన నిబంధనలు ఉంటాయి. ► బీఎస్ఎల్–4 ల్యాబ్‌లలో పరిశోధకులు మొత్తం శరీరాన్ని కప్పేసి, లోపలి నుంచే ఆక్సిజన్ అందించే ప్రెషరైజ్డ్ సూట్స్ ధరించాల్సి ఉంటుంది. భద్రత, రక్షణ ఎంతెంత? బీఎస్ఎల్–4 ల్యాబ్‌లు ఉన్న 22 దేశాల్లో (తైవాన్ మినహా) భద్రత, రక్షణ ప్రమాణాలపై ‘న్యూక్లియర్ త్రెట్ ఇనిషియేటివ్ (ఎన్టీఐ)’ ఆధ్వర్యంలో గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. ఆయా దేశాల్లో పరిస్థితులు, చట్టాలు, విధానాలు, రక్షణ చర్యల ఆధారంగా అంచనాలు వేసింది. ► ప్రమాదకర సూక్ష్మజీవులు లీక్‌కాకుండా చేపట్టే కట్టుదిట్టమైన ‘బయోసేఫ్టీ’ చర్యలను పరిశీలిస్తే.. 6 దేశాల్లో ఉత్తమంగా, 11 దేశాల్లో మధ్యస్థంగా, 5 దేశాల్లో తక్కువగా ఉన్నాయి. ► ప్రమాదకర వైరస్‌లను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా (జీవాయుధంగా) విడుదల చేయకుండా తీసుకునే ‘బయోసెక్యూరిటీ’ చర్యలు.. ఐదు దేశాల్లోనే బాగుండగా, 8 దేశాల్లో మధ్యస్థంగా, 9 దేశాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. ► వైరాలజీ ల్యాబ్‌లు ఉన్నా, లేకున్నా మొత్తం గా 195 దేశాల్లో బయోసేఫ్టీ, బయోసెక్యూరిటీ పరిస్థితులను ఎన్టీఐ పరిశీలించింది. 60శాతం దేశాల్లో బయోసేఫ్టీ దారుణంగా ఉందని, బయో సెక్యూరిటీ చర్యలు అయితే 80 శాతం దేశాల్లో అతితక్కువగా ఉందని తేల్చింది. పట్టణ ప్రాంతాల్లోనే.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర వైరస్‌లపై ప్రయోగాలు చేస్తున్న, నిర్మాణంలో ఉన్న ల్యాబ్‌లు 23 దేశాల్లో 59 చోట్ల ఉన్నాయి. ఖండాల వారీగా చూస్తే.. యూరప్‌లో 25, ఉత్తర అమెరికాలో 14, ఆసియాలో 13, ఆస్ట్రేలియాలో 4, ఆసియాలో 3 ల్యాబ్‌లు ఉన్నాయి. ► మొత్తం ల్యాబ్‌లలో 60 శాతం ప్రభుత్వ రంగంలో, 20 శాతం యూనివర్సిటీల ఆధ్వర్యంలో, మరో 20 శాతం ప్రైవేటు సంస్థల పరిధిలో కొనసాగుతున్నాయి. వైరస్లు, ఇతర సూక్ష్మజీవుల సామర్థ్యం, వ్యాప్తి,సోకితే వచ్చే లక్షణాలు, వాటి నిర్మాణ క్రమం, ఎదుర్కొనేందుకు తోడ్పడే అంశాలపై ప్రయోగాలు నిర్వహిస్తుంటారు. ► 59 ల్యాబ్లకుగాను 46 ల్యాబ్‌లు పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఒకవేళ వైరస్ లీకైతే దా ని ప్రభావం వేగంగా, ఎక్కువగా ఉంటుంది. ల్యాబ్‌ల నియంత్రణ ఎలా? ► ‘బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్’, ఐక్యరాజ్యసమితి భద్రాతామండలి తీర్మానాల ప్రకారం.. బీఎస్ఎల్–4 ల్యాబ్‌లు ఉన్న దేశాన్నీ బయోసేఫ్టీ, సెక్యూరిటీ కోసం చట్టాలు చేసి, ల్యాబ్‌లపై నిఘా పెట్టాల్సి ఉంటుంది. ► ప్రమాదకర ల్యాబ్‌లు ఉన్న దేశాల్లో సగానికన్నా తక్కువ దేశాలు మాత్రమే ‘ఇంటర్నేషనల్ బయోసేఫ్టీ, సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ గ్రూప్’లో సభ్యులుగా ఉండటం గమనార్హం. ► ల్యాబ్‌లలో చేసిన పరిశోధనలు దుర్వినియోగం కాకుండా కఠిన చట్టాలు, విధానాలను కేవలం మూడు (ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్) మాత్రమే అమలు చేస్తున్నాయి. మరో మూడు (జర్మనీ, స్విట్జర్లాండ్, బ్రిటన్) దేశాల్లో పలు నిబంధనలు ఉన్నాయి. మిగతా చోట్ల ఈ పరిస్థితి లేదు. చదవండి: కోవాగ్జిన్ ఒప్పందం.. బ్రెజిల్లో ప్రకంపనలు -
చైనాపై ఐసీజేలో కేసు వేయాలి
