వచ్చే నెలలో ‘కృష్ణపట్నం నోడ్‌’ టెండర్లు  | Krishnapatnam Industrial Node Tenders In April Month | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో ‘కృష్ణపట్నం నోడ్‌’ టెండర్లు 

Published Sat, Mar 14 2020 5:13 AM | Last Updated on Sat, Mar 14 2020 5:13 AM

Krishnapatnam Industrial Node Tenders In April Month - Sakshi

సాక్షి, అమరావతి: బెంగళూరు–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (సీబీఐసీ)లో భాగంగా ప్రతిపాదిత కృష్ణపట్నం నోడ్‌ (పారిశ్రామిక ప్రాంతం) పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు 13,882.9 ఎకరాల్లో ఉద్దేశించిన ఈ పారిశ్రామిక నోడ్‌లో సెప్టెంబర్‌ నుంచి పనులు ప్రారంభించేందుకు కార్యాచరణను సిద్ధంచేసింది. తొలిదశలో రూ.2,139 కోట్ల పెట్టుబడి అంచనాతో 3,090 ఎకరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్, ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ (నిక్‌డిట్‌)తో కలిసి 50 : 50 భాగస్వామ్యంతో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్పీవీ)గా నిక్‌డిట్‌ కృష్ణపట్నం ఇండ్రస్ట్రియల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ను సర్కారు ఏర్పాటుచేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ, పర్యావరణ తుది అనుమతులు రాగానే టెండర్ల ప్రక్రియ మొదలుపెడతామని ఏపీఐఐసీ ఎండీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌భార్గవ తెలిపారు.  

కాగితాల్లో నుంచి కార్యరూపంలోకి.. 
గత కొన్నేళ్లుగా కేవలం కాగితాలకే పరిమితమైన ఈ కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్‌ పనులపై వైఎస్‌ జగన్‌ సీఎం కాగానే దృష్టిసారించారు. దీంతో పనులు వేగంగా జరుగుతున్నాయని, ఏప్రిల్‌లో ఈపీసీ టెండర్లు పిలిచి సెప్టెంబర్‌లో పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మీదుగా వెళ్లే సీబీఐసీ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి కోసం జపాన్‌కు చెందిన జైకా రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది.   

మూడు క్లస్టర్ల అభివృద్ధి.. 
కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్‌లో వివిధ రంగాల పరిశ్రమలను ఆకర్షించేందుకు వీలుగా మూడు రకాల క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. అవి.. 
- ఫుడ్‌ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, మినరల్స్‌ తదితర పరిశ్రమల కోసం క్లస్టర్‌–1ను అభివృద్ధి చేస్తారు. 
ఆటోమొబైల్, ఆటోమొబైల్‌ విడిభాగాల తయారీ పరిశ్రమలకు క్లస్టర్‌–2ను ఏర్పాటుచేస్తారు.  
ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌ పరికరాల కోసం కస్టర్‌–3ను అభివృద్ధి చేస్తారు.  

5.15 లక్షల మందికి ఉపాధి 
ఈ పారిశ్రామిక నోడ్‌లో పరిశ్రమలకు సుమారు 7,785 ఎకరాలు, నివాసాల కోసం 1,699 ఎకరాలు.. మిగిలిన మొత్తాన్ని మౌలిక వసతుల కల్పన.. ఇతర అవసరాలకు వినియోగించనున్నారు.  
ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు రూ.37,500 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని అంచనా. 
తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5.15 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. మొత్తం 99,400 కుటుంబాలు నివాసం ఉండటం ద్వారా ఈ నోడ్‌లో 3.12 లక్షల మంది నివాసం ఉంటారన్న అంచనాతో మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement