beach erosion
-
తీరానికి ‘భద్రాకు’ చికిత్స
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సాగరతీరం.. ప్రతి రోజూ కొత్త అందాలను పరిచయం చేస్తుంటుంది. రోజూ వెళ్లి తీరంలో కూర్చున్నా.. పాదాల్ని ముద్దాడే అలలు బోలెడు కొత్త ఊసులు చెబుతుంటాయి. ప్రపంచ పర్యాటకులు మెచ్చే.. విశాల విశాఖ తీరానికి మరిన్ని సొబగులద్దుతున్నారు. గతంలో కొబ్బరి చెట్లను నాటి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. తాజాగా బీచ్ కోతను నివారించేందుకు సమాయత్తమవుతున్నారు. పర్యాటకులకు పచ్చని అందాలు పంచడంతో పాటు.. కోతను సహజ సిద్ధంగా నివారించేందుకు సన్‌రే సంస్థతో కలసి జీవీఎంసీ స్కేవోలా టాకాడా మొక్కలు పెంచాలని నిర్ణయించింది. బీచ్ కోతకు గురవుతున్న నేపథ్యంలో.. దాన్ని అరికట్టేందుకు సన్‌రే సంస్థ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. భద్రాకు మొక్కలు అని తెలుగులో పిలిచే స్కేవోలా టాకాడాను బీచ్ క్యాబేజీ అని కూడా పిలుస్తారు. ఇవి పొదల్లా పెరుగుతాయి. 4 మీటర్ల ఎత్తు పెరిగే ఈ భద్రాకు మొక్కల ఆకులు సుమారు 20 సెంమీ పొడవుంటాయి. ఈ మొక్కలు గుబురుగా పెరగడం వల్ల.. తీరంలో పచ్చదనం పరచుకోవడమే కాకుండా.. బీచ్ కోతకు గురి కాకుండా నివారించగలమని అధికారులు చెబుతున్నారు. ఇవి అతి నీలలోహిత కిరణాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి. బ్రెజిల్ దేశానికి చెందిన ఈ మొక్కలను సన్‌రే సంస్థ తమ ప్లాంట్‌లో 2014 నుంచి పెంచుతోంది. తమ రిసార్ట్‌లో సత్ఫలితాలు ఇవ్వడంతో.. విశాఖ బీచ్‌లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
బీచ్ కోత నివారణకు రూ.7.5 కోట్లు
సాక్షి, గార: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కళింగపట్నం (కె.మత్స్యలేశం) బీచ్ వంశధార వరద వల్ల కోతకు గురవ్వకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.7.50 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు పరిపాలన ఆమోదం తెలిపింది. దీంతో వంశధార నది సముద్రంలో కలిసే సంగమం వద్ద మత్స్యలేశం గ్రామం వైపు గ్రోయిన్లు నిర్మించనున్నారు. దీనివల్ల వంÔశధార వరద సమయంలో కోత బెడదకు అడ్డుకట్ట పడనుంది. ప్రతి ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో వంశధారకు వరద వస్తుంది. వరద వచ్చినప్పుడు నది దిశ మార్చుకుంటూ కె.మత్స్యలేశం వైపు పయనిస్తుంది. ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఉన్న సుమారు వంద ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది. ఇదే పరిస్ధితి కొనసాగితే కె.మత్స్యలేశం, బందరువానిపేట పంచాయతీలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. గతేడాది ఆగస్టు 9వ తేదీన వచ్చిన వరదతో బీచ్‌రోడ్డు కోతకు గురయ్యింది. పర్యాటకుల ఆహ్లాదం కోసం రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలు, గ్రానైట్ బెంచీలు కొట్టుకుపోయాయి. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందారు. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పరిశీలించి శాశ్వత చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రొయ్యల చెరువుల కోసం... నదీ తీరం ఆక్రమించేసి... వంశధార నది సంగమానికి సమీపంలో రెండు పాయలుగా ఉండి, సముద్రంలో కలిసే సరికి ఒకే నదిగా ఏర్పడుతుంది. నదికి ఆవలి వైపునున్న పోలాకి మండలం అంపలాం వద్ద భూమి ఆక్రమణకు గురయ్యింది. బడా వ్యాపారస్తులు ఇసుక దిబ్బలను రొయ్యల చెరువులుగా మార్చుకున్నారు. ఆ చెరువుల్లోకి వరద నీరు వెళ్లకుండా నదివైపు పెద్ద ఎత్తున గట్లు నిర్మించుకున్నారు. దీనివల్ల నీరు వేగం పెరిగి సముద్రంలో కలుస్తూ తీరాన్ని కబళించేసింది. ఆక్రమణలను గత ప్రభుత్వం చూసీ చూడనట్టు వదిలేసింది. అధికారులు సర్వేలు చేసి నా టీడీపీ నాయకుల ఒత్తిడితో ఎక్కడివక్కడ నిలిచిపోయినట్టు ఆరోపణలున్నాయి. పలుమార్లు టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని ప్రకటించడమే తప్ప ఆచరణలో అమలు కాలేదు. కోతకు గురయిన ప్రాంతం వద్ద గ్రోయిన్ల నిర్మాణానికి మార్గం సుగమం అవ్వడంతో రెండు పంచాయతీల ప్రజలు ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ధర్మాన లేఖతో అత్యున్నత స్థ్ధాయి కమిటీ ఏర్పాటు పర్యాటక ప్రదేశం కోతకు గురవ్వడంతోపాటు మత్స్యకారుల ఆందోళనపై ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్మోహన్రెడ్డికి లేఖ రాయడంతో ప్రభుత్వం అత్యున్నత స్ధాయి కమిటీ వేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో అప్పటి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం నార్త్‌కోస్టు హైడ్రాలజీ విశ్రాంత ఇంజినీర్ ఇన్ చీఫ్ రౌతు సత్యనారాయణ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ముగ్గురు నిపుణుల బృందం నదీ సంగమ స్ధలాలు కోతకు గురైన కారణాలను పరిశీలించింది. అంపలాం వద్ద రొయ్యల చెరువులు ఆక్ర మంగా నిర్మించారని నిర్ధారించి వాటిని తొలగించాలని సూచించారు. అధికారులు కొంతమేర తొలగించారు. ఇదిలావుండగా కొద్ది రోజుల క్రితం లోకాయుక్త నదిలో ఆక్రమణలను మే 15 కల్లా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. -
కోతకు ఇసుకతో అడ్డుకట్ట
ఇప్పటి కష్టాలకు రేవులదే ప్రధాన బాధ్యత {పకృతిసిద్ధ మార్పులూ కారణమే పోర్టుల ద్వారా ఇసుక డిపాజిట్ చేయాల్సిందే బీచ్ కోత నివారణకు పూణె నిపుణుల సిఫార్సులు జీవీఎంసీ బృందానికి నివేదిక సమర్పణ సాక్షి, విశాఖపట్నం : బీచ్ కోతకు కారణాలను శోధించే ప్రయత్నం ఓ కొలిక్కి వస్తోంది. ఈ బాధ్యతను పైన వేసుకున్న మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు సమస్యకు మూలాలు గుర్తించే దిశగా ముందడుగు వేస్తున్నారు. జీవీఎంసీ చొరవతో ఆంధ్ర విశ్వవిద్యాలయం, నగరాభివృద్ధి సంస్థ, పోర్టు, నగరపాలక సంస్థలకు చెందిన ఒక్కో అధికారి ఇటీవల పూణె వెళ్లి అక్కడ కేంద్ర జలశక్తి పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులను సంప్రదించారు. విశాఖలో కోతకు గురైన ప్రాంతాల్ని, అలల గమనాల్ని, సముద్రంలోని ఇసుక తీరు తెన్నులను, పత్రికల్లో వచ్చిన కథనాల్ని అధికారులు చూపించారు. పోర్టుల మోడళ్లను చూపించారు. గత సమాచారం, గణాంకాల ఆధారంగా సమీక్ష అనంతరం పూణె నిపుణులు విశాఖ పరిస్థితిపై ఓ నివేదిక తయారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నష్ట నివారణ చర్యలను చేపట్టేందుకు వీలుగా ఈ నివేదికను నలుగురు అధికారుల బృందానికి అందజేసినట్టు తెలియవచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రకృతి.. వికృతి దేశంలోని ఇతర బీచ్‌లలో సైతం ఇటువంటి విపత్తు చోటు చేసుకుంటోందని గమనించిన పూణె నిపుణులు విశాఖ తీరరేఖను వాటితో సరిపోల్చారు. ఇటీవల సంభవించిన తుఫాన్ల వల్ల; ఈశాన్య/నైరుతి రుతుపవనాలు తీరాన్ని తాకే వేళ వాతావరణంలోని మార్పుల వల్ల కూడా ఆర్కే బీచ్‌లోని కురుసుర, గోకుల్ పార్క్ ప్రాంతాల్లో తీరం కోతకు గురైందని ప్రాథమికంగా అంచనా వేశారు. తుఫాన్ల సమయంలో భారీగా ఇసుక మేటలు వేయడం ఓ కారణమైతే, ఉత్తరం వైపు తరలివెళ్లాల్సిన ఇసుక దక్షిణానికి, దక్షిణం వైపు వెళ్లాల్సిన ఇసుక ఉత్తరానికి మేట వేయడంతో కోత తీవ్రత పెరుగుతోందని గుర్తించారు. కోతకు గురవుతున్న ప్రాంతంలో ఏటా సుమారు 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిక్షిప్తం (డిపాజిట్) కావాల్సి ఉండగా, వివిధ నిర్మాణాల వల్ల, డ్రెడ్జింగ్ సరిగా లేకపోవడం వల్ల, వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కేవలం 50 శాతమే డిపాజిట్ అవుతోందని నిపుణులు గమనించారు. ఇక్కడకు చేరాల్సిన ఇసుక ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతోందని (డ్రిఫ్టింగ్ అవుతోందని) గుర్తించారు. దీర్ఘకాలిక పరిష్కార చర్యల వల్లే ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచించారు. విశాఖ బీచ్ పరిసర ప్రాంతాల్నీ గాబ్రియాన్స్ (పల్చని జియో సింథటిక్ సంచులు), రాళ్లు, జియో బ్యాగ్స్ (ఇసుక నింపే ప్రత్యేక సంచులు) అమర్చాలని సూచించారు. ఆరేళ్ల క్రితం ఏర్పడిన గంగవరం పోర్టు నిర్మాణం వల్ల కూడా ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిపోతోందని సూచించారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ నిర్మాణం సమయంలో రేవులో ఇసుక మేట వేయకుండా తీసుకున్న చర్యలు కూడా ఇప్పుడు కోతను ప్రభావితం చేస్తున్నాయని సూచనప్రాయంగా తెలిపారు. హెచ్‌పీసీఎల్ వ్యర్థాలను సముద్రంలో విడిచిపెట్టడానికి ఉద్దేశించిన పైప్‌లైన్, ఇసుకను పంప్ చేయడానికి పోర్టు గతంలో నిర్మించిన పైప్‌లైన నిర్మాణాలను పరిశీలించాలని సూచించారు. బీచ్ పరిరక్షణ కోసం రెండు పోర్టులూ ఇసుకను నిక్షిప్తం చేస్తూ ఉండాల్సిందేనని నివేదికలో పేర్కొన్నారు. ఈ విషయంలో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటేనే తీరం కోతను అడ్డుకోవడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సంఘటన స్థలంలో తత్కాలిక రక్షణ చర్యలు చేపట్టామని, నిపుణుల సూచనల ప్రకారం భవిష్యత్తులో శాశ్వత చర్యల్ని చేపడతామని జీవీఎంసీ కమిషనర్ ఎం.వి. సత్యనారాయణ తెలిపారు. చెన్నై ఐఐటీ నిపుణుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.