visaka beach
-
విశాఖ బీచ్‌లో వివాహిత డెడ్‌బాడీ కలకలం.. ఏం జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్‌లో మహిళ డెడ్‌బాడీ కలకలం సృష్టించింది. వైఎంసీఏ బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, మృతురాలిని పెదగంట్యాడకు చెందిన శ్వేతగా గుర్తించారు. వివరాల ప్రకారం.. వివాహిత శ్వేత మంగళవారం మిస్ అయినట్టు న్యూపోర్టు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రమంలో శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, బుధవారం ఉదయం విశాఖ ట్రీ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ మృతదేహాం లభ్యమైనట్టు సమాచారం వచ్చింది. అయితే, నిన్న అర్ధరాత్రి సముద్రపు అలల తాకిడి మృతదేహాం కొట్టుకువచ్చినట్టు గుర్తించారు. కానీ, మహిళ మృతదేహాంపై గాయాలు, ఒంటిపై దుస్తులు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా హత్య చేశారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు.. శ్వేత భర్త ఐటీ ఉద్యోగి. ఆమె 5 నెలల గర్భిణి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాజాగా శ్వేత మృతదేహాం లభ్యమైన ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్వేత ఆత్మహత్య చేసుకుందా?.. లేక ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
తీరానికి ‘భద్రాకు’ చికిత్స
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సాగరతీరం.. ప్రతి రోజూ కొత్త అందాలను పరిచయం చేస్తుంటుంది. రోజూ వెళ్లి తీరంలో కూర్చున్నా.. పాదాల్ని ముద్దాడే అలలు బోలెడు కొత్త ఊసులు చెబుతుంటాయి. ప్రపంచ పర్యాటకులు మెచ్చే.. విశాల విశాఖ తీరానికి మరిన్ని సొబగులద్దుతున్నారు. గతంలో కొబ్బరి చెట్లను నాటి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. తాజాగా బీచ్ కోతను నివారించేందుకు సమాయత్తమవుతున్నారు. పర్యాటకులకు పచ్చని అందాలు పంచడంతో పాటు.. కోతను సహజ సిద్ధంగా నివారించేందుకు సన్‌రే సంస్థతో కలసి జీవీఎంసీ స్కేవోలా టాకాడా మొక్కలు పెంచాలని నిర్ణయించింది. బీచ్ కోతకు గురవుతున్న నేపథ్యంలో.. దాన్ని అరికట్టేందుకు సన్‌రే సంస్థ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. భద్రాకు మొక్కలు అని తెలుగులో పిలిచే స్కేవోలా టాకాడాను బీచ్ క్యాబేజీ అని కూడా పిలుస్తారు. ఇవి పొదల్లా పెరుగుతాయి. 4 మీటర్ల ఎత్తు పెరిగే ఈ భద్రాకు మొక్కల ఆకులు సుమారు 20 సెంమీ పొడవుంటాయి. ఈ మొక్కలు గుబురుగా పెరగడం వల్ల.. తీరంలో పచ్చదనం పరచుకోవడమే కాకుండా.. బీచ్ కోతకు గురి కాకుండా నివారించగలమని అధికారులు చెబుతున్నారు. ఇవి అతి నీలలోహిత కిరణాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి. బ్రెజిల్ దేశానికి చెందిన ఈ మొక్కలను సన్‌రే సంస్థ తమ ప్లాంట్‌లో 2014 నుంచి పెంచుతోంది. తమ రిసార్ట్‌లో సత్ఫలితాలు ఇవ్వడంతో.. విశాఖ బీచ్‌లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
విశాఖ తీరంలో నేవీ మారథాన్
విశాఖపట్నం: తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ సముద్రతీరంలో ఆదివారం ఉదయం నేవీ మారథాన్ పోటీలు ప్రారంభమయ్యాయి. బీచ్‌రోడ్డులో ప్రారంభమైన ఈ పోటీల్లో మారథాన్(42 కి.మీ), హాఫ్ మారథాన్(21 కి.మీ) విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో నౌకాదళ సిబ్బందితో పాటు పలు దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. -
విశాఖ బీచ్‌లో నలుగురు గల్లంతు
డాబాగార్డెన్స్: విశాఖపట్నంలోని ఏయూ ఉమెన్స్ హాస్టల్ బీచ్ వద్ద సముద్రంలో ఆదివారం సాయంత్రం నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ప్రాథమిక సమాచారం మేరకు... సెలవు దినం కావడంతో ఆదివారం నేలమ్మవేపచెట్టు ప్రాంతంలోని ప్రియాంక విద్యోదయ స్కూల్‌కు చెందిన ఏడుగురు పదో తరగతి విద్యార్థులు బీచ్‌కు వెళ్లారు. వారిలో ఆరుగురు సముద్రంలోకి వెళ్లగా గణేశ్, కె.రోహిత్, అబ్దుల్ జబార్ గల్లంతయ్యారు. వీరి కోసం గజ ఈతగాళ్లు తీవ్రంగా గాలిస్తున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన ఏడుగురు సభ్యుల బృందం కూడా సముద్రంలోకి దిగగా, ఢిల్లీకి చెందిన షరీఫ్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. స్వల్ప వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు జరిగాయి.