ఒంగోలు వన్‌టౌన్: అధికార పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. ఉద్యోగులపై కూడా అకారణంగా కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. కేవలం ఒక ఉపాధ్యాయుడిపై కక్షసాధింపు కారణంగా కనిగిరి నియోజకవర్గం పరిధిలోని సీఎస్‌పురం మండలంలో పనిచేస్తున్న 121 మంది ఉపాధ్యాయులకు అక్టోబర్, నవంబర్ నెలల జీతాలు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే..సీఎస్‌పురం మండలంలోని అంబవరం ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కే వెంకటేశ్వర్లును విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ అధికార పార్టీ నేతల సిఫార్సులతో విద్యాశాఖాధికారులు సెప్టెంబర్ 8న సస్పెండ్ చేశారు.
దీంతో మండలంలోని ఉపాధ్యాయులంతా ఒంగోలుకు తరలివచ్చి కలెక్టర్‌ను, డీఈవోను కలిసి ఆ ఉపాధ్యాయుడి తప్పు లేకుండా సస్పెండ్ చేశారని వినతిపత్రాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 29న వెంకటేశ్వర్లు సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. అయినా వెంకటేశ్వర్లును తిరిగి విధుల్లోకి చేర్చుకోకుండా సీఎస్‌పురం ఎంఈవో సెలవు పెట్టి వెళ్లిపోయారు. డీఈవో ఉత్తర్వుల మేరకు వెంకటేశ్వర్లు అక్టోబర్ 9న తిరిగి విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు, మండలంలో పని చేస్తున్న మిగిలిన 121 మంది ఉపాధ్యాయులకు అక్టోబర్ నెల జీతాలు చెల్లించలేదు. ఈ క్రమంలో సీఎస్‌పురం ఎంఈవోగా ఇటీవల హైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి బాధ్యతలు స్వీకరించారు.
అంబవరం స్కూలులో రికార్డులన్నింటినీ పరిశీలించి అవి సక్రమంగా ఉంటేనే అక్కడ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుకు జీతాలు చెల్లించాలని డీఈవో ఆమెను ఆదేశించారు. డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవో పాఠశాలను సందర్శించి అన్ని రికార్డులను పరిశీలించి సక్రమంగా ఉన్నట్లు తేల్చారు. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుతో పాటు మండలంలోని మిగిలిన 121 మంది ఉపాధ్యాయులకు అక్టోబర్, నవంబర్ నెల జీతాలు చెల్లించేందుకు ఎంఈవో బిల్లులను కనిగిరి ఉపఖజానాధికారి కార్యాలయంలో సమర్పించారు. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు విద్యాశాఖాధికారులపై మళ్లీ ఒత్తిడి తెచ్చారు. వెంకటేశ్వర్లుకు జీతాలు చెల్లించటానికి లేదని, మిగతా ఉపాధ్యాయులకు జీతాలివ్వాలని సూచించారు.
అయితే విధి నిర్వహణలో ఉన్నందున ఆయన్ను మినహాయించి మిగతా వారికి జీతాలు చెల్లించేందుకు నిబంధనలు అంగీకరించవు. ఈ నేపథ్యంలో కనిగిరి ఉపఖజానాధికారి కార్యాలయంలో ఎంఈవో సమర్పించిన రెండు నెలల జీతాల బిల్లులను సవరణల సాకుతో వెనక్కి తెచ్చారు. కేవలం ఒక ఉపాధ్యాయుడ్ని టార్గెట్ చేస్తూ మండలంలోని ఉపాధ్యాయులందరికీ జీతాలు అందకుండా అడ్డుకుంటున్న వైనాన్ని ఉపాధ్యాయులందరూ నిరసిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అందరికీ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విద్యాశాఖ అధికారుల తీరు ఆక్షేపణీయం
పొట్టెండ్ల మాలకొండయ్య, ఉపాధ్యాయుడు
ఉపాధ్యాయుల జీతాల బిల్లులు ట్రెజరీకి పంపించి టోకెన్ నంబర్ కూడా ఓకే అయిన తరువాత బిల్లులు వెనక్కు తీసుకోవడం తగదు. విద్యాశాఖ అధికారుల తీరు ఆక్షేపణీయం. ఉపాధ్యాయులందరికీ వెంటనే జీతాలు చెల్లించాలి.
వ్యక్తిగత కక్షతో ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు
జేఎస్ ఆనంద్, ఉపాధ్యాయుడు
వ్యక్తిగత కక్షతో ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లింపులో విద్యా శాఖ తీరును తీవ్రంగా నిరసిస్తున్నాం. ఉపాధ్యాయులందరికీ వెంటనే జీతాలు చెల్లించాలి.
జీతం లేకుండా విధులు నిర్వర్తించమంటే ఎలా,గోపీ, ఉపాధ్యాయుడు
ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం. జీతాల మీదనే ఆధారపడి జీవిస్తున్నాం. రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఏ విదంగా విధులు నిర్వర్తించగలం.
వెంటనే జీతాలు చెల్లించాలి,వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయుడు
గత నెలలో ఎంఈవో మెడికల్ లీవ్ పెట్టారని జీతాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎంఈవో ఉన్నా కూడా జీతాల బిల్లులు పంపించకపోతే ఎలా, ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
ఉపాధ్యాయుల జీతాల బిల్లులు ట్రెజరీకి పంపిస్తున్నాం,బత్తుల పద్మావతి, ఎంఈవో
డీఈవో లిఖిత పూర్వక ఉత్తర్వుల మేరకు అంబవరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కమ్మనేతి వెంకటేశ్వర్లు జీతాన్ని నిలిపి వేసి మిగిలిన ఉపాధ్యాయులకు జీతాల బిల్లులు బుధవారం ట్రెజరీకి పంపుతున్నాం.
ఒకరిపై కక్ష 121 మందికి శిక్ష
Published Wed, Dec 3 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement