రూ.551.9 కోట్లతో మూడు క్లస్టర్ల అభివృద్ధి  | Development of three clusters in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రూ.551.9 కోట్లతో మూడు క్లస్టర్ల అభివృద్ధి 

Published Sun, Apr 10 2022 3:11 AM | Last Updated on Sun, Apr 10 2022 8:20 AM

Development of three clusters in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (వీసీఐసీ) అభివృద్ధిలో భాగంగా ఏపీఐఐసీ రెండో దశ పనులపై దృష్టిసారించింది. విశాఖ సమీపంలోని నక్కపల్లి, అచ్యుతాపురం–రాంబల్లి, చిత్తూరు సౌత్‌ క్లస్టర్లను ట్రాంచ్‌–2 కింద అభివృద్ధి చేస్తోంది. ఏడీబీ రుణ సహాయంతో విశాఖ–చెన్నై కారిడార్‌ను రూ.5,604 కోట్లతో రెండు దశల్లో అభివృద్ధి చేయనుండగా, తొలిదశ పనులు తుదిదశకు రావడంతో ఇప్పుడు రెండో దశ పనులపై ఏపీఐఐసీ దృష్టిసారించింది. ఇందుకోసం మూడు క్లస్టర్లల్లో రూ.551.9 కోట్ల విలువైన పనులకు టెండర్లను ఆహ్వానించింది. వీటిద్వారా..

► నక్కపల్లి క్లస్టర్‌లో సుమారు 1,120 ఎకరాల్లో స్టార్టప్‌ ఏరియాను రూ.302.01 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ పారిశ్రామిక పార్కు అందుబాటులోకి రావడానికి అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. 
► అచ్యుతాపురం–రాంబల్లిలోని 396 ఎకరాల స్టార్టప్‌ ఏరియాలో కూడా  రూ.105.79 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు.
► చిత్తూరు సౌత్‌ జోన్‌లోని శ్రీకాళహస్తి క్లస్టర్‌లో 2,770 ఎకరాల్లో స్టార్టప్‌ ఏరియాను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.414.53 కోట్లు వ్యయం చేయనుండగా, ఇప్పుడు తాజాగా 1.2 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఉమ్మడి మురుగు నీటిశుద్ధి కేంద్రాన్ని (సీఈటీపీ–కామన్‌ ఎఫ్లు్యయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌) రూ.144.10 కోట్లతో ఏర్పాటుచేస్తోంది. ఈ టెండర్ల ప్రక్రియను మేలో పూర్తిచేసి పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్లు ఏపీఐఐసీ ఉన్నతాధికారులు తెలిపారు.


ఏడు రెట్లు పెరగనున్న తయారీరంగం
ఇక వీసీఐసీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్ర తయారీ రంగ ఉత్పత్తి ఏడు రెట్లు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారిడార్‌ కింద నక్కపల్లి వద్ద 4,316 ఎకరాలు, అచ్యుతాపురం–రాంబిల్లి వద్ద 2,532 ఎకరాలు, మచిలీపట్నంలో 12,145 ఎకరాలు, శ్రీకాళహస్తి–ఏర్పేడులో 24,324 ఎకరాలు, దొనకొండలో 17,117 ఎకరాలు, కొప్పర్తిలో 6,914 ఎకరాల్లో మొత్తం 6 భారీ పారిశ్రామిక పార్కులను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఈ ఆరు పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర తయారీ రంగంవిలువ ఏడు రెట్లు పెరిగి 2035 నాటికి రూ.7.8 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. దీనివల్ల 1.1 కోట్ల మందికి అదనంగా ఉపాధి లభించనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement