
ఓటర్ల జాబితాలో ఉన్న మృతురాలు తిరుపతమ్మ పేరు
సాక్షి, డీజీ పేట (ప్రకాశం): సీఎస్ పురం మండలంలోని డీజీ పేట పంచాయతీలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. ఈ పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల్లో దాదాపు 2,400 ఓట్లు ఉన్నాయి. మూడు బూత్‌లలో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే, ఈ ఏడాది జనవరి 11న ప్రకటించిన ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. మృతిచెందిన 30 మంది ఓట్లను జాబితా నుంచి తొలగించకుండా అలాగే ఉంచారు. కోవిలంపాటి తిరుపతమ్మ, వాడా జయమ్మ, కారంపూటి హుస్సేనయ్య, దువ్వూరి రమణారెడ్డి, అగ్నిగుండాల మస్తాన్‌బీ, కసుమూరి బాదుర్లా, పావలి వెంకటేశ్వర్లు, ఇస్కపల్లి చినమాలకొండయ్య, షేక్ చిన మౌలాలి, పలగొండ్ల వెంకటేశ్వర్లు, ఇలా దాదాపు 30 మంది మృతి చెందగా, వారి ఓట్లను నేటికీ తొలగించలేదు. అదేవిధంగా షేక్ జిలానీ, ఊటుకూరి ఏసయ్య తదితరులకు రెండు ఓట్లు ఉన్నాయి. ఒకే వార్డు, ఒకే ఇంట్లో ఉన్న ఓటర్లను విడదీసి వేరువేరు చోట్ల ఓటు నమోదు చేశారు. భార్యాభర్తల ఓట్లు కూడా వేరువేరు పోలింగ్ బూత్‌లలో ఉండటం గమనార్హం. జాబితా మొత్తం తప్పుల తడకగా ఉండటంతో ఓటర్లు తమ ఓటు ఉందో.. లేదో చూసుకోవాలంటే జాబితా మొత్తం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి ఓటర్ల జాబితాను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment