తీరం అందాలను పెంచే భద్రాకు మొక్కలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సాగరతీరం.. ప్రతి రోజూ కొత్త అందాలను పరిచయం చేస్తుంటుంది. రోజూ వెళ్లి తీరంలో కూర్చున్నా.. పాదాల్ని ముద్దాడే అలలు బోలెడు కొత్త ఊసులు చెబుతుంటాయి. ప్రపంచ పర్యాటకులు మెచ్చే.. విశాల విశాఖ తీరానికి మరిన్ని సొబగులద్దుతున్నారు. గతంలో కొబ్బరి చెట్లను నాటి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. తాజాగా బీచ్ కోతను నివారించేందుకు సమాయత్తమవుతున్నారు. పర్యాటకులకు పచ్చని అందాలు పంచడంతో పాటు.. కోతను సహజ సిద్ధంగా నివారించేందుకు సన్‌రే సంస్థతో కలసి జీవీఎంసీ స్కేవోలా టాకాడా మొక్కలు పెంచాలని నిర్ణయించింది.
బీచ్ కోతకు గురవుతున్న నేపథ్యంలో.. దాన్ని అరికట్టేందుకు సన్‌రే సంస్థ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. భద్రాకు మొక్కలు అని తెలుగులో పిలిచే స్కేవోలా టాకాడాను బీచ్ క్యాబేజీ అని కూడా పిలుస్తారు. ఇవి పొదల్లా పెరుగుతాయి. 4 మీటర్ల ఎత్తు పెరిగే ఈ భద్రాకు మొక్కల ఆకులు సుమారు 20 సెంమీ పొడవుంటాయి. ఈ మొక్కలు గుబురుగా పెరగడం వల్ల.. తీరంలో పచ్చదనం పరచుకోవడమే కాకుండా.. బీచ్ కోతకు గురి కాకుండా నివారించగలమని అధికారులు చెబుతున్నారు. ఇవి అతి నీలలోహిత కిరణాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి. బ్రెజిల్ దేశానికి చెందిన ఈ మొక్కలను సన్‌రే సంస్థ తమ ప్లాంట్‌లో 2014 నుంచి పెంచుతోంది. తమ రిసార్ట్‌లో సత్ఫలితాలు ఇవ్వడంతో.. విశాఖ బీచ్‌లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment