Visakhapatnam-Chennai Industrial Corridor
-
రూ.551.9 కోట్లతో మూడు క్లస్టర్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) అభివృద్ధిలో భాగంగా ఏపీఐఐసీ రెండో దశ పనులపై దృష్టిసారించింది. విశాఖ సమీపంలోని నక్కపల్లి, అచ్యుతాపురం–రాంబల్లి, చిత్తూరు సౌత్ క్లస్టర్లను ట్రాంచ్–2 కింద అభివృద్ధి చేస్తోంది. ఏడీబీ రుణ సహాయంతో విశాఖ–చెన్నై కారిడార్‌ను రూ.5,604 కోట్లతో రెండు దశల్లో అభివృద్ధి చేయనుండగా, తొలిదశ పనులు తుదిదశకు రావడంతో ఇప్పుడు రెండో దశ పనులపై ఏపీఐఐసీ దృష్టిసారించింది. ఇందుకోసం మూడు క్లస్టర్లల్లో రూ.551.9 కోట్ల విలువైన పనులకు టెండర్లను ఆహ్వానించింది. వీటిద్వారా.. ► నక్కపల్లి క్లస్టర్లో సుమారు 1,120 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను రూ.302.01 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ పారిశ్రామిక పార్కు అందుబాటులోకి రావడానికి అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. ► అచ్యుతాపురం–రాంబల్లిలోని 396 ఎకరాల స్టార్టప్ ఏరియాలో కూడా రూ.105.79 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. ► చిత్తూరు సౌత్ జోన్‌లోని శ్రీకాళహస్తి క్లస్టర్లో 2,770 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.414.53 కోట్లు వ్యయం చేయనుండగా, ఇప్పుడు తాజాగా 1.2 ఎంఎల్డీ సామర్థ్యంతో ఉమ్మడి మురుగు నీటిశుద్ధి కేంద్రాన్ని (సీఈటీపీ–కామన్ ఎఫ్లు్యయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్) రూ.144.10 కోట్లతో ఏర్పాటుచేస్తోంది. ఈ టెండర్ల ప్రక్రియను మేలో పూర్తిచేసి పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్లు ఏపీఐఐసీ ఉన్నతాధికారులు తెలిపారు. ఏడు రెట్లు పెరగనున్న తయారీరంగం ఇక వీసీఐసీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్ర తయారీ రంగ ఉత్పత్తి ఏడు రెట్లు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారిడార్ కింద నక్కపల్లి వద్ద 4,316 ఎకరాలు, అచ్యుతాపురం–రాంబిల్లి వద్ద 2,532 ఎకరాలు, మచిలీపట్నంలో 12,145 ఎకరాలు, శ్రీకాళహస్తి–ఏర్పేడులో 24,324 ఎకరాలు, దొనకొండలో 17,117 ఎకరాలు, కొప్పర్తిలో 6,914 ఎకరాల్లో మొత్తం 6 భారీ పారిశ్రామిక పార్కులను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఈ ఆరు పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర తయారీ రంగంవిలువ ఏడు రెట్లు పెరిగి 2035 నాటికి రూ.7.8 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. దీనివల్ల 1.1 కోట్ల మందికి అదనంగా ఉపాధి లభించనుంది. -
వైజాగ్–చెన్నై కారిడార్ పనులు చకచకా
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కీలకమైన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం రూ.5,544 కోట్లతో రెండు దశల్లో ఈ కారిడార్ పనులు జరుగుతున్నాయి. తొలి దశ కింద రూ.2,278.61 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను 2023 మార్చి నాటికి పూర్తిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో ఇప్పటికే రూ.815.17 కోట్ల విలువైన పనులు పూర్తికాగా.. మిగిలిన పనులు తుది దశలో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.306.56 కోట్ల విలువైన పనులు పూర్తిచేస్తే.. గడచిన రెండున్నరేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.508.61 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. ఇందులో ఇప్పటికే నాయుడుపేట క్లస్టర్లో 1 ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి యూనిట్, శ్రీకాళహస్తి–ఏర్పేడు క్లస్టర్‌కు సంబంధించి విద్యుత్ సరఫరా పనులు పూర్తయ్యాయి. నాయుడుపేట, అచ్యుతాపురం క్లస్టర్‌కు సంబంధించి నీటి సరఫరా, విద్యుత్ వంటి కీలక మౌలిక వసతులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేవిధంగా ఏపీఐఐసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదలైన రెండో దశ పనులు కాగా, రూ.2,599.56 కోట్లతో రెండో దశకు సంబంధించిన పనులను కూడా ఏపీఐఐసీ చేపట్టింది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ.4,125 కోట్లు రుణం రూపంలో సమకూర్చనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,419 కోట్లు వ్యయం చేయనుంది. ఈ ప్రాజెక్టు కింద విశాఖ నోడ్‌లో నక్కపల్లి వద్ద 4,316 ఎకరాలు, రాంబిల్లి వద్ద 2,532 ఎకరాలు, చిత్తూరు సౌత్ బ్లాక్ నోడ్‌లో 13,319 ఎకరాలు, వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద 2,596 ఎకరాలను పారిశ్రామిక అవసరాల కోసం అభివృద్ధి చేస్తున్నారు. ఒక్కసారి వీసీఐసీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్ర పారిశ్రామిక ఉత్పత్తి ఏడు రెట్లు, రాష్ట్ర జీడీపీ ఆరు రెట్లు పెరుగుతుందని అంచనా. 2015లో రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర తయారీ రంగ ఉత్పత్తి 2035 నాటికి రూ.7,82,300 కోట్లకు, రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.11.60 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అదనంగా 1.10 కోట్ల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా. -
విశాఖ-చెన్నై కారిడార్‌పై అధ్యయనం పూర్తి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సంబంధించి ఏడీబీ (ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్) అధ్యయనం పూర్తయిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విదేశీ ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన డాష్ బోర్డ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఏడీబీ అధ్యయనం పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఐఐఎఫ్‌టీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థలను కాకినాడ ఎక్స్పోర్ట్ జోన్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించిందన్నారు. ఎన్ఐడీ-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే తాత్కాలిక భవనంలో తరగతులు ప్రారంభించామన్నారు. విదేశీ ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలను పూర్తి పారదర్శకతతో నిర్వహించడానికే డాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. డెరైక్టర్ జన రల్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ దీన్ని నిర్వహిస్తుంద ని వివరించారు.