visakha-chennai industrial corridor
-
మరింత వేగంగా వీసీఐసీ అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరో ముందడుగు పడింది. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) అభివృద్ధి మరింత వేగం కానుంది. ఈ కారిడార్‌లో ఇప్పటికే తొలి దశ కింద రూ.2,900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇప్పుడు రెండో దశ అభివృద్ధికి మార్గం సుగమమైంది. తొలి దశ అంచనా వ్యయంలో కొంత భాగం రుణంగా సమకూర్చిన ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) రెండో దశకు కూడా రుణం రూపంలో నిధులు సమకూర్చడానికి అంగీకరించింది. రెండో దశకు రూ. 1,632.82 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా అందులో రూ.1130 కోట్లు (141.12 మిలియన్ డాలర్లు) ఏడీబీ రుణంగా అందించనుంది. ఈ రుణంపై సాధ్యమైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవడానికి అనుమతి కోరుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ (డీఈఏ)తో పాటు రాష్ట్ర అధికారులకు ఏడీబీ కంట్రీ డైరెక్టర్ టకియో కొనిషి లేఖ రాశారు. రెండో దశలో చిత్తూరు సౌత్ క్లస్టర్, రాంబల్లి, నక్కపల్లి క్లస్టర్స్‌లో స్టార్టప్ ఏరియాకు సంబంధించి ఏడు ప్రాజెక్టులను చేపడతారు. కేంద్రం నుంచి అనుమతిరాగానే ఈ పనులు ప్రారంభిస్తామని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 23,046 ఎకరాలు అభివృద్ధి వీసీఐసీ రెండో దశలో చిత్తూరు సౌత్ క్లస్టర్లో రూ.462.96 కోట్లతో 2,770 ఎకరాలు, నక్కపల్లి క్లస్టర్లో రూ.399.03 కోట్లతో 1,120 ఎకరాలు, రాంబల్లిలో రూ.149 కోట్లతో 396 ఎకరాలు అభివృద్ధి చేస్తారు. ఈ మూడు క్లస్టర్లను సమీపంలోని ప్రధాన రహదారులకు అనుసంధానిస్తారు. ఇందులో భాగంగా అనకాపల్లి – అచ్యుతాపురం రోడ్డును రూ.243.02 కోట్లతో జాతీయ రహదారికి అనుసంధానిస్తారు. అదే విధంగా నాయుడుపేట క్లస్టర్‌ను రూ 120.78 కోట్లతో, రౌతు సురమాల క్లస్టర్‌ను రూ.67.42 కోట్లతో, నక్కపల్లి క్లస్టర్‌ను రూ.25.91 కోట్లతో ప్రధాన రహదారులకు అనుసంధానిస్తారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో రూ.164.70 కోట్లు భూ సేకరణకు ఖర్చవుతుంది. మిగిలిన మొత్తంతో ఈ ఏడు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తారు. రెండో దశలో మొత్తం 4,143.92 ఎకరాలను అభివృద్ధి చేస్తుండగా ఇప్పటికే 3,399.43 ఎకరాల సేకరణ పూర్తయింది. ఇంకా 744.49 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఈ రెండు దశలు పూర్తయితే పారిశ్రామిక అవసరాల కోసం 23,046 ఎకరాలు అందుబాటులోకి వస్తాయి. (చదవండి: థాంక్యూ సీఎం సార్ ! సీఎం జగన్ చిత్రపటానికి డీఎస్సీ 1998 ఉద్యోగుల క్షీరాభిషేకం ) -
చౌకగా అందుబాటులోకి.. సరుకు రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సరుకు రవాణాను చౌకగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు (ఎంఎంఎల్పీ)ల నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో రెండు పార్కుల నిర్మాణంపై దృష్టిసారించింది. తొలుత విశాఖపట్నం, అనంతపురం వద్ద రెండు భారీ ఎంఎంఎల్‌పీలను నిర్మించే విధంగా కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు తాజాగా.. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్, హైదరాబాద్–బెంగళూర్ పారిశ్రామిక కారిడార్‌లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద అభివృద్ధి చేస్తున్న భారీ పారిశ్రామిక పార్కుల వద్ద రెండు భారీ ఎంఎంఎల్‌పీలను నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం గతిశక్తి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా.. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద వీటి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వస్తువు ధరలో 13 శాతంగా ఉన్న సరుకు రవాణా వ్యయం ఎంఎంఎల్‌పీలతో దానిని 8 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 300–350 మి.ట.లకు పెరుగుదల ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న నాలుగు పోర్టులు.. రామాయపట్నం, మచిలీపట్నం.. కాకినాడ గేట్‌వే, భావనపాడులతో పాటు విజయవాడ–ఖరగ్‌పూర్ మధ్య సరుకు రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కారిడార్ నిర్మిస్తుండటంతో వీటికి అనుగుణంగా రాష్ట్రంలో మొత్తం నాలుగు ఎంఎంఎల్‌పీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం సుమారు 150 మిలియన్ టన్నులుగా ఉన్న రాష్ట్ర సరుకు రవాణా 2024–25 నాటికి 300–350 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రైల్వేలైన్‌తోనూ అనుసంధానం ఇదే సమయంలో ఓర్వకల్లు పారిశ్రామికవాడను రైల్వేలైన్‌తో అనుసంధానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపాదనలు పంపింది. ఓర్వకల్లు నుంచి పోర్టులు, ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులకు తోడు రైల్వే కనెక్టివిటీ కూడా ఉండేలా కర్నూలు రైల్వేస్టేషన్ నుంచి బనగానపల్లికి ఓర్వకల్లు మీదుగా రైలు మార్గాన్ని అనుసంధానం చేయడంతో పాటు దూపాడు రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ యార్డ్‌నూ నిర్మించాల్సిందిగా ప్రతిపాదన వచ్చింది. -
విశాఖ–చెన్నై కారిడార్‌కు ఆమోదం లేదు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ–చైన్నై మధ్య ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఇండస్ట్రియల్ కారి డార్ పనులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్(ఎన్ఐసీడీఐటీ) ఇంకా ఆమోదం తెలపలేదని శుక్రవారం రాజ్యసభలో పరిశ్రమల శాఖ మంత్రి పీయూస్ గోయల్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఎలాంటి నిధుల కేటాయింపు కూడా జరగలేదన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు చెబుతూ విశాఖ–చైన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా విశాఖపట్నం, మచిలీపట్నం, చిత్తూరు, దొనకొండలను అభివృద్ధి కేంద్రాలుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) గుర్తించినట్లు మంత్రి చెప్పారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు పనుల కోసం ఏడీబీ బ్యాంక్ ఇప్పటివరకు రూ.63.1 కోట్లను విడుదల చేసింది. నాలుగు కేంద్రాల్లో ముందుగా విశాఖపట్నం, చిత్తూరును ప్రధానంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఏడీబీ బ్యాంక్ ఆర్థిక సాయంతో నాయుడుపేటలో నీటి శుద్ధి కేంద్రాన్ని, పారిశ్రామిక ప్రాంతాన్ని మెరుగుపరిచే చర్యలు చేపట్టింది. బల్క్ వాటర్ సప్లై, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ల నిర్మాణం జరుగుతోంది. విశాఖ, చిత్తూరులో విద్యుత్ సబ్స్టేషన్లు సామర్థ్యం పెంచే పనులు జరగుతున్నాయి. నాయుడుపేట, రౌతుసురమాలలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు అభివృద్ధి చేసే పనులు జరుగతున్నట్లు మంత్రి తెలిపారు. ముందుగా విశాఖ–చిత్తూరు కేంద్రాల అభివృద్ధి.. విశాఖ–చైన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో ముందుగా విశాఖ–చిత్తూరు కేంద్రాలను అభివృద్ధి చేసే అంశాన్ని చేర్చాలని ఏపీ ప్రభుత్వం ఎన్‌ఐసీడీఐటీని కోరిందని మంత్రి చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే దీని మాస్టర్ ప్లాన్, ఇంజినీరింగ్ పనుల చేపట్టి మౌలిక వసతుల కల్పన కింద వివిధ అంశాలకు అయ్యే వ్యయాన్ని అంచనా వేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ఇంకా అభివృద్ధి చేసే దశలోనే ఉన్నందున ఎప్పటికీ పూర్తవుతుందన్న అంచనా లేదని తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం విశాఖలో 6629 ఎకరాలు భూమి సేకరించాల్సి ఉన్నట్లు మంత్రి తెలిపారు. విశాఖ, చిత్తూరు కేంద్రాల అభివృద్ధి కోసం మొత్తం 31,515 వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు 4891 ఎకరాలు సేకరించినట్లు చెప్పారు. -