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను సృష్టించిన చైనాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో (ఐసీజే) కేసు దాఖలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఈ వైరస్‌ను చైనా ఉద్దేశపూర్వకంగానే తయారు చేసిందని, నష్టపరిహారంగా 600 బిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేయాలని పిటిషనర్ కె.కె.రమేశ్ కోరారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, వందలాది మరణాలకు కారణమవుతున్న కరోనా వైరస్ చైనాలోని ‘వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’లో రూపుదిద్దుకుంది అనేందుకు కచ్చితమైన ఆధారాలున్నాయని ఆ పిటిషన్లో రమేశ్ వివరించారు. -
వూహాన్ ల్యాబ్ నుంచే వచ్చింది: పాంపియో
వాషింగ్టన్/బీజింగ్: కరోనా వైరస్ వూహాన్‌లోని పరిశోధనశాల నుంచే విడుదలైందని తమవద్ద ఆధారాలున్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. సాక్ష్యాలను తాను స్వయంగా చూశానని ‘ఫాక్స్ న్యూస్’తో చెప్పారు. వూహాన్‌లోని ల్యాబ్ నుంచి వైరస్ విడుదలైనట్లు చైనీయులకు గత ఏడాది డిసెంబర్లోనే తెలిసినా అవసరమైన వేగంతో వారు స్పందించలేదని ఆయన ఆరోపించారు. ఈ విషయాలన్నింటినీ రూఢి చేసుకునేందుకే విచారణకు అనుమతించాల్సిందిగా చైనాను కోరుతున్నామన్నారు. రెండో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ రెండో ప్రపంచయుద్ధ సమయంలో జపాన్ అమెరికాలోని పెర్ల్ హార్బర్‌పై చేసిన దాడి కంటే ఎక్కువ నష్టం ప్రస్తుతం కరోనా వైరస్‌తో వాటిల్లిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కోవిడ్ చికిత్సలో కీలకపాత్ర పోషిస్తున్న నర్సులతో ట్రంప్ మాట్లాడుతూ.. నర్సులు అసలైన అమెరికన్ హీరోలని, పదకొండేళ్లుగా నర్సుగా పనిచేస్తున్న లూక్ ఆడమ్స్... న్యూయార్క్‌లో వైరస్ విజృంభణ తెలియగానే అక్కడికి చేరుకుని తన కారులోనే ఉంటూ తొమ్మిది రోజులపాటు కోవిడ్ రోగులకు సేవలందించారని తెలిపారు. వూహాన్ ల్యాబ్‌లో ఫ్రాన్స్.. వూహాన్‌లోని పీ4 వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫ్రాన్స్ భాగస్వామ్యంతోనే నిర్మించామని సిబ్బంది మొత్తం అక్కడే శిక్షణ పొందారని చైనా పేర్కొంది. అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో వైరస్ పుట్టుకపై అన్నీ కట్టుకథలు చెబుతున్నారని, పీ4 ల్యాబ్ ఫ్రాన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటైన సంగతి ఆయనకు ఇంకా తెలిసినట్లు లేదని చైనా వ్యాఖ్యానించింది. ల్యాబ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారని, నిర్వహణ కూడా అదే స్థాయిలో ఉంటుందని తెలిపింది. పెర్ల్ హార్బర్ దాడి కంటే కరోనా వైరస్ దాడి చాలా పెద్దదని ట్రంప్ చెబుతున్నారని, అయితే అమెరికా శత్రువు కరోనా వైరస్ అవుతుంది గానీ చైనా కాదని అన్నారు. వైరస్‌పై పోరాడేందుకు అమెరికా చైనాతో కలిసి రావాలని కోరారు. ఐక్యరాజ్య సమితిలో చైనా దౌత్యవేత్త చెన్ షూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో విచారణకు అంగీకరించినట్లు వచ్చిన వార్తలపై హువా స్పందిస్తూ.. తాము ప్రపంచ ఆరోగ్య సంస్థను వ్యతిరేకిస్తున్నట్లు ఎప్పుడూ చెప్పలేదని, వైరస్ పుట్టుకపై పారదర్శకంగానే ఆ సంస్థకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. -
ఫుడ్ బ్యాంక్స్ వద్ద జనం క్యూ
