visakha mp seat
-
విశాఖ లోక్సభకు విజయమ్మ నామినేషన్
-
విశాఖ ప్రజలకు అందుబాటులో ఉంటా: విజయమ్మ
విశాఖ : విశాఖపట్నం లోక్సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు పార్టీ అభిమానులు, కార్యకర్తల నడుమ భారీ ర్యాలీగా వెళ్లి ఆమె నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో అభిమాన తరంగాలు ఎగిసిపడ్డాయి. అంతకు ముందు విశాఖ లోక్సభ నుంచి పోటీ చేస్తున్న విజయమ్మ నామినేషన్ దాఖలు చేసేందుకు కుమార్తె షర్మిలతో నగరానికి చేరుకున్న మహానేత కుటుంబ సభ్యులకు జిల్లా వాసులు అపూర్వ స్వాగతం పలికారు. నామినేషన్ సందర్భంగా పట్టణంలోని ప్రతి వీధి జన సంద్రమైంది. ర్యాలీగా బయలుదేరిన విజయమ్మకు అభిమానులు, కార్యకర్తలు ఎదురేగి స్వాగతాలు పలికారు. మహిళలు హారతులిచ్చి దీవెనలిందించారు. జోహార్ వైఎస్ఆర్ , జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ పార్లమెంట్ స్థానానికి గెలిచిన తర్వాత విశాఖ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అలాగే విశాఖను గ్రీన్ సిటీ, కాలుష్యరహిత నగరంగా చేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చుతామన్నారు. పేదల సంక్షేమం కోసం జగన్ పాటుపడుతున్నారని, ప్రజలకు వైఎస్ఆర్ లేని లోటు తీరుస్తారని విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదల సంక్షేమం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయిదు సంతకాలు చేస్తారని విజయమ్మ గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం పాటుపడతామని ఆమె తెలిపారు. -
రాజకీయాల్లోకి రావాలని ఉంది
పూసపాటిరేగ : రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఉందని సినీనటుడు శరత్ బాబు అన్నారు. నిన్న ఆయన శ్రీకాకుళం వెళ్తూ విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ప్రజలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శరత్ బాబు మాట్లాడుతూ వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడానికి రాబోయే ఎన్నికల్లో స్థానికులకే అవకాశం ఇవ్వాలన్నారు. విశాఖ ఎంపీ స్థానానికి బయటి వ్యక్తులు పోటీచేస్తే ఓడించాలని శరత్ బాబు పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థిగా తాను విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు సహకారంతో ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఆయనతో పాటు డైరెక్టర్ తిలక్, పర్యావరణ శాస్త్రవేత్త కమల్ కోయలాడా తదితరులు ఉన్నారు. -
మళ్లీ మళ్లీ చెప్పాలా? విశాఖ ఎంపీ టిక్కెట్ నాదే
నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ టిక్కెట్ తనదేనని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు. బుధవారం నెల్లూరులో విలేకర్లు అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన ఆయన మళ్లీ మళ్లీ చెప్పాలా? ఈసారి విశాఖ ఎంపీ టిక్కెట్ తనదేని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ సంవత్సరం తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు సుబ్బరామిరెడ్డి తెలిపారు. గత కొన్నాళ్లుగా విశాఖ పట్నం టికెట్ కోసం పట్టుబడుతున్న ఆయన తాజాగా మరోసారి విశాఖ ఎంపీ సీటుపై తన మనసులో మాటను బయటపెట్టారు. ఎలాగయినా విశాఖ సీటును ఈ సారి కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న సుబ్బరామిరెడ్డి అవకాశం వచ్చినప్పుడల్లా దాని గురించే మాట్లాడటం విశేషం. రాబోయే ఎన్నికలలో విశాఖ నుండి లోక్సభకు పోటీ చేయాలని ఆయన పరితపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్రమంత్రి పురందేశ్వరి విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.