సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద అభివృద్ధి చేస్తున్న కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ(క్రిస్ సిటీ) నిర్మాణానికి మూడు సంస్థలు పోటీ పడుతున్నాయి. తొలి దశలో సుమారు 2,006 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,054.6 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది.
ఈ పనులు చేజిక్కించుకునేందుకు ఎన్‌సీసీ, నవయుగ, షాపూర్‌జీపల్లోంజీ సంస్థలు వేసిన బిడ్లు సాంకేతికార్హత సాధించాయి. ఈ మధ్యనే జరిగిన ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో సాంకేతిక అర్హత సాధించిన ఈ మూడు బిడ్లు ఆమోదం పొందాయి. త్వరలోనే ఆర్థిక అంశాలను పరిశీలించాక రివర్స్ టెండరింగ్ విధానంలో ఒక సంస్థను ఎంపిక చేయనున్నట్టు ఏపీఐఐసీకి చెందిన ఉన్నతాధికారి చెప్పారు.
చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా మొత్తం 11,095.9 ఎకరాల్లో క్రిస్ సిటీ నిర్మాణాన్ని చేపడుతుండగా.. అందులో తొలి దశలో 2,000 ఎకరాలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నిక్‌డిక్ట్ నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం ఏపీఐఐసీ నిక్‌డిక్ట్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్‌మెంట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసింది.
ఈ మొత్తం ప్రాజెక్టుకు ఇప్పటికే పూర్తిస్థాయి పర్యావరణ అనుమతులూ మంజూరయ్యాయి. ఈ పారిశ్రామికవాడకు కండలేరు నుంచి నీటిని సరఫరా చేస్తారు. తుది బిడ్ ఎంపిక కాగానే త్వరలోనే పనులు ప్రారంభించేలా ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే 2.96 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది.
క్రిస్ సిటీ నిర్మాణానికి మూడు సంస్థలు పోటీ
Published Tue, Oct 4 2022 4:27 AM | Last Updated on Tue, Oct 4 2022 4:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment