cs puram mandal
-
ఆత్మలకూ ఓటు హక్కు.!
సాక్షి, డీజీ పేట (ప్రకాశం): సీఎస్ పురం మండలంలోని డీజీ పేట పంచాయతీలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. ఈ పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల్లో దాదాపు 2,400 ఓట్లు ఉన్నాయి. మూడు బూత్‌లలో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే, ఈ ఏడాది జనవరి 11న ప్రకటించిన ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. మృతిచెందిన 30 మంది ఓట్లను జాబితా నుంచి తొలగించకుండా అలాగే ఉంచారు. కోవిలంపాటి తిరుపతమ్మ, వాడా జయమ్మ, కారంపూటి హుస్సేనయ్య, దువ్వూరి రమణారెడ్డి, అగ్నిగుండాల మస్తాన్‌బీ, కసుమూరి బాదుర్లా, పావలి వెంకటేశ్వర్లు, ఇస్కపల్లి చినమాలకొండయ్య, షేక్ చిన మౌలాలి, పలగొండ్ల వెంకటేశ్వర్లు, ఇలా దాదాపు 30 మంది మృతి చెందగా, వారి ఓట్లను నేటికీ తొలగించలేదు. అదేవిధంగా షేక్ జిలానీ, ఊటుకూరి ఏసయ్య తదితరులకు రెండు ఓట్లు ఉన్నాయి. ఒకే వార్డు, ఒకే ఇంట్లో ఉన్న ఓటర్లను విడదీసి వేరువేరు చోట్ల ఓటు నమోదు చేశారు. భార్యాభర్తల ఓట్లు కూడా వేరువేరు పోలింగ్ బూత్‌లలో ఉండటం గమనార్హం. జాబితా మొత్తం తప్పుల తడకగా ఉండటంతో ఓటర్లు తమ ఓటు ఉందో.. లేదో చూసుకోవాలంటే జాబితా మొత్తం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి ఓటర్ల జాబితాను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. -
వీరు వెలుగు సిబ్బందా.. లేక..
సాక్షి, సీఎస్‌పురం(ప్రకాశం): వెలుగు కార్యాలయ సిబ్బంది పని తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మంగళవారం వెలుగు కార్యాలయంలో ఎపీఎం రజనీకుమారిని కలిశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మండలంలోని పొదుపు గ్రూపుల మహిళల చేత వెలుగు సిబ్బంది ప్రత్యేక తీర్మానాలు రాయిస్తున్నారు. ఈ తీర్మానాలు చేయించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం జేశారు. టీడీపీ నాయకులు అధికారులను ఉపయోగించుకుని తమ పార్టీ కార్యకర్తల ఓట్లను తొలగిస్తున్నారనీ, ఈ నేపథ్యంలో ఎన్నడూ లేని విదంగా డబ్బుకు ఒత్తిళ్లకు లొంగబోమంటూ మహిళల చేత తీర్మానాలు చేయించడంలో మీ ఉద్దేశమేమిటంటూ వారు ప్రశ్నించారు. అలాగే వెలుగు సిబ్బంది అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ వారు చెప్పిన వారికే రుణాలు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం జేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండ్రాజు వెంకటేశ్వర్లు, జిల్లా సంయుక్త కార్యదర్శులు పాలకొల్లు వెంకటేశ్వరరెడ్డి, దుగ్గిరెడ్డి జయరెడ్డి, జిల్లా యూత్ కార్యదర్శి వీరంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు బత్తుల దేవరాజు, బత్తుల కొండయ్య, మూరం మొరార్జి, లక్ష్మీనర్సయ్య లు పాల్గొన్నారు. -
ఒకరిపై కక్ష 121 మందికి శిక్ష
ఒంగోలు వన్‌టౌన్: అధికార పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. ఉద్యోగులపై కూడా అకారణంగా కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. కేవలం ఒక ఉపాధ్యాయుడిపై కక్షసాధింపు కారణంగా కనిగిరి నియోజకవర్గం పరిధిలోని సీఎస్‌పురం మండలంలో పనిచేస్తున్న 121 మంది ఉపాధ్యాయులకు అక్టోబర్, నవంబర్ నెలల జీతాలు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే..సీఎస్‌పురం మండలంలోని అంబవరం ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కే వెంకటేశ్వర్లును విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ అధికార పార్టీ నేతల సిఫార్సులతో విద్యాశాఖాధికారులు సెప్టెంబర్ 8న సస్పెండ్ చేశారు. దీంతో మండలంలోని ఉపాధ్యాయులంతా ఒంగోలుకు తరలివచ్చి కలెక్టర్‌ను, డీఈవోను కలిసి ఆ ఉపాధ్యాయుడి తప్పు లేకుండా సస్పెండ్ చేశారని వినతిపత్రాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 29న వెంకటేశ్వర్లు సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. అయినా వెంకటేశ్వర్లును తిరిగి విధుల్లోకి చేర్చుకోకుండా సీఎస్‌పురం ఎంఈవో సెలవు పెట్టి వెళ్లిపోయారు. డీఈవో ఉత్తర్వుల మేరకు వెంకటేశ్వర్లు అక్టోబర్ 9న తిరిగి విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు, మండలంలో పని చేస్తున్న మిగిలిన 121 మంది ఉపాధ్యాయులకు అక్టోబర్ నెల జీతాలు చెల్లించలేదు. ఈ క్రమంలో సీఎస్‌పురం ఎంఈవోగా ఇటీవల హైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి బాధ్యతలు స్వీకరించారు. అంబవరం స్కూలులో రికార్డులన్నింటినీ పరిశీలించి అవి సక్రమంగా ఉంటేనే అక్కడ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుకు జీతాలు చెల్లించాలని డీఈవో ఆమెను ఆదేశించారు. డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవో పాఠశాలను సందర్శించి అన్ని రికార్డులను పరిశీలించి సక్రమంగా ఉన్నట్లు తేల్చారు. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుతో పాటు మండలంలోని మిగిలిన 121 మంది ఉపాధ్యాయులకు అక్టోబర్, నవంబర్ నెల జీతాలు చెల్లించేందుకు ఎంఈవో బిల్లులను కనిగిరి ఉపఖజానాధికారి కార్యాలయంలో సమర్పించారు. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు విద్యాశాఖాధికారులపై మళ్లీ ఒత్తిడి తెచ్చారు. వెంకటేశ్వర్లుకు జీతాలు చెల్లించటానికి లేదని, మిగతా ఉపాధ్యాయులకు జీతాలివ్వాలని సూచించారు. అయితే విధి నిర్వహణలో ఉన్నందున ఆయన్ను మినహాయించి మిగతా వారికి జీతాలు చెల్లించేందుకు నిబంధనలు అంగీకరించవు. ఈ నేపథ్యంలో కనిగిరి ఉపఖజానాధికారి కార్యాలయంలో ఎంఈవో సమర్పించిన రెండు నెలల జీతాల బిల్లులను సవరణల సాకుతో వెనక్కి తెచ్చారు. కేవలం ఒక ఉపాధ్యాయుడ్ని టార్గెట్ చేస్తూ మండలంలోని ఉపాధ్యాయులందరికీ జీతాలు అందకుండా అడ్డుకుంటున్న వైనాన్ని ఉపాధ్యాయులందరూ నిరసిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అందరికీ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యాశాఖ అధికారుల తీరు ఆక్షేపణీయం పొట్టెండ్ల మాలకొండయ్య, ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుల జీతాల బిల్లులు ట్రెజరీకి పంపించి టోకెన్ నంబర్ కూడా ఓకే అయిన తరువాత బిల్లులు వెనక్కు తీసుకోవడం తగదు. విద్యాశాఖ అధికారుల తీరు ఆక్షేపణీయం. ఉపాధ్యాయులందరికీ వెంటనే జీతాలు చెల్లించాలి. వ్యక్తిగత కక్షతో ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు జేఎస్ ఆనంద్, ఉపాధ్యాయుడు వ్యక్తిగత కక్షతో ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లింపులో విద్యా శాఖ తీరును తీవ్రంగా నిరసిస్తున్నాం. ఉపాధ్యాయులందరికీ వెంటనే జీతాలు చెల్లించాలి. జీతం లేకుండా విధులు నిర్వర్తించమంటే ఎలా,గోపీ, ఉపాధ్యాయుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం. జీతాల మీదనే ఆధారపడి జీవిస్తున్నాం. రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఏ విదంగా విధులు నిర్వర్తించగలం. వెంటనే జీతాలు చెల్లించాలి,వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయుడు గత నెలలో ఎంఈవో మెడికల్ లీవ్ పెట్టారని జీతాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎంఈవో ఉన్నా కూడా జీతాల బిల్లులు పంపించకపోతే ఎలా, ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయుల జీతాల బిల్లులు ట్రెజరీకి పంపిస్తున్నాం,బత్తుల పద్మావతి, ఎంఈవో డీఈవో లిఖిత పూర్వక ఉత్తర్వుల మేరకు అంబవరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కమ్మనేతి వెంకటేశ్వర్లు జీతాన్ని నిలిపి వేసి మిగిలిన ఉపాధ్యాయులకు జీతాల బిల్లులు బుధవారం ట్రెజరీకి పంపుతున్నాం. -
‘ప్రకాశం’లో పారిశ్రామిక వికాసం
ఒంగోలు: గుంటూరు-విజయవాడ మధ్యలో రాజధాని రానుందనే విషయంపై స్పష్టత రావడంతో, పారిశ్రామికవేత్తల దృష్టి ప్రకాశం జిల్లాపై పడింది. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం పలువురు పారిశ్రామికవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నట్లు తెలిసింది. గత యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) ఏర్పాటుకు 7,500 ఎకరాలను సేకరించాలంటూ కలెక్టర్ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలంలో ఈ భూములను సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా విశాఖపట్నం తరహాలో ఫార్మా సిటీ ని కూడా ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. విశాఖలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో వీరంతా కాబోయే రాజధానికి దగ్గరలో ఉన్న ప్రకాశం జిల్లాను ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఎకరా భూమి ధర రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకూ పలుకుతోంది. బల్క్ డ్రగ్‌లను తయారు చేయడానికి ఒంగోలు, నెల్లూరు, కృష్ణా తీర ప్రాంతాలే అనువుగా ఉంటాయని ఫార్మా పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ నిమ్జ్, ఫార్మా సిటీలతో పాటు విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ లో కూడా ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు ప్రకాశం జిల్లాను ఎంపిక చేసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. కాబోయే రాజధానికి దగ్గరగా ఉండటం ఒక కారణమైతే, ఈ ప్రాంతంలో సహజ వనరులు ఎక్కువగా లభిస్తాయనేది మరో కారణం. ఈ జిల్లా ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు లాభసాటిగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న గ్రానైట్ పరిశ్రమలకు అనుబంధమైన పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారు. విశాఖ, చెన్నై కారిడార్ ద్వారా సీమాంధ్ర మొత్తం అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ప్రకాశం జిల్లాకు మరింతగా అవకాశాలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవడం ద్వారా జిల్లాలో నిరుద్యోగ సమస్యలను అధిగమించవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి కాకుండా చేనేత అనుబంధ పరిశ్రమలు కూడా పెరుగుతాయంటున్నారు. చీరాల, పేరాల ప్రాంతాల్లో తయారవుతున్న వస్త్రాలు కర్ణాటక రాష్ట్రానికి తరలివెళ్లి, అక్కడ నుంచి రెడీమేడ్ దుస్తులు తయారుచే సి, వాటిని తిరిగి ప్రకాశం జిల్లాలో కూడా విక్రయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి లేకుండా, ఇక్కడే రెడీమేడ్ దుస్తుల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. గత యూపీఏ ప్రభుత్వం చీరాల వద్ద టెక్స్టైల్ పార్కును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. పరిశ్రమలు తరలి వచ్చే అవకాశాలే ఎక్కువ భవిష్యత్తులో ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. చేనేత అనుబంధమైన సంస్థలు ఇక్కడకు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. గ్రానైట్, లేత్ పరిశ్రమలతో పాటు, పలకలు, టెక్స్టైల్ పార్కులు రావడానికి అనువైన ప్రదేశంగా ఈ జిల్లాను గుర్తించారు. కోటి రూపాయల లోపు పెట్టుబడితో వచ్చే పరిశ్రమలకు సబ్సిడీ కూడా ఇవ్వనున్నారు. రామాయపట్నం పోర్టు ఇక్కడే ఏర్పడితే, పరిశ్రమల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. - బొలిశెట్టి గౌరీశంకర్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్