వాషింగ్టన్/బీజింగ్: అమెరికాలో కోవిడ్–19 ధాటికి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. 2 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవడంతో మూడు పూటలా గడవని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఉచితంగా అందించే ఫుడ్ బ్యాంకుల ఎదుట అమెరికన్లు క్యూలు కడుతున్నారు. న్యూ ఓర్లాన్సీ నుంచి డెట్రాయిట్ వరకు ఇదే పరిస్థితి. ఇలా ఫుడ్ బ్యాంకుల దగ్గరకి వెళ్లడం చాలా మందికి ఇదే మొదటిసారి. పెన్సిల్వేనియాలో ఒక ఫుడ్ సెంటర్ దగ్గర ఏకంగా వెయ్యి కార్లు క్యూలో ఉన్నాయంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓహియోలో రాత్రికి రాత్రి ఫుడ్ సెంటర్లలో 30 శాతం డిమాండ్ పెరిగిపోయింది. తమ వంతు రావడానికి గంటలు గంటలు సమయం పడుతోంది. చైనాని హెచ్చరించిన ట్రంప్ కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి అంశంలో చైనాపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంపై మరోసారి విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తికి కారణం చైనాయేనని తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ‘‘వైరస్ వ్యాప్తి గురించి చైనా తెలిసి కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించిందని వెల్లడైతే తేలిగ్గా తీసుకోం. 1917 తర్వాత ఈ స్థాయిలో ప్రాణనష్టం చూడలేదు. పరిణామాలన్నీ చాలా తీవ్రంగా ఉంటాయి’’అని హెచ్చరించారు. ఈ సంక్షోభ సమయంలో చైనా కోవిడ్‌పై పారదర్శకంగా లేకపోవడం, మొదట్లో అమెరికా అందించిన సాయాన్ని స్వీకరించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వైరస్ భయోత్పాతం సృష్టిస్తుందని వాళ్లకి ముందే తెలుసునని అందుకే అమెరికా సాయం చేస్తానన్నా అంగీకరించలేదని ట్రంప్ గుర్తు చేశారు. ఇక మరణాల సంఖ్య విషయంలో కూడా చైనా నిజాలు దాస్తోందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా కంటే కూడా చైనాలోనే మృతుల సంఖ్య ఎక్కువ ఉండి ఉంటుందని అన్నారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ముందున్న జో బిడెన్‌కు చైనా మద్దతు ఉందని ట్రంప్ ఆరోపించారు. బిడెన్ విజయం సాధిస్తే అమెరికాను చైనా ఆక్రమించుకుంటుందని జోస్యం చెప్పారు. బిడెన్ వాణిజ్య విధానాల వల్ల ప్రజలకి ఒరిగేదేమీ ఉండదన్నారు. ► స్పెయిన్‌లో కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పడుతోంది. ఆదివారం 410 మంది మరణించారు. నెల రోజులుగా నమోదైన మృతుల్లో ఇదే అత్యంత తక్కువ. కరోనా వైరస్ రావడానికి ముందు ప్రపంచయాత్రకి బయల్దేరిన కోస్తా డెలిజియోసా అనే నౌక స్పెయిన్‌లోని బార్సిలోనాకు చేరుకోనుంది. 1831 మంది ప్రయాణికులతో ఉన్న ఈ నౌక 15 వారాలు ప్రపంచ యాత్ర చేసింది. అందులో ప్రయాణికులెవరికీ వైరస్ సోకలేదని నౌకని నడిపిన కంపెనీ అధికారులు ఉన్నారు. ► రష్యాలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 24 గంటల్లో 6,060 కేసులు నమోదయ్యాయి. ► బ్రిటన్‌లో కరోనాతో ఇప్పటివరకు 15 వేల మందికి పైగా మృతి చెందారు. వైరస్ ల్యాబ్ నుంచి రాలేదు: వూహాన్ ల్యాబ్ చీఫ్ చైనాలోని వూహాన్లో వైరాలజీ ల్యాబరెటరీ నుంచే కరోనా వైరస్ బయటకు వచ్చిందని అమెరికా చేస్తున్న ఆరోపణల్ని వూహాన్ వైరాలజీ ల్యాబ్ చీఫ్ తోసిపుచ్చారు. కరోనా వైరస్ బట్టబయలు అయ్యాక తొలిసారిగా ల్యాబ్ డైరెక్టర్ యాన్ జిమింగ్ ఆదివారం మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఈ ల్యాబ్‌లో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయో, ఎంత గట్టి భద్రత ఉందో మాకే తెలుసు. ల్యాబ్‌లోంచి వైరస్ బయటకు వచ్చే అవకాశం లేదు’’అని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ల్యాబ్ నుంచి వైరస్ వచ్చిందంటూ మాటలు విసిరి ప్రజల్ని తప్పుదోవ పట్టించదం దురదృష్టకరమని యాన్ అన్నారు. మరోవైపు వూహాన్లో వైరస్ అత్యంత తక్కువ ప్రమాదకరంగా ఉందని చైనా ప్రభుత్వం ప్రకటించింది. -
వూహాన్లో ఏం జరిగింది?
వాషింగ్టన్: కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికా ఆ వైరస్ పుట్టుకపై సమగ్ర విచారణ చేపట్టడానికి సన్నద్ధమైంది. చైనా లోని వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి ఈ వైరస్ ప్రమాదవశాత్తూ బయటకి వచ్చి ఉండడానికే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికా మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఆ కథనాల్లో లేవనెత్తిన పలు సందేహాలకు సమాధానాలు రాబట్టడానికి సమగ్ర దర్యాప్తు చేపడతామని అధ్యక్షుడు ప్రకటించారు. వూహాన్ మార్కెట్లో ఆ గబ్బిలాలు లేవా ? కరోనా వైరస్ ఒకానొక రకమైన గబ్బిలం నుంచి సోకిందని చైనా ప్రభుత్వం చెబుతోంది. అయితే అలాంటి గబ్బిలాలు ఆ ప్రాంతంలో లేవని వూహాన్ వెట్ మార్కెట్లో గబ్బిలం మాంసం విక్రయాలు జరగలేదంటూ ఫాక్స్ న్యూస్ చానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. చైనా సర్కార్ చెబుతున్న గబ్బిలాలు వూహాన్‌కి 64 కి.మీ. దూరంలో ఉన్నాయంటూ తాను రూపొందించిన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు కరోనా వైరస్ సోకిన మొట్టమొదటి పేషెంట్ జీరో వైరాలజీ ల్యాబ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారని ఆ వ్యక్తి ద్వారానే కరోనా సోకిందని చెబుతోంది. ల్యాబ్‌లో భద్రత కరువు? వూహాన్లో వైరాలజీ ల్యాబొరేటరీకి భద్రతా ఏర్పాట్లు తగినంత స్థాయిలో లేవని, అందుకే ఏదైనా జరిగి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తూ వాషింగ్టన్ పోస్టు తన కథనంలో రాసుకొచ్చింది. చైనాలో అమెరికా దౌత్యవేత్తలు అందించిన సమాచారం ప్రకారం 2018లో అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పలుమార్లు వూహాన్లో వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించారు. అక్కడ సరైన భద్రత ఏర్పాట్లు లేవని, గబ్బిలాల్లో వైరస్‌కు సంబంధించి అక్కడ జరుగుతున్న పరిశోధనల సమయంలో సార్స్ వంటి వైరస్లు బయటకు లీకయ్యే అవకాశాలు ఉన్నాయని రెండేళ్ల క్రితమే అమెరికా ప్రభుత్వాన్ని శాస్త్రవేత్తలు హెచ్చరించినట్టుగా తన కథనంలో పేర్కొంది. ఆ ల్యాబ్‌లో ఏం చేస్తారు? వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ఆసియాలోనే అతి పెద్ద వైరాలజీ ల్యాబ్. అందులో 1,500 రకాల వైరస్‌లపై పరిశోధనలు సాగుతున్నాయి. వైరస్ల తీవ్రత అనుగుణంగా పీ1 నుంచి పీ4 వరకు ల్యాబ్‌లలో పరిశోధనలు చేస్తారు. తక్కువ హానికర వైరస్‌లను పీ1లో చేస్తే ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై పీ4 ల్యాబొరేటరీలో చేస్తారు. ఈ పీ4 ల్యాబొరేటరీని 4.2 కోట్ల డాలర్ల వ్యయంతో 2015లో నిర్మించారు. 2018 నుంచి పని చేయడం ప్రారంభించింది. గబ్బిలం నుంచి సంక్రమించే వైరస్‌లపై ఇక్కడ పరిశోధనలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. వూహాన్ శివార్లలో ఉండే ఈ ల్యాబ్‌కి సమీపంలో వెట్ మార్కెట్ ఉంది. ఈ ల్యాబ్‌లో పనిచేయాలంటే సమర్థవంతులైన టెక్నీషియన్లు ఉండాలి. అయితే ఈ ల్యాబ్‌లో నిపుణుల కొరత ఉందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని అమెరికా గతంలో సూచించింది. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) వంటి సంస్థలు ఆ ల్యాబ్‌లో పటిష్టమైన భద్రత ఉందని, అందులోంచి వైరస్ లీకయ్యే అవకాశం లేదని కచ్చితంగా చెబుతున్నాయి. పీ4 ల్యాబొరేటరీ -
వుహాన్ వైరాలజీ సంస్థలో 1500 వైరస్లు..!
బీజింగ్: ప్రస్తుతం ప్రపంచమంతా ఆరోగ్య, ఆర్థిక సంక్షోభానికి కారణమైన కరోనా వైరస్(కోవిడ్-19) గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. మానవాళి మనుగడకు సవాలుగా పరిణమించిన ప్రాణాంతక వైరస్ పుట్టుక, వ్యాప్తికి కారణమైందంటూ చైనాపై పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మహమ్మారి జన్మస్థానంగా భావిస్తున్న వుహాన్ నగరంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వుహాన్‌లోని వైరాలజీ సంస్థలోనే కరోనా పురుడు పోసుకుందంటూ కోకొల్లలుగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ చైనా శాస్త్రవేత్తలు మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు. మాంసం మార్కెట్ల నుంచే కరోనా వ్యాప్తి చెందిందని.. జంతువుల నుంచే మనిషికి సోకిందని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తికి గల కారణాలను అన్వేషించేందుకు అగ్రరాజ్యం అమెరికా దర్యాప్తు చేపట్టింది. దీంతో ఆసియాలోనే అతిపెద్ద వైరస్ స్టోరేజీ బ్యాంకుగా పేరొందిన వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చెబుతున్నవి వాస్తవాలేనా లేదా అన్న విషయం త్వరలోనే తేలనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.(వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా లీకైంది...) 1500 వందల కంటే ఎక్కువ.. వివిధ పరిశోధనలు, వ్యాక్సిన్ల అభివృద్ధికై వైరాలజీ సంస్థలు కృషి చేస్తాయి. ఇందుకోసం వైరస్ల జన్యుక్రమాన్ని విశ్లేషించి.. వాటికి విరుగడు కనిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అదే విధంగా వైరస్ల గురించి అప్రమత్తం చేసి... పలు జాగ్రత్తలను సూచిస్తాయి. ఇక చైనాలో వ్యాప్తంగా వుహాన్ వైరాలజీ సంస్థ ఈ బాధ్యతను సమర్థవంతగా నెరవేరుస్తోంది. సంస్థ వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం ఇక్కడ దాదాపు 1500 రకాల వైరస్‌లను భద్రపరిచి ఉంచారు. అత్యంత భద్రత కలిగిన వైరాలజీ ఇన్స్టిట్యూట్గా పేరొందిన ఈ ల్యాబ్‌లో ఎబోలా వంటి మరెన్నో ప్రాణాంతక వైరస్‌లను ప్రిజర్వ్ చేశారు. దాదాపు 42 మిలియన్ల డాలర్ల వ్యయంతో 2015లో నిర్మించిన ఈ ల్యాబ్‌ను.. 2018లో ప్రారంభించారు. ఫ్రెంచ్ బయో ఇండస్ట్రియల్ సంస్థ భాగస్వామ్యంతో దీని నిర్మాణం చేపట్టారు. వుహాన్ నగర శివారులో కొండ ప్రాంతంలో దాదాపు 3 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో దీనిని నిర్మించారు. ఇక వైరస్‌లపై వదంతులు నమ్మకూడదంటూ.. ‘‘నివారణ, నియంత్రణ ముఖ్యం. ఎవరూ భయపడవద్దు. అధికారిక ప్రకటనలనే నమ్మాలి. సైన్సును నమ్మండి. పుకార్లు వ్యాప్తి చేయకండి’’అని పోస్టర్‌ను ల్యాబ్ కాంప్లెక్స్‌లో అమర్చారు. అయితే పూర్తి భద్రత నడుమ ఈ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నామని చైనా చెబుతుంటే.. అమెరికా మాత్రం వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా లీకైందని వాదిస్తోంది.(కరోనా: చైనా లెక్కలపై స్పందించిన డబ్ల్యూహెచ్‌వో) ఈ విషయం గురించి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో శుక్రవారం మాట్లాడుతూ...