
మళ్లీ మళ్లీ చెప్పాలా? విశాఖ ఎంపీ టిక్కెట్ నాదే
వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ టిక్కెట్ తనదేనని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు.
నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ టిక్కెట్ తనదేనని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు. బుధవారం నెల్లూరులో విలేకర్లు అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన ఆయన మళ్లీ మళ్లీ చెప్పాలా? ఈసారి విశాఖ ఎంపీ టిక్కెట్ తనదేని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ సంవత్సరం తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు సుబ్బరామిరెడ్డి తెలిపారు.
గత కొన్నాళ్లుగా విశాఖ పట్నం టికెట్ కోసం పట్టుబడుతున్న ఆయన తాజాగా మరోసారి విశాఖ ఎంపీ సీటుపై తన మనసులో మాటను బయటపెట్టారు. ఎలాగయినా విశాఖ సీటును ఈ సారి కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న సుబ్బరామిరెడ్డి అవకాశం వచ్చినప్పుడల్లా దాని గురించే మాట్లాడటం విశేషం. రాబోయే ఎన్నికలలో విశాఖ నుండి లోక్సభకు పోటీ చేయాలని ఆయన పరితపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్రమంత్రి పురందేశ్వరి విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.