పాపం చిన్నమ్మ.....
విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఎంపీ టికెట్ ఆశించి తెలుగుదేశం పార్టీ శల్య రాజకీయాల కారణంగా రాజంపేటకు వలస వచ్చిన కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరికి ఆశించిన ఆదరణ దక్కటం లేదు. రాజంపేటలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె రెండు నెలల క్రితం వరకూ కాంగ్రెస్ పార్టీలో చురుకైన నేతగా ఉన్నారు. రాష్ట్ర విభజన అంశంలో ఆశించిన మేరకు పోరాటం చేయకపోగా, పదవిని అంటిపెట్టుకుని అధిష్టానం చేతిలో కీలుబొమ్మగా ఉన్నారనే అపవాదును ఎదుర్కొన్నారు. రాజంపేటలో పోటీ చేస్తున్న ఆమె రాయలసీమ ఆడబిడ్డను అంటూనే, ఎన్టీ రామారావు కుమార్తెగా తనను ఆదరించాలని అభ్యర్థిస్తున్నారు.
సీమ ఆడబిడ్డగా పేర్కొంటున్న పురందేశ్వరి రాష్ట్ర విభజన అనివార్యమైతే అత్యంత దారుణంగా దెబ్బతిని పోయే ప్రాంతాల్లో రాయలసీమ మొదటిదని తెలిసీ కూడా ప్రశ్నించలేకపోయారని పలువురు నిలదీస్తున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సొంత అల్లుళ్లు వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నా నిలువరించలేదని ఎన్టీఆర్ అభిమానులు వాపోతున్నారు. అవకాశవాద రాజకీయాల్లో భాగస్వామిగా మారి ప్రస్తుతం సెంటిమెంటును ప్రదర్శిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. చిన్నమ్మ ప్రచారం చిలు పలుకుల్లా ఉండటం మినహా ప్రజాదరణ లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.