ఆకృతిని.. ప్రకృతిని మార్చేసింది
వాతావరణంపై హుద్‌హుద్ ఎఫెక్ట్
సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ విశాఖలోనే తీరాన్ని దాటడం వల్ల విశాఖను అతలాకుతలం చేసింది. పచ్చదనం నాశనమవ్వడంతో వర్షాలు సరిగా కురవడం లేదు. ఎక్కడోచోట అకాల వర్షాలు పడడం, మిగిలిన చోట్ల కురవకపోవడం జరుగుతోంది. విశాఖ వాతావరణం లోనూ మార్పులు సంభవించాయి. ఇక ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎండలు తడాఖా చూపించాయి. హుద్‌హుద్‌కు మరణాలు లేకపోయినా తర్వాత తీవ్రవడగాడ్పులకు జిల్లాలో వందలాది మంది మృత్యువాతపడ్డారు.
హుద్‌హుద్ లాంటిదే 1966లోనూ..
దాదాపు హుద్‌హుద్ తుపానులాంటిదే 50 ఏళ్ల క్రితం విశాఖను తాకింది. 1966 డిసెంబర్ 28న మొదలైన ఆ తుపాను 1967 జనవరి 2న విశాఖలోనే తీరాన్ని దాటింది. ఆ తుపాను బీభత్సానికి పోర్టు, తూర్పు నావికాదళం, హార్బర్ బాగా దెబ్బతిన్నాయి. అప్పట్లో ఇంతలా అభివృద్ధి చెందనందున నష్టతీవ్రత అంతగా లేదు. ఆ తర్వాత విశాఖ వైపు ఒకట్రెండు తుపాన్లు తీరం దాటే ప్రయత్నం చేసినా కొండల వల్ల అవి బలహీనపడ్డాయి. కానీ నిరుటి హుద్‌హుద్ ‘తుపాను కన్ను’ సరిగ్గా విశాఖపై నుంచే వె ళ్లడం, గాలి వేర్వేరు దిశల్లో ఉధృతంగా మారడం వల్ల నష్ట తీవ్రత పెరగడానికి కారణమైంది.
తీరం దాటింది గంగవరంలోనే!
హుద్‌హుద్ తుపాన్ తీరం దాటిన ప్రదేశంపై ఇన్నాళ్లూ స్పష్టత లేదు. తొలుత జిల్లాలోని అచ్యుతాపురం మండలం పూడిమడకలో దాటిందని కొందరు, కాదు విశాఖ కైలాసగిరి వద్ద దాటిందని ఇంకొందరు అంచనాలేశారు. అయితే విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సుదీర్ఘంగా శోధించి గంగవరం పోర్టు వద్ద అక్టోబర్ 12న మధ్యాహ్నం 1.30 గంటలకు తీరాన్ని దాటినట్టు తేల్చారు.
రోగాలకూ కారణమే..
విపరీతంగా తేమ పెరగడం వల్ల మేఘాలు ఏర్పడక వర్షాలను అడ్డుకుంటున్నాయి. చల్లగా ఉండాల్సిన అక్టోబర్‌లోనూ ఉక్కపోత ఎక్కువై ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలిలో తేమ పెరిగి, గాలి తగ్గిపోవడం వల్ల విషజ్వరాలు, ఇతర శ్వాసకోస వ్యాధులు విజృంభిస్తున్నాయి. చెట్లు ఉంటే చల్ల గాలి వీచి ఆరోగ్యాన్ని పంచేవి. లక్షలాది చెట్లు నేలమట్టమయ్యాయి. వాటిలో కొన్నే మళ్లీ జీవం పోసుకున్నాయి. తర్వాత అరకొరగా నాటిన మొక్కలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి.