విశాఖ-భీమిలి మధ్య నాలుగు లేన్ల మార్గం
విజయనగరం జిల్లా పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
చిపురుపల్లి: విశాఖపట్నం-భీమిలి మధ్య నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు గురువారం విజయనగరం జిల్లాకు వచ్చిన ఆయన గుర్ల మండలం గుజ్జంగివలసలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే ఎన్‌హెచ్-16 రహదారి, విశాఖ-భీమిలి మధ్య కొత్తగా ఏర్పాటు చేయబోయే నాలుగులేన్ల రహదారుల మధ్య పరిశ్రమలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. సముద్రం చిన్నచూపు చూస్తే దానిని సవాల్‌గా తీసుకుంటానన్నారు.
గత ప్రభుత్వాలు ఇవ్వనంతగా తుపానుల కాలంలో తాను ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చానని చెప్పారు. తుపాను బాధితులకు 70 వేల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. విజయనగరం రైతులకు ఎంతో అవసరమైన తోటపల్లి కుడిప్రధాన కాలువ పనులు ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. అలాగే అదే తోటపల్లి ప్రాజెక్టులో పవర్‌గ్రిడ్ ఏర్పాటు చేసి జిల్లా వాసులకు తాగునీటి కష్టాలు తీరుస్తానని అన్నారు. తుపాను నష్టాలను అంచనాలు వేస్తున్న అధికారులు పక్కాగా నష్టాలు పరిశీలించాలన్నారు. తప్పు చేసే అధికారులు ఎవరైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.
పింఛన్లు, రుణమాఫీ మాటేమిటి..
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో పింఛన్లు, రుణమాఫీ కోసం పలువురు వృద్ధ మహిళలు, రైతులు ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి నుంచి సరైన సమాధానం లభించలేదు. గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధ మహిళలు తమకు పింఛను తొలగించారంటూ ఆయన ముందుకు వెళ్లి అడిగారు. దీంతో అక్కడే ఉన్న కలెక్టర్ వారిని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరోవైపు రుణమాఫీ ఏదంటూ పలువురు రైతులు సభలో పలుమార్లు గళమెత్తారు.