సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కోస్తా, రాయలసీమ మధ్యలో ఉన్న ఒంగోలులో కొత్త రాష్ట్రానికి రాజధాని నెలకొల్పాలని కోరుతూ ఉద్యమం ప్రారంభమైంది. దీనికి గాను ప్రత్యేకంగా రాజధాని సాధన సమితి (ఆర్‌ఎస్‌ఎస్) పేరుతో ఒక వేదిక ఏర్పాటైంది. వివిధ సంఘాలతో పాటు బీజేపీ, కాంగ్రెస్, జేఎస్‌పీ లాంటి పార్టీల నేతలు కూడా సమితికి సంఘీభావం తెలిపారు. ఒంగోలు రాజధాని కావడం వల్ల వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఉందని వీరు వాదిస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన గుంటూరు, విజయవాడ లాంటి ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తే..మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాంది పలికే అవకాశం కల్పించినట్లు అవుతుందని అంటున్నారు. అటు రాయలసీమకు, ఇటు కోస్తాంధ్రకు మధ్యలో ఉన్న ఒంగోలును రాజధాని చేయడం వల్ల ఇరు ప్రాంతాల వారు సంతృప్తి చెందుతారనేది వీరి వాదన.
ప్రకాశం జిల్లా రాజధానికి అనువైన ప్రాంతం. ఒంగోలు, మార్కాపురం మీదుగా రెండు రైలు మార్గాలున్నాయి. విమానాశ్రయం, నౌకాశ్రయాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. జాతీయ రహదారి, రాష్ట్రీయ రహదారులున్నాయి.
ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లాను కాదని..గుంటూరు, విజయవాడ మధ్యలో ఉన్న పంట పొలాలను ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నారని రాజధాని సాధన సమితి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా దొనకొండలో రాజధాని ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వం, కొందరు రాజకీయ నాయకుల స్వప్రయోజనాల కోసం నిర్ణయం మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
మరో పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ పాలన తెలంగాణలో జరగడం వల్ల తద్వారా వచ్చే పన్నులు తెలంగాణకే చెందుతాయని, ఇది కూడా సీమాంధ్రకు నష్టమేనని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో రాజధాని ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలుంటాయనే విషయంపై త్వరలోనే అన్ని జిల్లాలకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు సంసిద్ధమవుతున్నారు.
రాజధాని కోసం పట్టు
Published Wed, Jun 4 2014 2:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement