నిమ్జ్ ఏర్పాటుకు సంబంధించి భూ సేకరణ జరుపుతారని భావిస్తున్న ప్రకాశం జిల్లాలోని సీఎస్‌పురం మండలం రేఖాచిత్రం
ఒంగోలు: గుంటూరు-విజయవాడ మధ్యలో రాజధాని రానుందనే విషయంపై స్పష్టత రావడంతో, పారిశ్రామికవేత్తల దృష్టి ప్రకాశం జిల్లాపై పడింది. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం పలువురు పారిశ్రామికవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నట్లు తెలిసింది. గత యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) ఏర్పాటుకు 7,500 ఎకరాలను సేకరించాలంటూ కలెక్టర్ కార్యాలయానికి ఆదేశాలు అందాయి.
కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలంలో ఈ భూములను సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా విశాఖపట్నం తరహాలో ఫార్మా సిటీ ని కూడా ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. విశాఖలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో వీరంతా కాబోయే రాజధానికి దగ్గరలో ఉన్న ప్రకాశం జిల్లాను ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఎకరా భూమి ధర రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకూ పలుకుతోంది. బల్క్ డ్రగ్‌లను తయారు చేయడానికి ఒంగోలు, నెల్లూరు, కృష్ణా తీర ప్రాంతాలే అనువుగా ఉంటాయని ఫార్మా పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు.
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్
నిమ్జ్, ఫార్మా సిటీలతో పాటు విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ లో కూడా ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు ప్రకాశం జిల్లాను ఎంపిక చేసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. కాబోయే రాజధానికి దగ్గరగా ఉండటం ఒక కారణమైతే, ఈ ప్రాంతంలో సహజ వనరులు ఎక్కువగా లభిస్తాయనేది మరో కారణం. ఈ జిల్లా ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు లాభసాటిగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న గ్రానైట్ పరిశ్రమలకు అనుబంధమైన పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారు.
విశాఖ, చెన్నై కారిడార్ ద్వారా సీమాంధ్ర మొత్తం అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ప్రకాశం జిల్లాకు మరింతగా అవకాశాలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవడం ద్వారా జిల్లాలో నిరుద్యోగ సమస్యలను అధిగమించవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి కాకుండా చేనేత అనుబంధ పరిశ్రమలు కూడా పెరుగుతాయంటున్నారు.
చీరాల, పేరాల ప్రాంతాల్లో తయారవుతున్న వస్త్రాలు కర్ణాటక రాష్ట్రానికి తరలివెళ్లి, అక్కడ నుంచి రెడీమేడ్ దుస్తులు తయారుచే సి, వాటిని తిరిగి ప్రకాశం జిల్లాలో కూడా విక్రయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి లేకుండా, ఇక్కడే రెడీమేడ్ దుస్తుల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. గత యూపీఏ ప్రభుత్వం చీరాల వద్ద టెక్స్‌టైల్ పార్కును ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
పరిశ్రమలు తరలి వచ్చే అవకాశాలే ఎక్కువ
భవిష్యత్తులో ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. చేనేత అనుబంధమైన సంస్థలు ఇక్కడకు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. గ్రానైట్, లేత్ పరిశ్రమలతో పాటు, పలకలు, టెక్స్‌టైల్ పార్కులు రావడానికి అనువైన ప్రదేశంగా ఈ జిల్లాను గుర్తించారు. కోటి రూపాయల లోపు పెట్టుబడితో వచ్చే పరిశ్రమలకు సబ్సిడీ కూడా ఇవ్వనున్నారు. రామాయపట్నం పోర్టు ఇక్కడే ఏర్పడితే, పరిశ్రమల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది.
- బొలిశెట్టి గౌరీశంకర్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్