
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కరోనా వైరస్ జన్యు శ్రేణిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైరాలజీ ల్యాబొరేటరీల నుంచి నమూనాల సేకరణ ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డబ్ల్యూజీఎస్(హోల్ జినోమిక్ సీక్వెన్సింగ్–మొత్తం జన్యుశ్రేణి)ని తెలుసుకునేందుకు ఈ నమూనాలను పంపిస్తారు. మనకు మొత్తం 13 జిల్లాల్లో 14 వైరాలజీ ల్యాబొరేటరీలున్నాయి. వీటిలో ఒక్కో ల్యాబొరేటరీ నుంచి ప్రతి మూడు రోజులకోసారి 10 శాంపిళ్లు పంపించాల్సి ఉంటుంది.
నెలలో మొత్తం 100 నమూనాలను విధిగా సేకరించి పంపాలి. ఉదాహరణకు సెప్టెంబర్ ఒకటో తేదీన ఒక ల్యాబొరేటరీ నుంచి 10 శాంపిళ్లు పంపిస్తే.. తిరిగి సెప్టెంబర్ మూడో తేదీన 10 శాంపిళ్లు పంపించాలి. అంటే ప్రతి నెలా మన రాష్ట్రంలో 14 ల్యాబొరేటరీల నుంచి 1,400 శాంపిళ్లు జినోమిక్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీ(సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ)కి పంపుతారు. అక్కడ జన్యు శ్రేణి పోకడలు, వాటి తీవ్రత వంటివి గుర్తిస్తారు. ఈ మేరకు అన్ని ల్యాబొరేటరీలకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జినోమిక్ సర్వేను చేపట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment