
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరో ముందడుగు పడింది. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) అభివృద్ధి మరింత వేగం కానుంది. ఈ కారిడార్‌లో ఇప్పటికే తొలి దశ కింద రూ.2,900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇప్పుడు రెండో దశ అభివృద్ధికి మార్గం సుగమమైంది. తొలి దశ అంచనా వ్యయంలో కొంత భాగం రుణంగా సమకూర్చిన ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) రెండో దశకు కూడా రుణం రూపంలో నిధులు సమకూర్చడానికి అంగీకరించింది.
రెండో దశకు రూ. 1,632.82 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా అందులో రూ.1130 కోట్లు (141.12 మిలియన్ డాలర్లు) ఏడీబీ రుణంగా అందించనుంది. ఈ రుణంపై సాధ్యమైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవడానికి అనుమతి కోరుతూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ (డీఈఏ)తో పాటు రాష్ట్ర అధికారులకు ఏడీబీ కంట్రీ డైరెక్టర్ టకియో కొనిషి లేఖ రాశారు. రెండో దశలో చిత్తూరు సౌత్ క్లస్టర్, రాంబల్లి, నక్కపల్లి క్లస్టర్స్‌లో స్టార్టప్ ఏరియాకు సంబంధించి ఏడు ప్రాజెక్టులను చేపడతారు. కేంద్రం నుంచి అనుమతిరాగానే ఈ పనులు ప్రారంభిస్తామని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు.
మొత్తం 23,046 ఎకరాలు అభివృద్ధి వీసీఐసీ రెండో దశలో చిత్తూరు సౌత్ క్లస్టర్‌లో రూ.462.96 కోట్లతో 2,770 ఎకరాలు, నక్కపల్లి క్లస్టర్‌లో రూ.399.03 కోట్లతో 1,120 ఎకరాలు, రాంబల్లిలో రూ.149 కోట్లతో 396 ఎకరాలు అభివృద్ధి చేస్తారు. ఈ మూడు క్లస్టర్లను సమీపంలోని ప్రధాన రహదారులకు అనుసంధానిస్తారు. ఇందులో భాగంగా అనకాపల్లి – అచ్యుతాపురం రోడ్డును రూ.243.02 కోట్లతో జాతీయ రహదారికి అనుసంధానిస్తారు.
అదే విధంగా నాయుడుపేట క్లస్టర్‌ను రూ 120.78 కోట్లతో, రౌతు సురమాల క్లస్టర్‌ను రూ.67.42 కోట్లతో, నక్కపల్లి క్లస్టర్‌ను రూ.25.91 కోట్లతో ప్రధాన రహదారులకు అనుసంధానిస్తారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో రూ.164.70 కోట్లు భూ సేకరణకు ఖర్చవుతుంది. మిగిలిన మొత్తంతో ఈ ఏడు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తారు. రెండో దశలో మొత్తం 4,143.92 ఎకరాలను అభివృద్ధి చేస్తుండగా ఇప్పటికే 3,399.43 ఎకరాల సేకరణ పూర్తయింది. ఇంకా 744.49 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఈ రెండు దశలు పూర్తయితే పారిశ్రామిక అవసరాల కోసం 23,046 ఎకరాలు అందుబాటులోకి వస్తాయి.
(చదవండి: థాంక్యూ సీఎం సార్ ! సీఎం జగన్ చిత్రపటానికి డీఎస్సీ 1998 ఉద్యోగుల క్షీరాభిషేకం )