‘ప్రకాశం’లో పారిశ్రామిక వికాసం
ఒంగోలు: గుంటూరు-విజయవాడ మధ్యలో రాజధాని రానుందనే విషయంపై స్పష్టత రావడంతో, పారిశ్రామికవేత్తల దృష్టి ప్రకాశం జిల్లాపై పడింది. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం పలువురు పారిశ్రామికవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నట్లు తెలిసింది. గత యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) ఏర్పాటుకు 7,500 ఎకరాలను సేకరించాలంటూ కలెక్టర్ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలంలో ఈ భూములను సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా విశాఖపట్నం తరహాలో ఫార్మా సిటీ ని కూడా ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. విశాఖలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో వీరంతా కాబోయే రాజధానికి దగ్గరలో ఉన్న ప్రకాశం జిల్లాను ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఎకరా భూమి ధర రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకూ పలుకుతోంది. బల్క్ డ్రగ్‌లను తయారు చేయడానికి ఒంగోలు, నెల్లూరు, కృష్ణా తీర ప్రాంతాలే అనువుగా ఉంటాయని ఫార్మా పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ నిమ్జ్, ఫార్మా సిటీలతో పాటు విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ లో కూడా ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు ప్రకాశం జిల్లాను ఎంపిక చేసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. కాబోయే రాజధానికి దగ్గరగా ఉండటం ఒక కారణమైతే, ఈ ప్రాంతంలో సహజ వనరులు ఎక్కువగా లభిస్తాయనేది మరో కారణం. ఈ జిల్లా ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు లాభసాటిగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న గ్రానైట్ పరిశ్రమలకు అనుబంధమైన పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారు. విశాఖ, చెన్నై కారిడార్ ద్వారా సీమాంధ్ర మొత్తం అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ప్రకాశం జిల్లాకు మరింతగా అవకాశాలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవడం ద్వారా జిల్లాలో నిరుద్యోగ సమస్యలను అధిగమించవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి కాకుండా చేనేత అనుబంధ పరిశ్రమలు కూడా పెరుగుతాయంటున్నారు. చీరాల, పేరాల ప్రాంతాల్లో తయారవుతున్న వస్త్రాలు కర్ణాటక రాష్ట్రానికి తరలివెళ్లి, అక్కడ నుంచి రెడీమేడ్ దుస్తులు తయారుచే సి, వాటిని తిరిగి ప్రకాశం జిల్లాలో కూడా విక్రయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి లేకుండా, ఇక్కడే రెడీమేడ్ దుస్తుల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. గత యూపీఏ ప్రభుత్వం చీరాల వద్ద టెక్స్టైల్ పార్కును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. పరిశ్రమలు తరలి వచ్చే అవకాశాలే ఎక్కువ భవిష్యత్తులో ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. చేనేత అనుబంధమైన సంస్థలు ఇక్కడకు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. గ్రానైట్, లేత్ పరిశ్రమలతో పాటు, పలకలు, టెక్స్టైల్ పార్కులు రావడానికి అనువైన ప్రదేశంగా ఈ జిల్లాను గుర్తించారు. కోటి రూపాయల లోపు పెట్టుబడితో వచ్చే పరిశ్రమలకు సబ్సిడీ కూడా ఇవ్వనున్నారు. రామాయపట్నం పోర్టు ఇక్కడే ఏర్పడితే, పరిశ్రమల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. - బొలిశెట్టి గౌరీశంకర్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్