‘‘వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ నుంచే ఈ వైరస్ ఉద్భవించిందని భావిస్తున్నాం. ఆ ల్యాబ్‌లో ఏం జరుగుతోంది.. పరిసరాలు ఎలా ఉంటాయి తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు వుహాన్ వెళ్తామంటే వారు అంగీకరించడం లేదు. ల్యాబ్ విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు’’అని వాపోయారు. ఏదేమైనా విచారణలో అన్ని విషయాలు వెల్లడవుతాయని ధీమా వ్యక్తం చేశారు. కాగా వుహాన్‌లోని ల్యాబ్‌లో పనిచేసే ఇంటర్న్ కరోనాపై పరిశోధనలు జరుగుతున్న క్రమంలో అనుకోకుండా వైరస్‌ను లీక్ చేశారంటూ అమెరికా మీడియా సంస్థ ఫాక్స్ న్యూస్ సంచలన కథనం వెలువరించిన విషయం తెలిసిందే. చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా అది మాంసం మార్కెట్ల నుంచి కాకుండా ల్యాబ్ నుంచే వ్యాప్తి చెందిందని ఆరోపించింది. (కరోనా: చైనా ‘ఖాతా’లో మరో 1,290 మరణాలు!) ఇదిలా ఉండగా శాస్త్రవేత్తలు కరోనా జన్యుక్రమంపై ఇంతవరకు అవగాహనకు రాలేకపోయారు. దీంతో టీకా అభివృద్ధి మరింత ఆలస్యం కానుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ది లాన్సెట్‌లో చైనీస్ శాస్త్రవేత్తలు ప్రచురించిన జర్నల్ ప్రకారం.. కోవిడ్-19 పేషెంట్‌కు వుహాన్ మార్కెట్‌తో ఎటువంటి సంబంధం లేదని పేర్కొనగా.. షీ జెంగ్లీ అనే మరో శాస్త్రవేత్త గబ్బిలాల ద్వారానే మనిషికి కరోనా సోకిందని తెలిపారు. ఇక లండన్ శాస్త్రవేత్తలు మాత్రం ఇంతవరకు ఇందుకు సంబంధించిన ఆధారాలు లభించలేదని.. కరోనా పుట్టుక ఇంకా తమకు సవాలును విసురుతూనే ఉందని పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో వైరాలజీ ల్యాబ్
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాకి దత్తాత్రేయ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: స్వైన్‌ఫ్లూ, మలేరి యా వంటి వ్యాధుల నివారణలో భాగంగా వాటిపై మరింత లోతైన పరిశోధన కోసం హైదరాబాద్‌లో ఒక వైరాలజీ ల్యాబొరేటరీని ఏర్పా టు చేయాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో స్వైన్‌ఫ్లూ పరి స్థితిని వివరించడంతోపాటు, రాష్ట్రం లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని కోరుతూ దత్తాత్రేయ ఆరోగ్యశాఖ మంత్రికి ఓ వినతి పత్రాన్ని అందజేశారు. శుక్రవారం ఢిల్లీలోని నిర్మాణ్‌భవన్‌లో ఆయన మంత్రి జేపీ నడ్డాను కలిశారు. దత్తాత్రేయతోపాటు కేంద్ర జలవనరులశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం ఉన్నా రు. నడ్డాతో సమావేశం అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్, రంగారెడ్డితోపాటు మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్న విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డా దృష్టికి తెచ్చాను’ అని దత్తాత్రేయ తెలిపారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. ఏటా ఆదిలాబాద్ జిల్లా గిరిజన ప్రాం తాల్లో చాలామంది మలేరియాతో చనిపోతున్నారని, కొత్తగా స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోందని ఈ నేపథ్యంలో వ్యాధులపై పరిశోధనకు హైదరాబాద్‌లో వైరాలజీ రీసెర్చ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరినట్టు వివరించారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని నడ్డా హామీ ఇచ్చినట్టు తెలిపారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచేందుకు వీలుగా సీఎం కేసీఆర్‌తో త్వరలోనే సమావేశమవుతానని చెప్పారు.