జైరాం రమేష్వి అర్థంలేని ఆరోపణలు
తిరుపతి : తాను పదవుల కోసం భారతీయ జనతా పార్టీలో చేరలేదని మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని ఆమె శుక్రవారమిక్కడ తెలిపారు. పొత్తులపై రేపటిలోగా స్పష్టత వస్తుందని పురందేశ్వరి పేర్కొన్నారు. బీజేపీ కూటమి గెలిస్తే సీమాంధ్రలో అభివృధ్ది సాధ్యమని ఆమె చెప్పుకొచ్చారు. జీవోఎం సభ్యుడు, కేంద్రమంత్రి జైరాం రమేష్ తనపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని పురందేశ్వరి మండిపడ్డారు.
కాగా మాజీ మంత్రి పురందేశ్వరి విశ్వాస ఘాతకురాలని జైరాం రమేష్ విమర్శించిన విషయం తెలిసిందే. ఎనిమిదేళ్ల పాటు కేంద్రమంత్రి పదవి కట్టబెట్టి సోనియాగాంధీ ఆమెను ప్రోత్సహించారని, అయితే క్లిష్ట సమయంలో స్వార్థం కోసం పార్టీని విడిచివెళ్లారని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పురందేశ్వరి అడిగిన హైదరాబాద్ యూటీ విషయం మినహా అన్నిటినీ కేంద్రం మన్నించిందన్నారు. కేంద్ర మంత్రులు అందరూ దుగ్గరాజపట్నం నౌకాశ్రయం గురించి అడిగితే ఆమె రామాయపట్నం గురించి అడిగారన్నారు. అక్కడ ఆమెకు స్థలాలు ఉండడంతోనే ఆ విధంగా పట్టుబట్టారనే ఆరోపణ వినిపించిందన్నారు.