విశాఖ మరింత దూసుకుపోతుంది
త్వరలో కేంద్ర బృందం రాక మొత్తం 34 మంది మృతి
సమన్వయంతో సహాయ కార్యక్రమాలు
సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు
హైదరాబాద్: హుదూద్ వంటి భారీ తుపాను తాకడం కారణంగా విశాఖ నగరంలో పెట్టుబడులు పెట్టడానికి కార్పొరేట్లు, మల్టీనేషనల్ కంపెనీలు వెనక్కి తగ్గుతాయనే ప్రచారంలో ఏ మాత్రం పసలేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. విశాఖ నగరం ఏపీకి ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఇపుడు మరింత వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. సచివాలయంలోని తన చాంబర్లో గురువారం ఆయన మాట్లాడుతూ గతంలో తుపాన్లు మన దేశంలో జనాభా ఉన్న నగరాలు, పట్టణాలను తాకలేదన్నారు. ఎక్కువ గాలుల వేగం ఉన్న అత్యంత ప్రమాదకరమైన పెను తుపాను హుదూద్‌తో కొంత భారీనష్టం కలిగిందే తప్ప ఇలాంటివి, ఇంతకంటే పెద్దవాటితో చైనా, జపాన్, తైవాన్, సౌత్‌కొరియా వంటి దేశాల్లో కోస్తా నగరాలు విలవిల్లాయాడన్న సంగతి మరువరాదని చెప్పారు. అయినా అక్కడ పెట్టుబడులు పెట్టడం ఎవరూ మానుకోలేదన్నారు. బంగాళాఖాతంలో 1891 నుంచి వచ్చిన 77 తుపానుల్లో విశాఖను వణికించినది ఇదొక్కటేనన్నారు. తుపాను, భారీవర్షాల కారణంగా ఉత్తరాంధ్రలోని 44 మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం సంభవించిందని చెప్పారు. కేంద్ర బృందం కూడా త్వరలో వస్తుందని తెలిపారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో 60 శాతం విద్యుత్ స్తంభాలు కూలిన కారణంగా సరఫరా పునరుద్ధరణకు కొంచెం సమయం తీసుకోవలసి వచ్చిందన్నారు. శుక్రవారం నాటికి విశాఖకు, శనివారం నాటికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సరఫరా ఇవ్వగలమని చెప్పారు.
ఇంతవరకు అందిన సమాచారం ఆధారంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆస్తి నష్టం ఎంతన్నది మదింపు జరుగుతోందన్నారు. తుపాను రాక ముందు నుంచీ కేంద్ర ం, వాతావరణ శాఖ హెచ్చరికలు ఎంతో మేలు చే శాయన్నారు. మొదట కొంచెం అనుకూల పరిస్థితులు లేకున్నా ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులు, సాధారణ అధికారుల మధ్య సమన్వయం ఉండటంతో బాధితులకు సాయం చేసే అంశంలో టీమ్ వర్కుతో సునాయాసంగా సమస్యనుంచి రెండోరోజుకే తేరుకున్నామని చెప్పారు. అన్నిటికీ మించి ముఖ్యమంత్రి అక్కడ మకాం వేసి వ్యక్తిగత పర్యవేక్షణ చేయడంతో బాధితులకు సాయం సకాలంలో అందుతోంద న్నారు.