
విశాఖ ప్రజలకు అందుబాటులో ఉంటా: విజయమ్మ
విశాఖ : విశాఖపట్నం లోక్సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు పార్టీ అభిమానులు, కార్యకర్తల నడుమ భారీ ర్యాలీగా వెళ్లి ఆమె నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో అభిమాన తరంగాలు ఎగిసిపడ్డాయి.
అంతకు ముందు విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న విజయమ్మ నామినేషన్ దాఖలు చేసేందుకు కుమార్తె షర్మిలతో నగరానికి చేరుకున్న మహానేత కుటుంబ సభ్యులకు జిల్లా వాసులు అపూర్వ స్వాగతం పలికారు. నామినేషన్ సందర్భంగా పట్టణంలోని ప్రతి వీధి జన సంద్రమైంది. ర్యాలీగా బయలుదేరిన విజయమ్మకు అభిమానులు, కార్యకర్తలు ఎదురేగి స్వాగతాలు పలికారు. మహిళలు హారతులిచ్చి దీవెనలిందించారు. జోహార్ వైఎస్‌ఆర్ , జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ పార్లమెంట్ స్థానానికి గెలిచిన తర్వాత విశాఖ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అలాగే విశాఖను గ్రీన్ సిటీ, కాలుష్యరహిత నగరంగా చేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చుతామన్నారు.
పేదల సంక్షేమం కోసం జగన్ పాటుపడుతున్నారని, ప్రజలకు వైఎస్ఆర్ లేని లోటు తీరుస్తారని విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదల సంక్షేమం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయిదు సంతకాలు చేస్తారని విజయమ్మ గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం పాటుపడతామని ఆమె తెలిపారు.